హాంకాంగ్‌లో ట్యాక్సీలు వద్దు

హాంకాంగ్‌.. ఒకప్పుడు బ్రిటన్‌ ఆధీనంలోను.. ప్రస్తుతం చైనా పాలన కింద ఉన్న అత్యాధునికమైన ద్వీపం. అందమైన సందర్శన స్థలాల దగ్గర నుంచి అత్యాధునికమైన టెక్నాలజీ పార్కుల దాకా అనేక ఆకర్షణీయమైన స్థలాలున్న ఈ దేశంలో ఎలా మెలగాలో తెలుసుకుందాం..

అక్కడి సిమ్‌లు వద్దు..
హాంకాంగ్‌లో ప్రజలు కొత్తవారిని చాలా ఆత్మీయంగా పలకరిస్తారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లటానికి మెట్రో రైళ్లు.. బస్సులు ఉంటాయి. ట్యాక్సీలు కూడా దొరుకుతాయి. అయితే మెట్రోతో పోలిస్తే ట్యాక్సీల చార్జీలు చాలా ఎక్కువ. ఇక మొబైల్స్‌ విషయానికి వస్తే- స్థానికంగా సిమ్‌ కార్డులు వేసుకుంటే ఖరీదు ఎక్కువ అవుతుంది. నెట్‌ బ్రౌజ్‌ చేయాలంటే.. అక్కడి సిమ్‌ వేసుకుని మొబైల్‌ డేటా రీచార్జ్‌ చేయించుకోవక్కర్లేదు. హాంకాంగ్‌లో చాలా ప్రాంతాల్లో ఉచిత వైఫై లభిస్తుంది. దాన్ని వాడుకోవచ్చు.
 
నీళ్లు ఎక్కువ తాగాలి..
హాంకాంగ్‌ సముద్రతీర ప్రాంతం కావటం వల్ల ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అక్కడ పల్చటి దుస్తులను వాడాలి. అక్కడ ఉన్నంత కాలం ఎక్కువగా నీళ్లను తాగాలి. లేకపోతే సొమ్మసిల్లిపోయే అవకాశముంది. వీలైనంత వరకూ నడవకుండా ట్రైన్లను, బస్సులను వాడుకుంటే మంచిది. అంతేకాకుండా సౌకర్యవంతమైన షూలను కూడా వేసుకోవాలి.
 
షాపులు తెరవటం ఆలస్యమే..
హాంకాంగ్‌లో షాపులను ఆలస్యంగా తెరుస్తారు. అందువల్ల ఉదయాన్నే నెమ్మదిగా బ్రేక్‌ఫాస్ట్‌ చేసి ఆ తర్వాత షాపింగ్‌కు వెళ్తే మంచిది. హాంకాంగ్‌లో పెద్ద పెద్ద మాల్స్‌తో పాటు రోడ్ల పక్కన ఉండే షాపులు కూడా అనేకం ఉంటాయి. చిన్న చిన్న ఎలకా్ట్రనిక్‌ వస్తువులు ఇలాంటి షాపుల్లో కొన్నా పర్వాలేదు కానీ ఎక్కువ ధర ఉన్న ఎలకా్ట్రనిక్‌ వస్తువులను షోరూంలలోనే కొనుగోలు చేస్తేనే మంచిది. లేకపోతే మోసపోయే అవకాశం కూడా ఉంటుంది.