ఖజకిస్థాన్‌లో రాత్రిపూట జర భద్రం

ఆంధ్రజ్యోతి, 27-03-2018: ఖజకిస్థాన్‌ ఒకప్పటి అవిభాజ్య రష్యాలో ఒక భాగం. రష్యా ముక్కలు అయిపోయిన తర్వాత ఖజకిస్థాన్‌ స్వతంత్ర దేశంగా మారింది. ఒక వైపు సముద్రం, మరో వైపు కొండలతో రకరకాల ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షించే ఈ దేశం గురించి మరింతగా తెలుసుకుందాం..

జలపాతాలు.. పచ్చటి అడవులు.. కొండలు.. సముద్రం.. వీటన్నింటినీ ఇష్టపడే పర్యాటకులు తప్పనిసరిగా వెళ్లాల్సిన దేశం ఇది. అందుకే ఇక్కడకి వెళ్లే యాత్రికులు కనీసం వారం, పది రోజులు ప్రకృతి ఒడిలో గడుపుతారు. ఖజకిస్థాన్‌ ప్రజలు కూడా తమ దేశంలో పర్యటించే యాత్రికుల పట్ల చాలా ఆదరాభిమానాలు చూపుతారు. ఇక స్థానిక ఆచారాల విషయానికి వస్తే.. ఇక్కడ ప్రజలు తమ ఇంటికి వచ్చిన వారికి తినటానికి ఏదో ఒకటి పెడతారు. ఇంట్లో ఏమి లేకపోతే కనీసం బ్రెడ్‌ అయినా అందిస్తారు. తినకపోతే అవమానకరంగా భావిస్తారు. అందువల్ల ఎక్కడికైనా వెళ్లినప్పుడు వారు పెట్టిన ఆహార పదార్థాలను తినాలి. ఇదే విధంగా బాటిల్స్‌లో నీళ్లను తప్ప విడిగా తాగకపోవటం మంచిది. అవిభాజ్య రష్యాలో సైన్యం ఖజకిస్థాన్‌లో అణు ప్రయోగాలు చేసేదని.. అందువల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితమైపోయాయని కొన్ని వదంతులు ఉన్నాయి. వీటిలో నిజానిజాల సంగతి పక్కనపెడితే వీలైనంత వరకూ బాటిల్స్‌లో లభించే పరిశుభ్రమైన నీటిని తాగటం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడవు. ఇక ఇక్కడి ప్రజలు ఎక్కువగా మాట్లాడరు. గాసిప్‌ కూడా తక్కువే! అందువల్ల కొత్తగా పరిచయం అయిన వారితో వివిధ అంశాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
 
బయటకు వెళ్లినప్పుడు..
ఖజకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు పర్యాటకులకు అంత సేఫ్‌ కాదు. కాబట్టి వీలైనంత వరకూ బృందాలుగా ఏర్పడి తిరగటమే మంచిది. ముఖ్యంగా రాత్రిళ్లు ఎవరూ ఒంటరిగా బయటకు వెళ్లకపోవటం మంచిది. ఇక వివిధ పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు - అక్కడ మంచి వసతులు ఉండకపోవచ్చు. కాబట్టి ముందే అక్కడ లభించే సౌకర్యాలను గమనించి వెళ్లటం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పుతాయి. ముఖ్యంగా ఖజకిస్థాన్‌లో పర్యాటకులు ఉపయోగించుకోగలిగే బాత్‌రూమ్‌ల సంఖ్య చాలా తక్కువ. అందువల్ల బయటకు వెళ్లే ముందే జాగ్రత్త పడాలి.
-స్పెషల్‌ డెస్క్‌