అమెరికా సంయుక్త స్థూపం

స్ఫూర్తిదాతలు, ఆదర్శ నీయులు, మహనీయులతో పాటు, ప్రాణత్యాగం చేసిన వారికి స్మారకస్థూపాలు కట్టడం సర్వసాధారణమే. పూర్వకాలంలో అయితే.. రాజులు తమ విజయాలకు సూచికగా విజయ స్తంభాలు నిర్మించే వాళ్లు. పార్టీలకు, జంతువులకు కూడా స్మారకస్థూపాలు నిర్మించేవారు. కానీ అమెరికాలో ఉన్న ఓ స్థూపం మాత్రం వీటికి భిన్నం. 
 
అమెరికా సంయుక్త రాష్ట్రంలో మొత్తంగా యాభై రాష్ట్రాలున్నాయి. ఆ దేశ జాతీయపతాకంలో కూడా రాష్ట్రాల సంఖ్యను తెలిపే విధంగా యాభై నక్షత్రాలు ఉంటాయి. ఇదంతా ఎందుకంటే.. అక్కడి ప్రతి రాష్ట్రం నుంచి తెప్పించిన రాళ్లతో.. నిర్మించిన ఓ స్మారక స్థూపం ఫ్లోరిడాలోని కిస్సిమ్మీలో ఉంది. దీన్ని ‘మాన్యుమెంట్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ పేరుతో పిలుస్తారు. ఒకప్పుడు దీన్ని చూసేందుకు వందలాది సందర్శకులు వచ్చేవారు. కానీ కాలక్రమంలో స్థూపం ప్రాముఖ్యాన్ని కోల్పోయింది. ఇటీవల కాలంలో సందర్శన ప్రాంతంగా మళ్లీ అందర్నీ ఆకట్టుకుంటోంది. 
 
ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన ఘటనల్లో.. ‘పెరల్‌ హార్బర్‌’పై జపాన్‌ చేసిన దాడి ఒకటి. ఈ దాడిలో అనేకమంది సైనికులు మరణించారు. యుద్ధనౌకలు, వాహనాలు

ధ్వంసమయ్యాయి. అయితే అక్కడే నివాసముండే చార్లెస్‌ డబ్ల్యూ బ్రెస్లర్‌ పెట్టిస్‌ అనే వైద్యుడు ఈ దాడిని ఖండించాడు. ఈ దాడి ఘటనను గుర్తుకుతెచ్చేలా ఓ స్మారక స్థూపాన్ని నిర్మించాలనుకున్నాడు. ఆ స్థూపం కూడా తన ఒక్కడి స్పందనగా ఉండకూడదు.. యావత అమెరికాను ప్రతిబింబించాలని భావించాడు. అందుకోసం యూఎస్‌లోని అన్ని రాష్ట్రాల గవర్నర్లకు వారి వారి రాష్ర్టాల్లోని రాళ్లను పంపాల్సిందిగా కోరుతూ లేఖలు రాశాడు. అందరూ స్పందించి.. రాళ్లను పంపించారు. అలా యూఎస్‌లోని ఆయా రాష్ట్రాల నుంచి సేకరించిన రాళ్లతో.. బ్రెస్లర్‌, స్థానిక(కిస్సిమ్మి ) ప్రభుత్వ సాయంతో, ‘మాన్యుమెంట్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ను 1943లో నిర్మించాడు.

ఏ రాయి.. ఏ రాష్ట్రానికి చెందిందో తెలిసేలా రాళ్లపై రాష్ట్రాల పేర్లు కూడా స్పష్టంగా చెక్కించారు. స్థూపం పైభాగంలో అమెరికా జాతీయ పతాకాన్ని, ఓ డేగను ఏర్పాటు చేశారు. 
 
ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఫ్రాంక్లిన్‌ డి. రూజ్‌వెల్ట్‌ కూడా తన ఎస్టేట్‌లోని రాయితో పాటు, మరికొన్ని రాళ్లను ‘మాన్యుమెంట్‌ ఆఫ్‌ స్టేట్స్‌’ నిర్మాణం కోసం పంపించారు. 
 
1954లో చార్లెస్‌ మరణించినా.. స్థానిక స్వచ్ఛంద సంస్థలు.. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రాళ్లను స్థూపంపై అమర్చారు. 1971లో వాల్ట్‌ డిస్నీ వరల్డ్‌ ఏర్పాటు కావడంతో.. స్థూపాన్ని చూడటానికి వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గింది. 2001లో దీనికి మరిన్ని సొబగులు అద్ది, కొత్త కళను తీసుకువచ్చారు. 2015లో జాతీయ చారిత్రక ప్రాంతాల జాబితాలో దీన్ని చేర్చడంతో.. సందర్శకుల తాకిడిమళ్లీ పెరిగింది.