హాంకాంగ్‌లో తకదిమితోం

ఆంధ్రజ్యోతి, 27-12-2016: అందరూ విదేశీ యువతులు. తెలుగింటి ఆడపడుచుల్లా చీరకట్టు, బొట్టులతో ముస్తాబై మురిపించారు. విజయవాడలో జరిగిన కూచిపూడి సమ్మేళనానికి తరలివచ్చిన ఆ మహిళలు.. లండన్‌, హాంకాంగ్‌, థాయ్‌లాండ్‌ వాసులు. ఆ దేశాలలో కూచిపూడి నృత్య శిక్షణ కేంద్రాలను నడుపుతూ.. తెలుగు కళను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు. విజయవాడకు వచ్చిన సందర్భంగా వారిని ‘నవ్య’ పలకరించింది.. 
 
హాంకాంగ్‌కు చెందిన జాకీ లా, సినిథా లా, ఇంగ్రిడి యెంగ్‌.. వారంతా చేస్తున్నవి మామూలు ఉద్యోగాలు కాదు. మల్టీ నేషనల్‌ కంపెనీలకు జనరల్‌ మేనేజర్లు. కూచిపూడి అంటే వీరికి ప్రాణం. వేదికపై నాట్యానికి కదలికలు రావాలంటే నట్టువాంగం ఉండాలి. కూచిపూడికి సంబంధించిన గాత్రాలు ఎక్కువగా తెలుగు, సంస్కృతంలో ఉంటాయి. వాటిని సైతం చైనా భాషలోకి అనువాదం చేయించుకుని కూచిపూడిలో అభినయాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ అమ్మాయిలు. వీరే కాదు, మరో పది మంది వివిధ బహుళజాతి సంస్థల్లో ఉన్నతమైన హోదాల్లో ఉన్న యువతులు ఈ నృత్యాన్ని నేర్చుకుంటున్నారు. కూచిపూడిలో ఉండే అరవై బేసిక్‌ స్టెప్‌లను పూర్తిగా అవగాహన చేసుకున్న వీరంతా హాంకాంగ్‌తోపాటు థాయ్‌లాండ్‌, జపాన వంటి దేశాల్లో వందలాది ప్రదర్శనలు ఇచ్చారు.
 
 భారతీయ కళల పట్ల ఆసక్తి 
హాంకాంగ్‌లోని ప్యూర్‌ యోగా ఇన్‌స్టిట్యూట్‌.. యోగాతోపాటు కూచిపూడి శిక్షణకు ముఖ్య కేంద్రం. ఇక్కడ కూచిపూడి నృత్యానికి శిక్షకుడిగా పనిచేస్తున్నారు తెలుగువాడైన ఈరంకి శ్రీహరి బాలాదిత్య. ఈయన ఆధ్వర్యంలోనే హాంకాంగ్‌ యువతులు శిక్షణ తీసుకుంటున్నారు. రోజంతా తీరిక లేకుండా బిజీబిజీగా గడిపే వీళ్లంతా తీరిక వేళల్లో కాళ్లకు, కళ్లకు పని చెప్తున్నారు. కొంతమందైతే వారంలో మూడు రోజులను కూచిపూడి శిక్షణకు కేటాయిస్తుండటం విశేషం. ‘‘2008లో నేను ఇండియాకు వచ్చాను. అప్పుడు పర్యటించిన ప్రాంతాల్లో కూచిపూడి నృత్యాలను చూశాను. ఆ నాట్యంలో మంచి అభినయం కనిపించింది. చాలా అద్భుతమైన కళ ఇది. ఒక మంచి వ్యాయామం కూడా. నేను తిరిగి హాంకాంగ్‌ వెళ్లిన తర్వాత యోగా నేర్చుకుంటున్న ఇన్‌స్టిట్యూట్‌లోనే కూచిపూడి నేర్పుతున్నారన్న విషయం తెలుసుకుని చేరాను. మా తల్లిదండ్రులూ మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. దీనికి సంబంధించి గాత్రాలను తెలుగు, సంస్కృతం నుంచి చైనా భాషల్లోకి బాలాదిత్య అనువదించి వివరిస్తున్నారు’’ అని చెప్పారు హాంకాంగ్‌ అమ్మాయి ఇంగ్రిడి యెంగ్‌.
 
అంతర్జాతీయ గుర్తింపు 
మన దేశంలో ఎక్కడ కూచిపూడి సమ్మేళనాలు జరిగినా విదేశీ యువతులు హాజరవ్వడం విశేషం. 2014లో హైదరాబాద్‌లో నిర్వహించిన కూచిపూడి సమ్మేళనంలోనూ హాంకాంగ్‌ యువతులు పాల్గొన్నారు. ఇప్పుడు విజయవాడలో జరిగిన సమ్మేళనానికి వచ్చారు. ‘‘కూచిపూడి భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందింది. భావితరాలను ఇందులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే మా దేశంలోనూ విద్యార్థులను కూచిపూడి వైపు అడుగులు వేయిస్తున్నాం’’ అని హాంకాంగ్‌ అమ్మాయిలు చెప్పారు. వీరి రాకతో రెండు దేశాలకు కూచిపూడి కళ వారధిగా నిలుస్తున్నది.
-జి.శ్రీనివాస్‌, విజయవాడ,
ఫొటోలు: ఎన్‌.సాంబశివరావు