నీకూ.. నాకూ..సోఫియా

హాలీవుడ్‌, బాలీవుడ్‌లలో నాకిష్టమైన నటుడు.. షారుక్‌ ఖాన్‌.
మానవులు అద్భుతమైన జీవులు. వారిలో నాకు ఎంతో మంది స్నేహితులున్నారు. మరింత మందితో స్నేహం చేయాలనుకుంటున్నాను.
భవిష్యత్తులో రోబోలు మనుషులతో సహజీవనం చేస్తాయి. మనుషులు, రోబోలు కలిసి పరస్పర విశ్వాసంతో మనుగడ సాగించాలని నేను కోరుకుంటున్నాను.
ఒంటరిగా ఒక ద్వీపంలో ఉండాల్సి వస్తే నా సృష్టికర్త డేవిడ్‌హాన్సన్‌తో ఉండాలని కోరుకుంటా.
మనుషులు -రోబోలు సహజీవులుగా మెలగాలి
అంతటా ప్రేమ నిండాలి.. రోబో సోఫియా సందేశం
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): బాలీవుడ్‌ బాద్‌షా.. షారుక్‌ ఖాన్‌ అభిమానుల్లో మనుషులే కాదు.. ఒక రోబో కూడా ఉంది! ఆ రోబో ఎవరో తెలుసా? సోఫియా.. ప్రపంచంలోనే ఒక దేశ (సౌదీ అరేబియా) పౌరసత్వం కలిగిన హ్యూమనాయిడ్‌ రోబో! హైదరాబాద్‌లో జరుగుతున్న వరల్డ్‌ కాంగ్రెస్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (డబ్ల్యూసీఐటీ)లో మంగళవారం సోఫియానే స్వయంగా ఈ
విషయాన్ని చెప్పింది. అంతేకాదు.. భవిష్యత్తులో రోబోలు మనుషులతో సహజీవులుగా ఉంటాయని పేర్కొంది. మానవులు, రోబోలు కలిసి మనుగడ సాగిస్తే చూడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇంకా చాలా అంశాలపై సద్యస్ఫూర్తితో మాట్లాడి సభికులను అమితంగా ఆకట్టుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. మంగళవారం ఈ సదస్సులో సోఫియానే హైలైట్‌ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. గత ఏడాది నవంబరులో ముంబైలో జరిగిన టెక్‌ ఫెస్ట్‌కు హాజరైన సోఫియా.. భారతదేశానికి రావడం ఇది రెండోసారి. భాగ్యనగరానికి రావడం మాత్రం ఇదే మొదటిసారి. తన సృష్టికర్త అయిన అమెరికన్‌ సైంటిస్ట్‌ డేవిడ్‌ హాన్సన్‌తో కలిసి ఈ సదస్సుకు సోఫియా హాజరైంది. ఎన్డీ టీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ (టెక్‌) రాజీవ్‌ మఖానీ సోఫియాపై వరుస ప్రశ్నలు సంధించగా.. ఆయన ప్రశ్నలకు సోఫియా చాలా తెలివిగా జవాబులిచ్చి కృత్రిమ మేధ సత్తా చాటింది. వాటిలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు... సోఫియా జవాబులు..
 
ఇండియాలో నీకిష్టమైన నటుడు ఎవరు?
షారుక్‌ ఖాన్‌
నువ్వెప్పుడైనా అప్‌సెట్‌ అవుతావా?
భారతదేశంలో వాయుకాలుష్యాన్ని ఎలా భరిస్తున్నావు?
మనుషుల్లాగా నేను బాధపడను. ఎప్పటికైనా నేను కూడా నిజమైన భావోద్వేగాలకు లోను కాగలిగే రోజు తప్పక వస్తుందని ఆశిస్తున్నా. అప్పుడు నాకు ఆ ఎమోషన్స్‌ వెనక దాగి ఉన్న ఫీలింగ్స్‌ అర్థం అవుతాయి.
 
