ఇరాన్‌ అంటే భయమెందుకు?

ఇరాన్‌ అనగానే కఠినమైన చట్టాలు.. క్రూరమైన శిక్షలు విధించే ఒక ముస్లిం దేశం మన కళ్ల ముందు కనిపిస్తుంది. కానీ ఇదంతా నిజం కాదంటారు అక్కడకు వెళ్లొచ్చిన పర్యాటకులు. ఇరాక్‌ గురించి బయట జరుగుతున్న ప్రచారంలో 90శాతం అసత్యమేనంటారు. ఇరాన్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఎలా మసలుకోవాలో తెలుసుకుందాం..
 
స్నేహపూర్వకమైన ప్రజలు
ప్రపంచంలో అత్యంత పురాతనమైన పట్టణాలున్న దేశాల్లో ఇరాన్‌ కూడా ఒకటి. తమ సంస్కృతి, సంప్రదాయాలకు అక్కడి ప్రజలు అధిక ప్రాధాన్యమిస్తారు. 1979లో జరిగిన హింసాత్మక సంఘటనల తర్వాత ఇరవై ఏళ్ల పాటు ఇరాన్‌పై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. ఇప్పుడిప్పుడే ఆంక్షలు సడలుతుండటంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. వాస్తవానికి ఇరాన్‌ అనేక తెగల సంగమం.
 
ఇక్కడ అజరీ, కుర్దిష్‌, పర్షియన్‌ వంటి అనేక తెగల ప్రజలు కనిపిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన సంస్కృతి. అందరూ పర్యాటకులను ఆదరిస్తారు. అందువల్ల ఇరాన్‌కు వెళ్లాలంటే భయపడాల్సిన అవసరమే లేదు. అయితే అక్కడి ప్రజలు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ‘సలాం’ చేసుకుంటూ ఉంటారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలి. ఇరాన్‌లో ప్రజలు పాశ్చాత్య దుస్తులే ధరిస్తారు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఫ్యాషన్‌ వచ్చినా.. అది వెంటనే ఇరాన్‌ రాజధాని తెహ్రాన్‌లో ప్రత్యక్షమవుతుంది.
అయితే మహిళలు కురచ దుస్తులు ధరించటం ఇరాన్‌లో నేరం. అందువల్ల అక్కడకు వెళ్లినప్పుడు కురచ బట్టలు వేసుకోకూడదు. అలాగే, పురుషులు లాగులు ధరించి బయటకు రావటం నిషిద్ధం. పర్యాటకులు ఈ రెండు విషయాలను గమనిస్తే చాలు. ప్రపంచంలో రుచికరమైన ఆహారపదార్థాల్లో పర్షియన్‌ వంటకాలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని ఆస్వాదించాలంటే ఇరాన్‌ వెళ్లాల్సిందే.
 
రకరకాల రోటీలు, స్వీట్లు అక్కడ విరివిరిగా లభిస్తాయి. ఇరాన్‌లో ఎవరి ఇంటికైనా వెళ్లాలంటే స్వీట్స్‌ను తప్పనిసరిగా తీసుకువెళ్లాల్సిందే. ఇరాన్‌లో ఎక్కడికి వెళ్లినా పరిశుభ్రమైన మంచినీరు లభిస్తుంది. ఇక హోటళ్లకు వెళ్లినప్పుడు టిప్పులను తప్పనిసరిగా ఇవ్వాలి.
-స్పెషల్‌ డెస్క్‌