Get-American-citizenship-by-following-these-steps

అమెరికా పౌరసత్వం కావాలా..

అమెరికాలో ఉన్న వనరులు, అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఏదో ఒక విధంగా అమెరికాకు చేరుకొని, పౌరసత్వాన్ని పొంది స్థిర నివాసం ఏర్పరుచుకోవాలనికలలు కంటుంటారు. అయితే కొందరు మాత్రమే ఆ కలను సాకారం చేసుకోగలుగుతారు. ఉదాహరణకు.. 2016 సంవత్సరంలో దాదాపుగా పది లక్షల మంది అమెరికా పౌరసత్వానికై దరఖాస్తు చేసుకోగా ఏడు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల మందికి అమెరికా దేశపౌరసత్వం లభించింది. ఇంతకీ అమెరికా పౌరసత్వం పొందడం ఎలా? ఆ విషయాన్నితానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్‌ వివరిస్తున్నారిలా..

మూడు రకాలుగా చాన్స్‌
అమెరికా దేశపు పౌరసత్వాన్ని మూడు రకాలుగా పొందే అవకాశం ఉంది. అవేంటంటే..
 
అమెరికాలో జన్మించడం ద్వారా
అమెరికా దేశంలోని ఏ రాష్ట్రంలో జన్మించినా లేదా అమెరికా ఆధీనంలో ఉన్న పోర్టోరీకో, గ్వామ్‌, యూ.ఎస్‌. వర్జిన్‌ ఐలాండ్స్‌, మరియునార్తర్న్‌ మరయానా ఐలాండ్స్‌లో 1986 తరువాత జన్మించినా అమెరికా పౌరసత్వం లభిస్తుంది.
 
వారసత్వపు హక్కు..
అమెరికా పౌరులైన దంపతులకు (కనీసం ఒకరు అమెరికా (గతం)లో గాని ప్రస్తుతం గాని నివాసం ఉండి ఉండాలి) జన్మించిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది.
 
దంపతులలో ఒకరికి మాత్రమే అమెరికా పౌరసత్వం ఉంటే.. వారు పిల్లలు పుట్టే సమయానికి కనీసం 5 సంవత్సరాలు అమెరికాలో నివసించి ఉండి ఉండాలి. అందులో 2 సంవత్సరాలు.. 14 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత అమెరికాలో ఉన్నట్లు రుజువు చేసుకోవాలి. అప్పుడే వారికి పుట్టిన పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఐదేళ్ల కాలపరిమితిలో కొన్ని మినహాయింపులుంటాయి.
తల్లికి అమెరికా పౌరసత్వం ఉండి తండ్రికి లేకపోయినా పుట్టిన పిల్లలకు పౌరసత్వం లభిస్తుంది. అయితే, పిల్లలు పుట్టే సమయానికి ఏడాది ముందు తల్లి అమెరికాలో నివసించి లేదా నివసిస్తూ ఉండాలి.
 
తండ్రి అమెరికా పౌరుడై ఉండి తల్లి కాకపోతే? పుట్టిన శిశువుకు తానే తండ్రినని, బిడ్డకు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ అవసరమైన ఆర్ధిక సహాయం అందిస్తానని తండ్రి రాతపూర్వకంగా తెలిపితే పౌరసత్వం లభిస్తుంది.
 
తగిన అర్హతలు సంపాదించడం ద్వారా (ఎన్‌-600)..
 పైన పేర్కొన్న రెండు వర్గాలకూ చెందక.. అమెరికా పౌరసత్వం కోరుకునేవారు కనీసం 5 సంవత్సరాలు పాటు గ్రీన్‌ కార్డు కలిగి ఉండాలి. ఆ ఐదేళ్లలో కనీసం 30 నెలల పాటు అమెరికాలోనే ఉండి ఉండాలి.
 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
పౌరసత్వం కోసం దరఖాస్తు చేసేనాటికీ కనీసం 3 నెలలు ముందుకాలం అమెరికాలో ఉండి ఉండాలి.
దరఖాస్తు చేసిన నాటి నుంచి పొందే వరకూ అమెరికాలోనే ఉండాలి (సెలవులపై విదేశీ ప్రయాణాలు చేయొచ్చు).
అమెరికా దేశపు చరిత్ర, ప్రభుత్వ పరిపాలనావిధానం తెలిసి ఉండి ఆంగ్ల భాష చదవడం, రాయడం, మాట్లాడటం కొంత వరకైనా వచ్చి ఉండాలి.
అమెరికా రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవిస్తూ, బాధ్యతాయుత వ్యక్తిగా ఉండాలి.
 
