మోసకారి మొగుడా.. పాస్‌పోర్టు ఖల్లాస్‌!

తాళికి విలువలేదు.. ఆలికి బతుకులేదు

పెరుగుతున్న ప్రవాసుల వివాహ వివాదాలు.. 
పాస్‌పోర్టు జప్తుతో తిక్క కుదర్చాలని సర్కారు యత్నం

కాబోయే మొగుడు విదేశాల్లో ఉంటే బతుకు సుఖమయం.. అనుకునే పడతులెందరో! కానీ ఇది ఒకప్పటి మాట.. విదేశీ అల్లుణ్ణి తెచ్చుకోడానికి తల్లిదండ్రులు జంకుతున్నారు.. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక- భార్యను రాచిరంపాన పెడుతూ, వారిని కాలానికీ, ఖర్మానికీ వదిలేస్తున్నవారు ఎక్కువవుతున్నారు. చట్టానికి చిక్కరు.. కోర్టులకు అందరు..పెద్ద మనుషుల మాట వినరు.. విడాకులివ్వరు.. ఇష్టానుసారం బతుకుతూంటారు.
 
ఇలాంటి ప్రబుద్ధుల ఆట కట్టించడానికి కేంద్రం నడుం బిగించింది. ఎన్నారైల వివాహ వ్యవహారాలపై మూడు మంత్రిత్వ శాఖలు, జాతీయ మహిళా కమిషన్‌లతో ఓ నోడల్‌ ఏజెన్సీ- ఐఎన్‌ఏ ను ఏర్పాటుచేసింది. తెగ కొవ్వెక్కి, భార్యలను కొట్టి- వదిలేసి- కనిపించకుండా పోయిన ఓ పదిమంది భర్తల పాస్‌ పోర్టులను జప్తు చేస్తే- వారు దారికొస్తారని ఐఎన్‌ఏ సిఫార్సు చేసింది. దాన్ని ఆమోదించిన కేంద్రం- ఆ శాడిస్టు భర్తలకు తాఖీదులు పంపింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఓ సమాధానంలో ఈ విషయం చెప్పారు.  ప్రభుత్వ లెక్కల ప్రకారం- విదేశాల్లో ఉన్న భారత ఎంబసీలకు 2015 నుంచి ఇప్పటిదాకా- వివాహ వివాదాలకు సంబంధించి- 3328 ఫిర్యాదులు అందాయి. ఇవన్నీ భార్యలు తమ భర్తలపై చేసిన ఫిర్యాదులే. వీటిలో 3268 గొడవల్ని కౌన్సెలింగ్‌, గైడెన్స్‌, విదేశీ చట్టాలపై అవగాహన కల్పించడం.. మొదలైన మార్గాల ద్వారా పరిష్కరించారు. తెలుగు రాష్ట్రాల విషయమే తీసుకుంటే- 2015 దాకా దాదాపు 4560 ఎన్నారైల పెళ్లిళ్లు పెటాకులయ్యాయి.. ఇది పోలీస్‌ స్టేషన్లు, ఫ్యామిలీ కోర్టులకు చేరిన వాటి లెక్క మాత్రమే. కోర్టుకు చేరని వారెందరో! 
 
తాళి బంధం తెగిపోయిన కేసుల్లో అధికశాతం భర్తల వేధింపులే కారణంగా కనిపిస్తోంది. కట్నం మరింత కావాలని కోరేవారు కొందరైతే- దాంపత్యం కుదరక విడిపోయే వారు ఎక్కువ. బాధాకరమైన విషయమేంటంటే- ఈ తెగదెంపులు పిల్లలు పుట్టాక చేసుకోవడం. బలవంతంగా భార్యల్ని వదిలించుకునే దుస్సంప్రదాయానికి అడ్డుకట్ట పడాలని ఎన్నో ఏళ్లుగా మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికి ఓ గట్టి అడుగు ముందుకు పడింది. గతంలో లుక్‌అవుట్‌ నోటీసులు, రెడ్‌ కార్నర్‌ నోటీసులు కూడా ఉండేవి. అయితే గృహ హింస కేసులకు రెడ్‌ కార్నర్‌ పరిధిలోకి తీసుకురావడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దాంతో దాన్ని ఎత్తేశారు. లుక్‌ అవుట్‌ నోటీసులవల్ల కొంత ప్రయోజనం ఏర్పడింది.. కొన్ని అరెస్ట్‌లు కూడా జరిగాయి. 
 
ఈ అంశాన్ని ఎప్పటినుంచో పరిశీలిస్తున్న కేంద్రం- రిజిస్టర్‌ అయిన  ఎన్నారై వివాహాల డేటాను సమీకరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రాల వారీగా ఈ ప్రక్రియ సాగుతోంది. మహిళా కమిషన్లు కూడా ఇందుకు సాయపడ్తున్నాయి. ఎన్నారైలు తప్పనిసరిగా తమ పెళ్లిళ్లను రిజిస్టర్‌ చేసేట్లుగా న్యాయశాఖ ఓ చట్టం కూడా తేనుంది. రిజిస్టర్‌ అయిన పెళ్లిళ్ల వివరాలను మహిళా శిశుసంక్షేమ శాఖ తన వెబ్‌సైట్లో పెడుతుంది. నిజానికి సుప్రీంకోర్టు 2006లోనే ఈ నిర్బంధ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఓ తీర్పు ఇచ్చింది. దాన్ని ఇన్నేళ్లూ కేంద్ర బుట్టదాఖలా చేసింది. 
 
విదేశీ కోర్టులే బెస్ట్‌..
పాస్‌పోర్టును జప్తు చేయడమే కాదు, రద్దు చేయాలని మహిళాసంఘాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. ‘‘ఇది మా దీర్ఘకాల డిమాండ్‌.. వివాహం చేసుకుని ఏడాదో రెండేళ్లో కాపురం చేసి ఆ తరువాత- నయానో భయానో పుట్టింటికి పంపేస్తున్న భర్తలనేక మంది ఉన్నారు. ఇలా పంపేసి.. వారు వెళ్లాక వారి వీసాను రద్దు చేయించేస్తున్నారు. వీసా రూల్స్‌ ప్రకారం ఆరు వారాలపాటు రాకపోతే అది రద్దు అయిపోతుంది. అంటే ఈ బాధిత మహిళలు ఆ దేశాల్లో అడుగు పెట్టే వీలు కూడా ఉండదు. ఆ శాడిస్టులు విడాకులు ఇవ్వరు. తీసుకోరు. ఎంతోమంది మహిళలు చేసే తప్పు ఇదే.. గొడవలు వస్తే అమ్మానాన్నల దగ్గరికి వచ్చేస్తారు. ఇక్కడికొచ్చాక అక్కడ విదేశంలో ఉంటున్నవాడిని ఎలా దారికి తెస్తాం? అదీకాక ఇక్కడికొచ్చాక ఆ అమ్మాయిలు విడాకుల నోటీసిస్తున్నారు.. ఏంటి లాభం? అమెరికాలోనూ, పశ్చిమ దేశాల్లోనూ కోర్టుల్లో సరైన న్యాయం లభిస్తుంది.. వెంటనే కూడా ఆ కేసులు తేలిపోతాయి.. మేం ఇచ్చే సలహా ఏంటంటే- గొడవలొస్తే అక్కడే పరిష్కరించుకోండి- విడాకులు తీసుకుంటే అక్కడే తీసుకోండి..!’’ అని ప్రగతిశీల మహిళా సంస్థ సంధ్య వివరించారు.