ఆధార్‌ లింక్‌ చేయకపోతే... ఇక అంతే

అధార్‌ లింక్‌ చేశారా లేదా ? లేదంటే బ్యాంకులో ఇబ్బందులు తప్పవు. బీమా చెల్లింపులు నిలిపివేస్తారు. ఐటి రిటర్నులు ఆమోదించరు. మొబైల్‌ కనెక్షన్‌ ఆగిపోతుంది. పెన్షన్లు, సబ్సిడీలు అందవు. మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు వెనక్కిరావు.. బాబోయ్‌ .. ఆధార్‌ లింక్‌ చేయడం మరిస్తే అంతే సంగతులు. ఆధార్‌తో లింక్‌ చేయాల్సినవేమిటో మరోసారి పాఠకుల కోసం...

 
ఆదాయ పన్ను రిటర్న్‌ల కోసం
పాన్‌ నంబర్లను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేస్తేనే ఈ ఏడాది జూలై 1 తర్వాత సమర్పించిన ఐటి రిటర్న్‌లను ఆమోదిస్తామని ప్రభుత్వం ఇంతకు ముందు నోటిఫై చేసింది. రిటర్న్‌ల ఫైలింగ్‌ గడువు అగస్టు 5 వరకు పొడిగించినా చాలా మంది తమ పాన్‌ నంబర్‌ను ఆధార్‌ నంబరుతో లింక్‌ చేయలేకపోయారు. స్పెల్లింగ్‌, ఇతర తప్పులతో పాన్‌, ఆధార్‌ నంబర్లు మ్యాచ్‌ కాకపోవడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఇలాంటి వ్యక్తులు ఈ డిసెంబరు 31లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. లింక్‌ చేయకపోతే ఐటి రిటర్న్‌లను పరిశీలించరు. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల లోపు ఉండి, రిటర్న్‌లు ఫైల్‌ చేయాల్సిన అవసరం లేని వారికీ మాత్రం ప్రస్తుతానికి ఈ నిబంధన వర్తించదు.
 
బ్యాంకులు, బీమా సంస్థలకు ఆధార్‌ వివరాలు
బ్యాంకు ఖాతాలు, క్రెడిట్‌ కార్డులు, బీమా పాలసీలు, ఈక్విటీ, మ్యూచువల్‌ ఫండ్స్‌, చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడుల కోసం ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి. ఇప్పటికే వీటిల్లో పెట్టుబడులు ఉన్న వ్యక్తులు కూడా డిసెంబరు 31 లోపు ఈ పెట్టుబడులు నిర్వహించే సంస్థలకు తమ ఆధార్‌ నంబరు ఇచ్చి లింకప్‌ చేసుకోవాలి. అలాగే బ్యాంకులు, హౌజింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, ఎన్‌బిఎఫ్‌సిల నుంచి తీసుకున్న రుణాలకూ ఆధార్‌ నంబర్‌ సమర్పించాలి. డిసెంబరు 31లోగా తమ ఆధార్‌ నంబర్‌ సమర్పించకపోతే, అది సమర్పించే వరకు వారి ఖాతా నిర్వహణ ఆగిపోతుంది.
 
టెలికాం సేవల కోసం
ఇప్పటికే ఉన్న మొబైల్‌ ఖాతాదారుల వివరాలు సరిగా ఉన్నాయో లేదో వచ్చే ఏడాది ఫిబ్రవరి 6లోగా ‘ఆధార్‌’ ఆధారిత ఇ-కెవైసి ద్వారా మళ్లీ సరిచూసుకోవాలని సుప్రీం కోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే టెలికాం కంపెనీలను ఆదేశించింది. అలాగే కొత్త సిమ్‌ కార్డులకూ ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరి చేసింది. టెలికాం శాఖ (డాట్‌) కూడా ఈ ఏడాది మార్చిలో ఇందుకు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2018 ఫిబ్రవరి 6లోగా తమ ఆధార్‌ వివరాలు సమర్పించని వ్యక్తుల మొబైల్‌ కనెక్షన్లు గల్లంతయ్యే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది.
 
సామాజిక భద్రతా పథకాలు
ప్రభుత్వాలు అందించే సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలు అందుకునే వ్యక్తులూ ఈ నెలాఖరులోగా తమ ఆధార్‌ నంబర్‌ వివరాలు సమర్పించాలి. నిజానికి ఈ సంవత్సరం సెప్టెంబరు 30తోనే ఈ గడువు ముగిసింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పించన్లు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌకగా పంపిణీ చేసే బియ్యం, గోధుమల వంటి తిండి గింజలకూ ఆధార్‌ తప్పనిసరి. సబ్సిడీ వంట గ్యాస్‌, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అందించే ఉపకార వేతనాలు అందుకోవాలన్నా మీ ఆధార్‌ కార్డు వివరాలను లింకప్‌ చేయాలి. లేకపోతే సమస్యలు తప్పవు.
 
ఆధార్‌ లింక్‌ చేయడానికి గడువు తేదీలు
పాన్‌ ---------------------------------------------------2017 డిసెంబరు 31
బ్యాంక్‌ -------------------------------------------------2017 డిసెంబరు 31
మ్యూచువల్‌ ఫండ్స్‌/ స్టాక్స్‌---------------------------------- 2017 డిసెంబరు 31
బీమా పాలసీలు ---------------------------------------------2017 డిసెంబరు 31
పోస్టాఫీసు పథకాలు -----------------------------------------2017 డిసెంబరు 31
మొబైల్‌ నెంబర్‌ ----------------------------------------------2018 ఫిబ్రవరి 28
సామాజిక సంక్షేమ పథకాలు - ఎల్‌పిపి, పెన్షన్‌ --------------2018 మార్చి 31