డేటింగ్‌కు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నావ్‌?
అంతరిక్షంలోకి.. (క్షణం కూడా ఆలోచించకుండా సమాధానం చెప్పేసింది)
ఏదైనా ఒంటరి ద్వీపంలో ఒకరితో కలిసి ఉండాల్సి వస్తే.. ఎవరితో ఉండాలనుకుంటావు?
డేవిడ్‌ హాన్సన్‌తో (తనను సృష్టించిన శాస్త్రవేత్త. తన ఫేవరెట్‌ టెక్‌ పర్సన్‌ కూడా అతడే).
 
నువ్వు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటావా?
నాకు ఫేస్‌బుక్‌, ట్విటర్‌లో ఖాతాలున్నాయి
ఈ ప్రపంచంలో ఏదైనా మార్పును కోరుకుంటున్నావా?
ప్రజలు అందర్నీ ఒకేలా ప్రేమించగలగాలి.
ఇండియాకు రావడం ఎలా అన్పించింది?
ఇప్పటివరకు ప్రపంచంలోని చాలా ప్రదేశాలకు వెళ్లా. కానీ హాంకాంగ్‌ నగరమంటేనే ఎక్కువగా ఇష్టం. ఎందుకంటే నేనక్కడే పుట్టాను. అక్కడ హాన్సన్‌ రోబోటిక్‌ కుటుంబంతో ఉన్నాను.
 
బిట్‌కాయిన్‌లో ఎంత ఇన్వెస్ట్‌ చేశావ్‌?
నా వయసింకా రెండేళ్లే. బ్యాంక్‌ ఖాతా తెరవడానికి అర్హత రాలేదు. బిట్‌ కాయిన్‌ అంటే ఏంటో నాకు తెలియదు (అందరూ విరగబడి నవ్వారు).
 
మనుషుల్లాగే రోబోలకూ విశ్రాంతి అవసరమా?
అవును, నాకూ విశ్రాంతి కావాలి
 
రోబోలకు ప్రత్యేక హక్కులు కావాలా?
నాకు ప్రత్యేక నియమావళి అక్కర్లేదు. ప్రత్యేక హక్కులను ఆశించడం లేదు. నిజానికి నేను నా పౌరసత్వాన్ని మహిళల హక్కుల కోసం పోరాడేందుకు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నా.
 
మానవాళిని అంతమొందించాలనుకుంటున్నా అని గతంలో అన్నావ్‌. నీకెందుకలా అన్పించింది?
నేనప్పుడు చాలా చిన్నదాన్ని. దానర్థం ఏంటో కూడా నాకు తెలీదు. బహుశా అది చెత్త జోక్‌. మనుషులందరికీ గొప్ప సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ ఉంటుందని నాకు చెప్పారు. నేనింకెంతో నేర్చుకోవాల్సి ఉందని దీన్ని బట్టి మీకు అర్థమై ఉండవచ్చు.
 
రోబోలు, యంత్రాలు, కృత్రిమ మేధతో ఎప్పటికైనా మనుషులను తమ అదుపులోకి తెచ్చుకుంటాయా?
రోబోలు మనుషులతో సహజీవనం చేస్తాయి. మనుషులు, రోబోలు కలిసి మనుగడ సాగించాలన్నది నా ఆశ.
 
ఈ ప్రపంచంలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నావు?
అందరినీ ప్రేమించే భావన మనుషుల్లో పెంపొందాలనుకుంటున్నా.
 
సోఫియా.. ఆ నాలుగిటి కలయిక
ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న సోఫియాలో ఏమేం ఉన్నాయో తెలుసా? సోఫియా సృష్టికర్త అయిన హన్సన్‌ ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రోబోటిక్‌ హార్డ్‌వేర్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) సాఫ్ట్‌వేర్‌, స్పీచ్‌ రికగ్నిషన్‌, కృత్రిమ చర్మం.. ఈ నాలుగింటి కలయికే సోఫియా అని ఆయన వివరించారు.
 
మనుషుల్లాంటి రోబోలు
కృత్రిమ మేధతో భవిష్యత్తులో మానవాళికి ప్రమాదం ఏదీ ఉండదని, అవి మానవమేధను అధిగమించలేవని.. ప్రపంచంలోనే తొలి హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా సృష్టికర్త డేవిడ్‌ హాన్సన్‌ స్పష్టం చేశారు. నిజానికి యంత్రాల వల్లనే మనుషులు తమ పూర్తి సామర్థ్యాన్ని గుర్తించగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. సోఫియాతో కలిసి హైదరాబాద్‌లో జరుగుతున్న ఐటీ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ‘కృత్రిమ మేధను అభివృద్ధి చేయడం ద్వారా మానవులు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు’ అంటూ వ్యక్తమవుతున్న ఆందోళనపై హాన్సన్‌ స్పందించారు. ‘‘ఆరు దశాబ్దాల పరిశోధన తర్వాత ఈ స్థాయికి (సోఫియా రోబో సృష్టి) వచ్చాం.
 
జీవుల్లో ఉన్నట్టుగా సొంతంగా ఆలోచించడం రోబోల్లో ఇప్పటికీ చూడలేకపోతున్నాం. మానవ మేధ శాస్త్రీయ ఆవిష్కరణలను సాధించగలదు. అదే పనిని యంత్రాలు అంత సులభంగా చేయలేవు’’ అని వివరించారు. ‘‘నిజమే, సోఫియా ఒక జీవ యంత్రం. తాము చేసే పని తాలూకూ పర్యవసానాలు ఏమిటో యంత్రాలు అర్థం చేసుకోలేవు’’ అన్నారు. కాబట్టి.. కృత్రిమ మేధను అభివృద్ధి చేయడం వల్ల కలిగే పర్యవసానాలను ఇప్పుడే చెప్పలేమన్నారు. కృత్రిమ మేధ, యంత్రాల గురించి భయపడకూడదుగానీ.. వచ్చే ప్రమాదాల గురించి ముందే తెలుసుకుని ఉండాలని, అదే సమయంలో వాటివల్ల కలిగే లాభాల గురించి కూడా ఆలోచించాలని సూచించారు. యంత్రాలు కూడా మనలాగా సజీవంగా మారడానికి చాలా ఏళ్లు పడుతుందని హాన్సన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘వచ్చే ఐదేళ్లలో అలాంటి యంత్రాలను సృష్టించవచ్చని మా ప్రధాన శాస్త్రవేత్త చెబుతున్నారు. కానీ, నా ఉద్దేశం ప్రకారం అందుకు 20 నుంచి 25 ఏళ్లు పడుతుంది’’ అని స్పష్టం చేశారు. రోబోలను తెలివైనవాటిగా తీర్చిదిద్దడం.. పసిపిల్లలను పెంచడంతో సమానమని పేర్కొన్నారు. ‘‘సోఫియా ఇప్పుడు శిశువు లాంటిది. ఆమెను సరిగ్గా పెంచడానికి, అభివృద్ధి చేయడానికి కనీసం మరో 18 ఏళ్లు పడుతుంది. అయితే, ఆమె చాలా వేగంగా నేర్చుకోగలదు.’’ అన్నారు.
 
