బ్యాంకే దివాలా తీస్తే?

కంచే చేను మేస్తే..? భద్రంగా ఉంటుందని సొమ్ము దాచుకున్న బ్యాంకే దివాలా తీస్తే..?? అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఓ బిల్లు మీ ఖాతాలోని సొమ్ముకు ప్రస్తుతమున్న భద్రత కూడా కరువయ్యేలా చేయనుందని హెచ్చరిస్తున్నారు.
 
మీ ఖాతాలో డబ్బు సంగతేంటి? దడ పుట్టిస్తున్న కేంద్రం బిల్లు
ప్రస్తుతం మీ ఖాతాలోని సొమ్ములో లక్ష రూపాయల వరకు బ్యాంక్‌ బీమా కవరేజీ కల్పిస్తుంది. ఒకవేళ బ్యాంక్‌ దివాలా తీసినా రూ.లక్ష వరకైతే తిరిగి చేతికొస్తుంది. అంతకు మించి జమ చేసిన సొమ్ముకు మాత్రం ఎలాంటి భద్రత ఉండదు. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఫైనాన్షియల్‌ రిజొల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డిఐ) బిల్లుపై కొందరు విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు గనుక చట్టంగా మారితే బ్యాంక్‌ ఖాతాల్లోని సొమ్ముకు ఇప్పుడున్న భద్రత కూడా లేకుండా పోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, దివాలా తీసిన బ్యాంకు డిపాజిటర్ల సొమ్ముతో కొంత నష్టాలను పూడ్చుకునేందుకు ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లులోని ‘బెయిల్‌ ఇన్‌’ ప్రొవిజన్‌ వీలుకల్పిస్తుంది. అయితే, బ్యాంకర్లు మాత్రం ఈ బిల్లు విషయంలో ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.
 
ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు అమలులోకి వచ్చినా ప్రస్తుతం లక్ష రూపాయల వరకు డిపాజిట్‌పై కల్పిస్తున్న బీమా కవరేజీ సౌకర్యం యథాతథంగానే కొనసాగుతుందంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారంగానూ బ్యాంక్‌ దివాలా తీసిన పక్షంలో పొదుపు ఖాతాదారులకు పూర్తి సొమ్ము తిరిగి చేతికి రాదని ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. బ్యాంకులతోపాటు ఆర్థిక సేవల రంగానికి చెందిన ఇతర సంస్థల దివాలా పరిష్కారం కోసం కేంద్రం ఎఫ్‌డిఆర్‌ఐ బిల్లును ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘం సమీక్షిస్తున్నది. కమిటీ ఓకే చెబితే కేంద్రం ఈ బిల్లును శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది.