పిట్స్‌బర్గ్‌ గోవిందం

అమెరికాలో తొలి హైందవ ఆలయం

తిరుమల ఆలయానికి ప్రతిబింబం

తిరుమల వేంకటేశ్వరుడిని ఏడాదిలో ఒక్కసారైనా దర్శించాలని భక్తులు తపిస్తారు. ఖండాలు దాటి వెళ్లినా శ్రీనివాసుడికి తమ మదిలోనే గుడి కట్టి ఆరాధిస్తారు. అవకాశాలను వెదుక్కుంటూ అమెరికాకు తరలివెళ్లిన ప్రవాస భారతీయులు.. ఏటా స్వదేశానికి రాలేకపోయినా.. అక్కడే ఆలయాలను నిర్మించి శ్రీవారికి నిత్య కైంకర్యాలను సమర్పిస్తున్నారు. అలా అగ్రరాజ్యానికి వెళ్లిన మొదటితరం ప్రవాసీలు పిట్స్‌బర్గ్‌లో శ్రీ వేంకటేశ్వరాలయం నిర్మించారు.
 
పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌కు తూర్పుభాగాన పెన్‌హిల్స్‌ అనే ప్రాంతంలో నిర్మించిన ఈ దేవాలయాన్ని.. తిరుమల ఆలయానికి ప్రతిబింబంగా భక్తులు భావిస్తారు. అమెరికాలో నిర్మితమైన తొలి హైందవ ఆలయం ఇది! 1975 ఆగస్టులో ఆలయ నిర్మాణ సంఘం ఏర్పడగా.. 1976 నవంబరు 17న విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి అప్పట్లోనే 4 కోట్ల రూపాయలు ఖర్చయిందంట! తిరుమల ఆలయ పద్ధతుల్లోనే ఆగమ శాస్త్రానుసారం పిట్స్‌బర్గ్‌లో పూజలు, సేవలు జరుగుతాయి. గుడి ఆవరణలోనే నలుగురు పూజారులు నివాసం ఉంటూ స్వామివారికి నిత్య పూజలు, సేవాదికాలు నిర్వహిస్తారు. ప్రత్యేక సందర్భాలు, ఉత్సవ సమయాల్లో తిరుమల నుంచి అర్చక స్వాములను ఆహ్వానిస్తారు.
 
అమెరికాలో ఆధ్యాత్మిక పరిమళాలు
పిట్స్‌బర్గ్‌ వేంకటేశ్వరాలయం అమెరికాలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. వెన్నలతో పోతపోసినట్లుగా ఈ ఆలయం మెరిసిపోతూ ఉంటుంది. అమెరికాకు వెళ్లే తెలుగువారు కచ్చితంగా పిట్స్‌బర్గ్‌ ఎస్వీ టెంపుల్‌కు వెళ్లాలని ఆరాటపడతారు. చుట్టూ కొండలు.. అందమైన తోటలతో.. ప్రకృతి సోయగాల నడమ ఈ ఆలయం అలరారుతూ ఉంటుంది. తిరుమల ఆలయ రీతిలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. వేంకటేశ్వరుడి ఆలయంతోబాటు గణేశుడు, శివ పార్వతులు, లక్ష్మీనారాయణులు, శ్రీరామ, హనుమాన్‌, దుర్గమ్మ ఉపాలయాలు ఉన్నాయి.
 
ఈ విగ్రహాలన్నీ రాజస్థాన్‌ పాలరాతితో మలచినవే! ప్రతిరోజూ ఉదయం 8 గంటల తర్వాత అభిషేకం, రాత్రి 9 గంటలకు శయనోత్సవం జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రతిరోజూ ఉదయం అర్చన, ప్రతి పౌర్ణమికి శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తారు. మధ్యాహ్నం కల్యాణం, సాయంత్రం ఊంజల్‌ సేవ జరుగుతాయి. ప్రతి ఆదివారం అభిషేకం నిర్వహిస్తారు. గర్భగుడిలో పద్మ పీఠంపై నిలబడి ఉన్న ముద్రలో శ్రీవేంకటేశ్వరుడు చతుర్భుజాలతో దర్శనమిస్తాడు. ఇంటర్నెట్‌ ద్వారా బహుమతులు, విరాళాలు స్వీకరించడంతోబాటు..భక్తులకు కొరియర్‌ ద్వారా ప్రసాదాలు పంపే ఏర్పాటు కూడా చేశారు. ఈ ఆలయం అమెరికా లోని అన్ని ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తోంది.