ఎన్నారై, టెక్కీ పెళ్లికొడుకులకు డిమాండ్‌

హైదరాబాద్‌లో పెరిగిపోతున్న పెళ్లికాని ప్రసాద్‌లు

కట్నం వద్దన్నా కనికరించని ఆడపిల్లల తల్లిదండ్రులు
కులాంతర వివాహానికి సై అన్నా షాదీ నై
ప్రైవేట్‌ ఉద్యోగులకు పెళ్లిచూపులే మిగులు

పెళ్లెప్పుడవుతుంది బాబూ! మాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు..అంటూ నిర్వేదగీతాలు ఆలపిస్తున్నారు హైదరాబాద్ నగర యువకులు. పెళ్లికాని ప్రసాద్‌లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. కారణాలు ఏమైతేనేం? హైదరాబాద్‌లో పెళ్లికాని యువకులు..షాదీ మాటే వద్దు గురూ అంటూ నిర్వేదం ప్రకటిస్తున్నారు. ఇది తగిన జోడు దొరకక ఏర్పడుతున్న నిర్వేదం. ప్రతి వందమంది పురుషులకు కేవలం 87 శాతమే మహిళల జనాబా ఉందని అనధికారిక లెక్కలు ఉన్నా అంతకన్నా తక్కువే అన్నది పెళ్ళిళ్ళ కోసం వేచిచూస్తున్న యువకుల సంఖ్యను బట్టి చూస్తే అర్థమవుతుంది. అందం వున్నా, ఉన్నతోద్యోగమైనా పెళ్లి కూతురు దొరక్క వివాహ యోగానికి దూరం అవుతున్నారు. 
 
ఎన్‌ఆర్‌ఐయా? టెక్కీయా? 
పెళ్లీడు అమ్మాయిలున్న తల్లిదండ్రులందరిదీ ఒకటే చాయిస్‌. పెళ్లికొడుకు సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనలా? విదేశాల్లో ఉన్నాడా? ఇవే వారు చేసే వాకబు. సంబంధాలు చూసేటప్పుడు వీరికే ప్రయారిటీ ఇస్తున్నారు. డబుల్‌ పీజీలు చేసి సర్కారీ కొలువుల వేటలో వెనకబడి ప్రైవేట్‌ ఉద్యోగాలలో ఉన్న యువకులకు ఎవరూ పిల్లను  ఇవ్వడం లేదని తల్లితండ్రులు వాపోతున్నారు. 
 
కులాలని కాదనుకున్నా..!
కులాంతర వివాహం చేసుకుందామనుకున్నా, కట్నం తీసుకోమని హామీ ఇస్తున్నా.. ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తున్న యువకుల వైపు ఆడపిల్లల తల్లిదండ్రులు చూడటంలేదు. అన్ని కులాల్లోనే ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో యువకులు చేసేది లేక తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గాను మ్యారేజ్‌ బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు. 
 
డిగ్రీలు, పీజీలు అంతకన్నా ఎక్కువే చదివిన వేలాది యువకులు ప్రభుత్వ ఉద్యోగాల వేటలో మునిగిపోతారు. ఆ తరువాత ఉద్యోగాలు దొరకకపోయినా ఏదో ఒక వ్యాపారమో, ప్రైవేట్‌ ఉద్యోగమో చేసుకుంటూ బాగానే  సంపాదించుకుం టారు. ఒక వయస్సు వచ్చే దాకా  సెటిల్‌ అవుదామనే తపనలో మునిగిపోయి పెళ్లి వద్దనుకుంటారు. ఆ తరువాత  చేసుకుందామనుకున్నా తగిన జోడు దొరకదు.