వివాహం..
అమెరికా పౌరసత్వం ఉన్నవారిని వివాహం చేసుకున్నాక పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారు.. కనీసం 3 సంవత్సరాల పాటు గ్రీన్‌ కార్డు కలిగి ఉండాలి. ఆ మూడేళ్లలో 18 నెలలపాటు.. దరఖాస్తు సమయానికి ముందు కనీసం 3 నెలల కాలం అమెరికాలో ఉండి ఉండాలి.
ఆ మూడేళ్ల కాలం పూర్తయి పౌరసత్వం కోసం దరఖాస్తు చేసి పౌరసత్వం పొందే వరకు వైవాహిక బంధంలోనే ఉండి ఉండాలి. దరఖాస్తు చేసిన నాటి నుంచి పౌరసత్వం పొందే వరకు అమెరికా దేశంలో నివసించాలి. సెలవుపై విదేశీ ప్రయాణాలు చేయొచ్చు.
 
గ్రీన్‌ కార్డు పొందేందుకు కావాల్సిన అర్హతలు (ఏ-485)
కుటుంబ బంధం ద్వారా, ఉద్యోగం ద్వారా, పెట్టుబడి పెట్టడం ద్వారా, ప్రత్యేక పరిస్థితుల్లో, శరణార్థులు/కాందిశీకులుగా, లాటరీ పద్ధతి ద్వారా, పేర్లునమోదు చేసుకోవడం ద్వారా గ్రీన్‌ కార్డు పొందవచ్చు. మరింత వివరంగా చెప్పాలంటే..
 
కుటుంబ బంధం ద్వారా గ్రీన్‌ కార్డు అమెరికా పౌరసత్వం లేదా గ్రీన్‌ కార్డు ఉన్నవారితో వివాహం జరిగితే గ్రీన్‌కార్డుకు అర్హులు.
 తల్లిదండ్రులు అమెరికా పౌరులు లేదా గ్రీన్‌ కార్డు ఉన్నవారు అయితే ( ఒకవేళ తల్లిదండ్రులు గ్రీన్‌ కార్డు ఉన్న వారు అయితే, వారి పిల్లలు అవివాహితులుగా ఉన్నప్పుడు మాత్రమే అర్హులు)
కనీసం 21 సంవత్సరాల వయస్సన్న సోదరుడు లేదా సోదరి అమెరికా దేశపు పౌరులై ఉంటే.
అమెరికా పౌరసత్వం ఉన్నవారితో పెళ్లి నిశ్చయమైతే
తల్లి లేదా తండ్రికి అమెరికా పౌరసత్వం కలిగిన వారితో వివాహం నిశ్చయమైనప్పుడు, పిల్లలు కూడా గ్రీన్‌ కార్డుకు అర్హులే.
 
 ప్రత్యేక పరిస్థితుల్లో గ్రీన్‌ కార్డు
అమెరికాలోని లాభాపేక్ష రహిత, మతపరమైన సంస్థల్లో పని చేయడం ద్వారా.
విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన వారు
అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు
అమెరికా దేశపు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇతర దేశం నుంచి వచ్చి వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు
 
ఉద్యోగం ద్వారా గ్రీన్‌ కార్డు
వివిధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారి యాజమాన్యం ద్వారా గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అమెరికాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా, అమెరికాలో కనీసం 5 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి కనీసం 5 ఉద్యోగాలను కల్పించడం ద్వారా లేదా 10 లక్షల డాలర్లు పెట్టుబడి పెట్టి కనీసం 10 ఉద్యోగాలను కల్పించడం ద్వారా గ్రీన్‌కార్డు
పొందవచ్చు.
 
లాటరీ పద్ధతి ద్వారా 
కనీసం హైస్కూల్‌ స్థాయి విద్యార్హత కల్గి ఉండి (లేదా) గడిచిన ఐదేళ్లలో రెండేళ్లు అమెరికాలో ఏదైనా ఉద్యోగం చేసిన వారు ఈ విధానంలో గ్రీన్‌కార్డుకు అర్హులు. అమెరికాకు తక్కువ వలసలు ఉండే దేశాల వారికే ప్రాధాన్యమిస్తారు. సాధారణంగా ప్రతి అక్టోబరులో లాటరీద్వారా 55,000 వరకు గ్రీన్‌ కార్డులను జారీ చేస్తారు.
 
పేర్లునమోదు చేసుకోవడం ద్వారా గ్రీన్‌ కార్డు
1972 జనవరి 1కి ముందు అమెరికాలో ప్రవేశించి, అమెరికా పౌరసత్వం పొందడానికి అర్హులైతే ప్రత్యేకంగా నమోదు చేసుకోవడం ద్వారా గ్రీన్‌ కార్డు పొందవచ్చు.
 
శరణార్థులు లేదా కాందిశీకులకు గ్రీన్ కార్డు
అమెరికా ప్రభుత్వం నుంచి శరణార్థులు లేదా కాందిశీకులుగా గుర్తింపు పొందిన ఒక సంవత్సరం కాలం తరువాత వారు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.