జర్మనీ అక్కడ... మనమెక్కడ?

70 ఏళ్ల క్రితం ఒకేసారి మొదలైన ప్రస్థానం

అభివృద్ధిలో అగ్రస్థానాన జర్మనీ
అభివృద్ధి చెందుతూనే ఉన్న భారత్‌
నైపుణ్యం క్రమశిక్షణలే ఇద్దరిలో తేడా
జర్మనీ, భారత్‌... దాదాపు డెబ్బయ్యేళ్ల క్రితం రెండు దేశాలు సున్నా నుంచి తమ ప్రస్థానం మొదలెట్టాయి. రెండో ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైన జర్మనీ, రెండొందలేళ్ల వలస పాలనలో సంపదలన్నీ కోల్పోయిన భారత్‌... కొత్త జీవితాన్ని ప్రారంభించాయి. ఈ డెబ్బయ్యేళ్లలో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. భారతదేశం మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉంది. ఎందుకీ వ్యత్యాసం? కారణాలను పరిశీలిద్దాం. 
-జర్మనీ నుంచి డా. గుంటూరు వనమాలి.
 
చరిత్రను అర్థం చేసుకుంటే వర్తమానం అర్థమవుతుంది. జర్మనీ సంపదకు, భారతదేశపు పేదరికానికి కారణాలున్నాయి. జర్మనీ పుట్టుకలోనే ప్రత్యేకత ఉంది. 25 చిన్న, పెద్ద రాజ్యాల ప్రజలు, రాజులు కలిసి అందరి మాతృభాష జర్మనే కనుక మనది ఒకే జాతి అనే నిర్ణయానికి వచ్చారు. జర్మన్‌ మాట్లాడే అన్ని రాజ్యాల్ని, ప్రాంతాల్ని కలిపి 1871లో జర్మనీ దేశాన్ని సృష్టించుకున్నారు. అడ్డుపడ్డ శత్రు దేశాల్ని మూడు యుద్ధాల్లో ఓడించారు. ఆధునిక సమాజం అంగీకరించక పోయినా యుద్ధంతోనే దేశంలో అభివృద్ధి వాతావరణం ఏర్పడుతుందని గ్రీకు తత్వవేత్తలు చెబుతారు. దేశం కుటుంబంగా మారి, శరవేగంతో అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తుంది.
 
జర్మనీ దేశంగా ఆవిర్భవించి 40 ఏళ్లు నిండకముందే ఆర్థిక, సైనిక బలిమితో అగ్రదేశాల శ్రేణిలో చేరింది. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌ల ఆధిపత్యాన్నే సవాల్‌ చేసింది. ఫలితంగా రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం కరువుతో వేల మంది జర్మన్లు చనిపోయారు, విద్యుత్‌ ఉత్పాదన సున్నకు దగ్గరగా వచ్చింది. జర్మన్ల సంకల్ప బలం, పట్టుదల, కృషి కారణంగా ఆ దేశం మళ్లీ నేలకు కొట్టిన బంతిలా పుంజుకుని అభివృద్ధి బాట పట్టింది. స్వల్పకాలంలోనే విద్యుదుత్పత్తి నాలుగు వేల రెట్లు పెరిగింది.
 
ఇంతటి అభివృద్ధి ఎలా సాధ్యమయ్యింది? అంటే.. జర్మనులు గొప్ప శ్రమశీలురు. కాలాన్ని ప్రణాళికాబద్ధంగా విభజించుకోవడం, దాని ప్రకారం పని పూర్తి చేయడం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. వ్యవస్థ మొత్తం అలాంటి క్రమశిక్షణ జర్మనీలో కనపడుతుంది. బస్సులు, రైళ్లు.. ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా ప్రయాణిస్తాయి. ఉద్యోగులు, కార్మికులు నిర్ణీత సమయాలకు కార్యాలయాలకు చేరుకుంటారు. ఆర్థిక వ్యవస్థ ఎలాంటి ఒడుదొడుకులూ లేకుండా పురోగమిస్తుంది.
 
ఆదుకున్న అమెరికా
రష్యా కమ్యూనిజం నుంచి ప్రపంచాన్ని రక్షించే పేరుతో అమెరికా కోట్లాది డాలర్లతో జర్మనీని పునరుజ్జీవింపజేసింది. ఆ సాయంతో జర్మనీ సర్వతోముఖాభివృద్ధి సాధించింది. భారత్‌ పరిస్థితి భిన్నం. ప్రజాస్వామ్య దిగ్గజాలు భారత్‌ అభివృద్ధికి అవరోధాలు కల్పించడమేకాక, సైనిక నియంతృత్వం ఉన్న పాకిస్థాన్‌కు, కమ్యూనిస్టు నియంతృత్వం ఉన్న చైనాకుసహాయం చేశాయి. మనదేశం రక్షణ కోసమే చాలా ధనం వినియోగించాల్సి వచ్చింది. ప్లేటో చెప్పినట్లు.. ‘సన్యాసుల పాలన’ అంటే నిస్వార్థపరుల పాలన ఏర్పడాలి. దేశాభివృద్ధికి కంకణం కట్టుకున్న నిస్వార్థ దీక్షాపరులు శ్రమ పడితే మనం గమ్యాన్ని చేరవచ్చు.
 
పనిలో శిక్షణ.. పనిపై గౌరవం
జర్మనీ ప్రభుత్వం ఉద్యోగార్థులకు వారు ఎంచుకున్న వృత్తుల్లో 3 సంవత్సరాల పాటు తర్ఫీదు ఇప్పిస్తుంది. ఈ తర్ఫీదు వల్ల.. సామాన్య కార్మికుడు నిపుణుడుగా మారుతాడు. జర్మనీలో ఇలా పరీక్షాయుతమైన తర్ఫీదు లేనిదే ఏ వృత్తిలోనైనా పని చెయ్యడానికి అనుమతి దొరకదు. దర్జీ, వడ్రంగి, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, బేల్దారి.. ఎవరికైనా ఇదే షరతు. శిక్షణ పొందిన కార్మికులను జర్మనీ ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుంది.