ట్రంప్ ప్రవర్తనా, మోదీ శైలీ రెండూ ప్రమాదకరమే!

న్యూఢిల్లీ, ఆంధ్రజ్యోతి, 01-03-2018: ఉత్తమ జర్నలిస్టులకు ప్రతి ఏడాది ప్రదానం చేసే ఎన్‌.ఆర్‌. చందూర్ అవార్డ్‌ను స్వీకరించేందుకు వాషింగ్టన్ పోస్ట్, వాల్‌స్ర్టీట్‌ జర్నల్ లాంటి ప్రతిష్టాత్మక పత్రికలకు మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేసిన జర్నలిస్టు నరిసెట్టి రాజు ఇటీవల ఢిల్లీకి వచ్చినపుడు ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ. కృష్ణారావు ఆయనతో జరిపిన ఇష్టాగోష్టి.

అమెరికాలో ప్రింట్‌మీడియా భవిష్యత్తు, అక్కడ పాఠకుల తీరుతెన్నులు...
అమెరికాలో వార్తాపత్రికలకు రోజురోజుకూ సర్క్యులేషన్ తగ్గిపోతోంది. రోజురోజుకూ పాఠకులు, ముఖ్యంగా యువ పాఠకులు డిజిటల్ వేదికల్ని ఆశ్రయిస్తున్నారు. అమెరికాలో దాదాపు 1300 దినపత్రికలున్నాయి. గత అయిదేళ్లుగా వాటి సంఖ్యలో పెద్ద మార్పు లేదు. పత్రికలు చదవడం తగ్గిపోవడం కొనసాగుతున్నప్పటికీ న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ద వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి పేపర్ల మనుగడకు సమీప భవిష్యత్‌లో ఢోకా లేదు. దీనికి కారణం ఈ పత్రికలు డిజిటల్, టీవీ వంటి రకరకాల వేదికల్ని కూడా ఉపయోగించుకునే మీడియా కంపెనీల్లో భాగం కావడం. అయితే అమెరికాలో చిన్న నగరాలు, పట్టణాల్లో ప్రింట్ మీడియా గడ్డు సమస్యల్ని ఎదుర్కొంటున్నది. రేడియో లాగా ప్రింట్ మీడియా చాలా కాలం ఉండవచ్చు కాని పత్రికల్ని ఎక్కువగా 45-–75 మధ్య వయస్సున్న పాఠకులే చదువుతున్నారు.
 
అంటే డిజిటల్ జర్నలిజం వల్ల ప్రింట్‌ మీడియా ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటున్నదన్నమాట...
ఇది క్రమంగా జరిగిన పరిణామం. ఎందుకంటే చాలా వార్తాపత్రికలు కొత్త పాఠకుల్ని, ముఖ్యంగా యువ పాఠకులను చేర్చుకోవడం లేదు. ప్రింట్‌తో పాటు వెబ్, మొబైల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, స్నాప్‌చాట్ లాంటి రకరకాల న్యూస్ రూమ్ ‌లను ఏర్పర్చి మనుగడ సాధించగలుగుతున్నాయి. డిజిటల్ వేదికల పాఠకులే పెరిగినందువల్ల పత్రికలు ఆదాయ సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. ఈ రోజుల్లో అమెరికాలో చాలా న్యూస్ కంపెనీలు డిజిటల్ చెల్లింపులు, చందా పద్ధతులను ఆశ్రయించి ప్రకటనల ఆదాయానికి అదనంగా పాఠకులనుంచి కూడా ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. డిజిటల్ వీడియో కూడా అభివృద్ధికి బాగానే తోడ్పడుతున్నది. డిజిటల్ పద్ధతుల ద్వారా నిర్దిష్ట వర్గాలను ఉద్దేశించడం సాధ్యం కనుక ప్రకటనదారులు కూడా వాటిని ఇష్టపడుతున్నారు. ప్రింట్లో అడ్వర్టైజింగ్ కన్నా డిజిటల్‌లో ప్రకటనలను మరింత సులభంగా లెక్కించవచ్చు
 
సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాల్లో అమెరికా మీడియా పాత్ర
వాస్తవాలను, అభిప్రాయాలను వెల్లడించడం ద్వారా న్యూస్‌ మీడియా అప్పుడూ ఇప్పుడూ రాజకీయాలను, ఎన్నికలను కూడా ప్రభావితం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అమెరికాలో న్యూస్ మీడియాలో ఒక వర్గం (ఎన్‌బిసి) వామపక్ష, మరొక వర్గం (ఫాక్స్) మితవాద రాజకీయాలను అనుసరిస్తున్నాయి. ఎడిటోరియల్ పేజీలకు సంబంధించి అమెరికా వార్తాపత్రికల్లో న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వంటివి ఉదారవాద వైఖరిని అనుసరిస్తే, వాల్‌స్ట్రీట్ జర్నల్ వంటివి సాంప్రదాయ వైఖరిని అనుసరిస్తాయి. కాని ఈ పత్రికల్లో వార్తలకు సంబంధించిన పేజీల్లో మాత్రం తటస్థత కనపడుతుంది. కొన్ని మీడియా బ్రాండ్ యజమానులు, ప్రధానంగా టీవీ యజమానులు, అటు రిపబ్లికన్స్ వైపు కానీ, ఇటు డెమోక్రట్ల వైపు కానీ మొగ్గు చూపుతున్నారు. అయితే భారత దేశంలో లాగా రాజకీయనాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ వార్తాపత్రికలను నడపడం లేదు.
 
మీడియా విషయంలో మోదీ, ట్రంప్ మధ్య ఉన్న పోలికలు
మోదీ, ట్రంప్‌ ఇద్దరూ జనాదరణ గల నాయకులే. సోషల్ మీడియా తదితర మార్గాల్లో ప్రజలను నేరుగా చేరుకునే కళలో వారు నిష్ణాతులే. కాని ప్రధానమంత్రి మోదీ పాలనలో అనుభవం ఉన్న రాజకీయనాయకుడు. ఒక జాతీయ పార్టీతో సుదీర్ఘకాలం సంబంధం ఉన్నవాడు. కాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాపారంలో విఫలుడైన వ్యక్తి. ఆయన కంపెనీలు ఎన్నో ఏళ్లుగా సమస్యల్ని ఎదుర్కొంటున్నాయి. మోదీ రాజకీయాలకు ఒక సైద్ధాంతిక మూలం ఉన్నది. కాని ట్రంప్ రాజకీయాల వెనుక ఎలాంటి నిజమైన మౌలిక విశ్వాసాలు లేవు. ట్రంప్ తనకు ఇష్టంలేని వార్తలను ఫేక్ న్యూస్‌గా అభివర్ణిస్తారు. తనకిష్టం లేని సిఎన్‌ఎన్ వంటి ఇతర గ్రూప్‌లపై తప్పుడు ఆరోపణలు చేస్తారు. మోదీ ప్రభుత్వం మీడియాపై ఒత్తిడి తేవడంలో ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి వారు తమ గొంతు తగ్గించుకునేలా చేస్తుంది. అందుకు రకరకాల ఒత్తిళ్లను ప్రయోగిస్తుంది. ట్రంప్ ప్రవర్తన, మోదీ శైలి రెండూ ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరం. అయితే ట్రంప్‌ను బలంగా విమర్శించడంలో అమెరికన్ మీడియా ఇంకా సమర్థవంతంగా పనిచేస్తోంది. కాని భారత దేశంలో ప్రభుత్వ ఒత్తిళ్ల రీత్యా అప్రకటితంగానే సమస్యల పట్ల మెతకగా వ్యవహరించడం కనపడుతోంది.
 
పరిశోధనాత్మక జర్నలిజం, కుంభకోణాలకు ప్రాధాన్యత..
పరిశోధనాత్మక జర్నలిజం విషయంలో అమెరికన్ ప్రెస్ ఇంకా బలంగా ఉన్నది. గత ఏడాదిగా అది ఎన్నో పరిశోధనాత్మక, విమర్శనాత్మక కథానాల్ని ప్రచురించింది. వ్యాఖ్యల్ని చేసింది. అమెరికన్ మీడియాకు మరెక్కడా లేని విధంగా పరిశోధనలు చేసేందుకు వీలుగా అమెరికా రాజ్యాంగం తన తొలి సవరణ ద్వారా వీలు కల్పించింది. సమాచార స్వేచ్ఛ చట్టాలు అందుకు మరింత తోడ్పడుతున్నాయి. భారత దేశంలో ప్రభుత్వం, అధికారుల గుప్పిట్లో ఇప్పటికీ ఎంతో సమాచారం నియంత్రణకు గురవుతోంది. జరుగుతున్న అవకతవకల గురించి సాక్ష్యాలు సంపాదించడం భారతదేశంలో సులభం కాదు. అమెరికాలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది.
 
పత్రికా స్వేచ్ఛపై దాడులు..
భారత దేశంతో పోలిస్తే మాత్రం అమెరికా ప్రెస్ ప్రత్యక్ష, పరోక్ష ఆంక్షలకు గురి కావడం లేదు. ఒబామా తోపాటు ఇతర అధ్యక్షుల పాలనలో వారు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని, సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నారన్న పేరుతో విజిల్ బ్లోవర్స్ వెంటపడి ఉండవచ్చు. కాని అదృష్టవశాత్తు అమెరికన్ పౌర హక్కుల సంఘం, ఇతర మీడియా కంపెనీలు ఇలాంటి చర్యలపై న్యాయస్థానాల్లో పోరాడగలుగుతున్నాయి. అమెరికా న్యాయస్థానాలు పత్రికా స్వేచ్ఛకున్న రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు ముందుకు వస్తున్నాయి. గత ఏడాదిగా ట్రంప్ పాలనలో జర్నలిస్టులు, వార్తాసంస్థలపై మౌఖిక దాడులు పెరుగుతున్నాయి. ఇది ప్రమాదకరమైన పరిణామం. భారత దేశంలో మీడియాకు మెజారిటీ ప్రకటనలు ప్రభుత్వం నుంచే రావడం, న్యూస్ ప్రింట్ దిగుమతులను నియంత్రించడం, మీడియాతో సంబంధంలేని వ్యాపారం చేసే మీడియాసంస్థలను శిక్షించడానికి వెనుకాడకపోవడం వంటివి జరుగుతున్నాయి. కనుక మీడియా యజమానులను లొంగదీసుకునే సామర్థ్యం ఎక్కువ. అమెరికాలో ఇలా జరగదు. మన దేశంలో ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ లాంటి సంస్థలకు అధికారాలు లేవు. అవి ఉన్నా లేనట్లే.
 
సమాచార హక్కు నామమాత్రమే...
అమెరికాలో రాజ్యాంగ తొలి సవరణ జర్నలిజానికి అత్యంత శక్తిమంతమైన కవచంలా పనిచేస్తుంది. భారతదేశంతో పాటు ప్రపంచంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే పత్రికలను తన పని తాను చేసుకోనివ్వాలి. పత్రికా స్వేచ్ఛ గురించి గొప్పలు చెప్పుకుంటారు కాని ఆర్‌టిఐ లాంటి చట్టాలున్నా పత్రికా స్వేచ్ఛకు ఎన్నో అవరోధాలున్నాయి. ప్రభుత్వ సమాచారంలో అధిక భాగం అనేక ఇతర దేశాల్లో లాగా బహిరంగంగా, సులభంగా లభ్యం కాదు. దీని వల్ల ప్రభుత్వానికి, అధికారులకు జర్నలిస్టులపై, జర్నలిజంపై ఎక్కువ అధికారాలు లభిస్తున్నాయి.
 
‘మింట్’లో పనిచేసి వెనక్కి వెళ్లడానికి కారణాలు
‘మింట్’ పత్రికను 2007లో స్థాపించడం, రెండవ అతి పెద్ద వ్యాపార పత్రికగా అది విజయం సాధించడం లో నాకెంతో గొప్ప అనుభవం లభించింది. భారతీయ న్యూస్ రూమ్‌లో ప్రమాణాలు చాలా తక్కువ. మింట్‌లో ప్రవర్తనా నియమావళి, సవరణలు చేసుకునే విధానాలను నెలకొల్పినందుకు నాకు గర్వంగా ఉన్నది. భారతీయ జర్నలిజంలోనే అది విశిష్టమైనది. కాని జర్నలిస్టులలో ఎక్కువ మంది వాస్తవాలను తనిఖీ చేసుకోవాలనే మౌలిక పద్ధతిని పాటించకపోవడం, సందర్భాన్ని ఉటంకించకపోవడం, విమర్శనాత్మకంగా వ్యవహరించలేకపోవడం భారతదేశంలో ఎక్కువగా కనపడుతోంది. తమను తాము నియంత్రించుకుంటున్నామని మీడియా సంస్థలు చెప్పుకుంటున్నప్పటికీ భారతదేశంలో స్వయం నియంత్రణ దాదాపు లేదు. మరో వైపు విమర్శనాత్మకంగా వ్యవహరిస్తే భారతదేశం పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నామని ముద్రవేసే తత్వం ఒకటి కనపడుతోంది.
 
జర్నలిజంలో రావడానికి ప్రేరణ
హైదరాబాద్‌లో మధ్యతరగతి కుటుంబంలో మా తల్లిదండ్రులు నరిసెట్టి ఇన్నయ్య, వెనిగళ్ల కోమలతో పాటు పెరిగాను. చదువుకోవడం తప్ప జీవితంలో విజయం సాధించడానికి వేరే మార్గం లేని కుటుంబం మాది. నేను, నా చెల్లెలు అస్తమానం పుస్తకాలు, వార్తాపత్రికల మధ్య, ఆకాశవాణి, బిబిసి వార్తలు వింటూ పెరిగాము. మా ఇంటికి వచ్చే వారితో కానీ, బయట కానీ చర్చల్లో పాల్గొంటే మా తల్లిదండ్రులు ప్రోత్సహించేవారే కాని అడ్డు చెప్పేవారు కారు. చైతన్యకళాశాలలో ఇంగ్లీష్ టీచర్ ఆనంది శంకర్ ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరిచిపోలేను. 1985లో రూరల్ మేనేజిమెంట్‌లో ఎంబిఏ చేసిన తర్వాత నాలో విశ్వాసం పెరిగింది. టైమ్స్ స్కూల్ ఆఫ్ జర్నలిజంలో ప్రొఫెసర్ థామస్ ఓమ్మెన్ నాకు జర్నలిజంలో మౌలిక పాఠాలు నేర్పి విదేశాల్లో చదువుకొమ్మని ప్రోత్సహించారు. ఎకనమిక్స్ టైమ్స్‌లో టిఎన్ నైనన్ మొదట ఉద్యోగం ఇచ్చారు. వీరందరూ నా విజయానికి కారకులు.
 
యువజర్నలిస్టులకు ఏది అవసరం
ఒక జర్నలిస్టుకు దేనినైనా తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. చుట్టూ ఉన్న అన్ని అంశాలపై ప్రశ్నలు వేసేందుకు వెనుకాడకూడదు. ప్రశ్నలకు జవాబులు అన్వేషించడం, వాటిని పాఠకులతో పంచుకోవడం నిరంతరం జరగాలి.
 
(నరిసెట్టి రాజు ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా గ్రూప్ ‘గిజ్ మోడో’ సిఇఓ గా, వికీమీడియా ఫౌండేషన్ ట్రస్టీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.)
  • మోదీ ప్రభుత్వం మీడియాపై ఒత్తిడి తేవడంలో ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి వారు తమ గొంతు తగ్గించుకునేలా చేస్తోంది. అందుకు రకరకాల ఒత్తిళ్లను ప్రయోగిస్తోంది. ట్రంప్ ప్రవర్తన, మోదీ శైలి రెండూ ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరం.
  • అమెరికన్ మీడియాకు మరెక్కడా లేని విధంగా పరిశోధనలు చేసేందుకు వీలుగా అమెరికా రాజ్యాంగం వీలు కల్పించింది. భారత దేశంలో ప్రభుత్వమూ, అధికారుల గుప్పిట్లో ఇప్పటికీ ఎంతో సమాచారం నియంత్రణకు గురవుతోంది. జరుగుతున్న అవకతవకల గురించి సాక్ష్యాలు సంపాదించడం భారతదేశంలో సులభం కాదు.
  • భారత దేశంలో మీడియాకు మెజారిటీ ప్రకటనలు ప్రభుత్వం నుంచే రావడం, న్యూస్ ప్రింట్ దిగుమతులను నియంత్రించడం, మీడియాతో సంబంధంలేని వ్యాపారం చేసే మీడియాసంస్థలను శిక్షించడానికి వెనుకాడక పోవడం వంటివి జరుగుతున్నాయి. కనుక మీడియా యజమానులను లొంగదీసుకునే సామర్థ్యం ఎక్కువ.