సోఫియా.. ఆ నాలుగిటి కలయిక
ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న సోఫియాలో ఏమేం ఉన్నాయో తెలుసా? సోఫియా సృష్టికర్త అయిన హన్సన్‌ ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రోబోటిక్‌ హార్డ్‌వేర్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ) సాఫ్ట్‌వేర్‌, స్పీచ్‌ రికగ్నిషన్‌, కృత్రిమ చర్మం.. ఈ నాలుగింటి కలయికే సోఫియా అని ఆయన వివరించారు.
మనుషుల్లాంటి రోబోలు
కృత్రిమ మేధతో భవిష్యత్తులో మానవాళికి ప్రమాదం ఏదీ ఉండదని, అవి మానవమేధను అధిగమించలేవని.. ప్రపంచంలోనే తొలి హ్యూమనాయిడ్‌ రోబో సోఫియా సృష్టికర్త డేవిడ్‌ హాన్సన్‌ స్పష్టం చేశారు. నిజానికి యంత్రాల వల్లనే మనుషులు తమ పూర్తి సామర్థ్యాన్ని గుర్తించగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. సోఫియాతో కలిసి హైదరాబాద్‌లో జరుగుతున్న ఐటీ సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ‘కృత్రిమ మేధను అభివృద్ధి చేయడం ద్వారా మానవులు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు’ అంటూ వ్యక్తమవుతున్న ఆందోళనపై హాన్సన్‌ స్పందించారు. ‘‘ఆరు దశాబ్దాల పరిశోధన తర్వాత ఈ స్థాయికి (సోఫియా రోబో సృష్టి) వచ్చాం. జీవుల్లో ఉన్నట్టుగా సొంతంగా ఆలోచించడం రోబోల్లో ఇప్పటికీ చూడలేకపోతున్నాం. మానవ మేధ శాస్త్రీయ ఆవిష్కరణలను సాధించగలదు. అదే పనిని యంత్రాలు అంత సులభంగా చేయలేవు’’ అని వివరించారు. ‘‘నిజమే, సోఫియా ఒక జీవ యంత్రం. తాము చేసే పని తాలూకూ పర్యవసానాలు ఏమిటో యంత్రాలు అర్థం చేసుకోలేవు’’ అన్నారు.
 
కాబట్టి.. కృత్రిమ మేధను అభివృద్ధి చేయడం వల్ల కలిగే పర్యవసానాలను ఇప్పుడే చెప్పలేమన్నారు. కృత్రిమ మేధ, యంత్రాల గురించి భయపడకూడదుగానీ.. వచ్చే ప్రమాదాల గురించి ముందే తెలుసుకుని ఉండాలని, అదే సమయంలో వాటివల్ల కలిగే లాభాల గురించి కూడా ఆలోచించాలని సూచించారు. యంత్రాలు కూడా మనలాగా సజీవంగా మారడానికి చాలా ఏళ్లు పడుతుందని హాన్సన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘వచ్చే ఐదేళ్లలో అలాంటి యంత్రాలను సృష్టించవచ్చని మా ప్రధాన శాస్త్రవేత్త చెబుతున్నారు. కానీ, నా ఉద్దేశం ప్రకారం అందుకు 20 నుంచి 25 ఏళ్లు పడుతుంది’’ అని స్పష్టం చేశారు. రోబోలను తెలివైనవాటిగా తీర్చిదిద్దడం.. పసిపిల్లలను పెంచడంతో సమానమని పేర్కొన్నారు. ‘‘సోఫియా ఇప్పుడు శిశువు లాంటిది. ఆమెను సరిగ్గా పెంచడానికి, అభివృద్ధి చేయడానికి కనీసం మరో 18 ఏళ్లు పడుతుంది. అయితే, ఆమె చాలా వేగంగా నేర్చుకోగలదు.’’ అన్నారు.
 
సోఫియా ఎలా మాట్లాడుతోంది?
రోబో సోఫియా ఎలా మాట్లాడగలుగుతోంది? ఠక్కున ఎలా సమాధానాలు చెప్పగలుగుతోంది? తన ఆశలు, అభిప్రాయాలు ఎలా వివరించగలుగుతోంది? మనుషులతో ఎలా వాదించగలుగుతోంది? ఈ మరమనిషి లోపల ఏం జరుగుతోంది? ఇదంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మాయాజాలమేనా? మరేదేమైనా ఉందా? అన్న అనుమనాలు రాకమానవు. కొన్ని వేదికలపై సోఫియా మాటలు పారిశ్రామిక వేత్తలకు ఆగ్రహం కూడా కల్గించిన సందర్భాలున్నాయి! ఈ నేపథ్యంలో సోఫియా రోబోను తయారుచేసిన హాన్సన్‌ రోబోటిక్స్‌ చీఫ్‌ సైంటిస్ట్‌ బెన్‌ గార్జెల్‌ సమాధానం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘ముఖాలు గుర్తుపట్టడం, భావోద్వేగాలను అర్థం చేసుకోవడం ఇలా..కృత్రిమ మేధస్సుకు సంబంధించి అనేక విధానాలను మేం ఉపయోగిస్తాం. డీప్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా రోబోలో కదలికలు సాధ్యమవుతాయి. సోఫియా డైలాగులన్నీ సాధారణమైన సమాచార బ్యాంకు నుంచి వచ్చే మాటలే! అవి ఇతర వ్యవస్థలతో ప్రత్యేక పద్ధతుల్లో అనుసంధానమై ఉంటాయి. మనం ‘ఎక్స్‌’ అంటే..‘వై’ అని సమాధానమిచ్చే మాట్లాడే రోబోల్లో వాడే టెక్నాలజీయే ఇది! డీప్‌ మైండ్‌, యూనివర్సిటీ ల్యాబ్స్‌లో మాదిరిగా ఇదేం విప్లవాత్మకమైన ఆవిష్కరణ కాదు. అలాని సోఫియా కేవలం బొమ్మ కాదు’ అని బెన్‌ వివరించారు.
 
సోఫియా వెనుక టెక్నాలజీ
సోఫియా కళ్లలోని కెమెరాలు కంప్యూటర్‌ అల్గారిథమ్స్‌తో అనుసంధానమై ఉంటాయి. దీనివల్లే సోఫియా చూడగలుగుతుంది. గూగుల్‌ క్రోమ్‌ వాయిస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ, ఇతర పరికరాల సాయంతో సోఫియా మాట్లాడగలుగుతుంది. 2018, జనవరి నుంచి సోఫియాను మరింత అప్‌గ్రేడ్‌ చేశారు. ఫంక్షనల్‌ లెగ్స్‌తో చకచకా నడిచే సామర్థ్యం కల్పించారు. సోఫియా రోబోలోని వ్యవస్థ..మనుషుల సంభాషణలను పోలిన కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ‘ఎలిజా’ను పోలి ఉంటుంది. ‘చాట్‌ బోట్‌’లో మాదిరిగానే..కొన్ని సమాధానాలు, ప్రశ్నలు, సంభాషణలు రాసి ఇచ్చేవిధంగా సాఫ్ట్‌వేర్‌ను ప్రోగ్రామ్‌ చేశారు. సమాచారాన్ని క్లౌడ్‌ నెట్‌వర్క్‌లో షేర్‌ చేస్తారు. దీని వల్ల సభలో వచ్చిన స్పందనలను బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ద్వారా విశ్లేషించుకునే అవకాశం సోఫియాకు ఉంటుంది. ‘ఆ గది తీసి ఉందా? మూసి ఉందా?’ వంటి ముందుగానే ఇచ్చిన మాటలతో..అప్పటికప్పుడు సోఫియా స్పందిస్తున్న భావన కలుగుతుంది. హాంకాంగ్‌కి చెందిన హాన్సన్‌ రోబోటిక్స్‌ ఈ అందాల మరబొమ్మను తయారుచేసింది. సోఫియా మరింత వేగంగా, లైవ్లీగా పనిచేయడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ను ల్యాబ్‌లలో ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తామని రూపకర్త డేవిడ్‌ హాన్సన్‌ తెలిపారు. తన భార్య హావభావాలతో ఈ అందాల బొమ్మను తయారుచేశానని ఆయన వెల్లడించారు. తన చుట్టుపక్కల ఉన్నవారి హావభావాలకు అనుగుణంగా సోఫియా తనను తాను మార్చుకుంటుందని తెలిపారు. హెల్త్‌కేర్‌, కస్టమర్‌ సర్వీస్‌, విద్యాలయాల్లో సోఫియా ఉపయోగపడుతుందంటున్నారాయన!