పనిమనిషికి సొంత ఖర్చుతో ఇల్లు కట్టించిన దుబాయి యజమానురాలు

దుబాయి, 13-01-2018: ‘యజమాని నాకు నరకం చూపిస్తున్నాడు.. నన్ను రక్షించండి..’ అంటూ సోషల్ మీడియాలో వీడియోలను పెట్టే గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన విదేశీయుల గురించి చదివే ఉంటారు. యజమానురాలు పెట్టే బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారి గురించి కూడా వినే ఉంటారు. గల్ఫ్ దేశాలు ఒక ప్రత్యక్ష నరకం.. దయచేసి వెళ్లొద్దని.. అక్కడి నుంచి ఎలాగోలా బయటపడిన బాధితుల ఇంటర్వ్యూలు చూసి ఉంటారు. కానీ ఈ కథ వీటన్నింటికీ భిన్నం. పై కథల్లో చెప్పే యజమానులు ఈ కథలో లేరు. అలా అని ఇదేమీ కథ కాదు.. నిజంగా జరిగిన నిజం.. గల్ఫ్ దేశాల్లోని యజమానుల్లో కూడా దేవుళ్లు ఉంటారు.. అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇది. 

ఫిలప్పీన్‌కు చెందిన 45 ఏళ్ల కెలో అనే మహిళ.. బతుకుదెరువు కోసం 1998లో యూఏఈలోని ఖలీఫా నగరానికి వలస వెళ్లింది. యూఏఈ పౌరుడిని పెళ్లి చేసుకుని అక్కడి పౌరసత్వాన్ని పొందిన మెక్ పైక్ అనే ఓ అమెరికన్ మహిళ వద్ద పనిమనిషిగా చేరింది. ఇంట్లో వంటపని, దుస్తులు ఉతకడం, వంటి పనులు చేయడానికి కెలోను పైక్ నియమించుకుంది. ఆమె పనిమనిషిగా ఇంట్లో చేరే సమయానికి యజమానురాలికి నాలుగేళ్ల, ఆరేళ్ల కుమారులు ఉన్నారు. ఇంటి పనితోపాటు పిల్లల ఆలనాపాలనా చూస్తూ యజమానురాలికి ఎంతో సహాయంగా ఉండేది. ఎంతో నిజాయతీగా ఉండే ఆమెపై యజమానురాలికి బాగా గురి కుదిరింది. కానీ రెండేళ్లు గడవక ముందే ఆమె కాంట్రాక్టు ముగియడంతో ఆ ఇంట్లో పని మానేసి వేరే చోట చేరాల్సి వచ్చింది. అదే నగరంలోని కాఫీ షాపులు, సూపర్ మార్కెట్లలో 2014 వరకు పనిచేసింది. 
 
వేరే చోట్ల పనిచేస్తున్నా.. పైక్ కుటుంబంతో కెలో సంబంధాలను మాత్రం తెంచుకోలేదు. తరచుగా వాళ్లింటికి వెళ్తుంటుంది. పిల్లల ఆలనాపాలనా చూస్తుంటుంది. ఎలాంటి పనులు కావాలన్నా చేసి పెడుతుంది. ఓ పనిమనిషిగా కాకుండా కుటుంబంలో ఒకరిగా ప్రేమతో ఆ పనులన్నింటినీ చేస్తుంది. పిల్లలు కూడా ఆమెను పనిమనిషిలా కాకుండా.. ఆంటీ అని ప్రేమతో పిలుస్తుండటంతో తెగ సంతోషపడేది. తమకు ఇంతగా సాయం చేస్తున్న, కుటుంబంలో ఒకరిగా కలిసిపోయిన కెలోకు ఏదైనా చేయాలని ఆ యజమానురాలు భావించింది. ఒకటి కాదు రెండు కాదు 15 ఏళ్లుగా కుటుంబ సభ్యురాలిగా మెలిగిన ఆమె చిరకాల కోరిక ఏంటో తెలుసుకుని.. దాన్ని నెరవేర్చేందుకు సిద్ధమమయింది..
 
అందరిలాగానే కెలోకు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉండేది. కానీ దుబాయికి వచ్చి అన్నేళ్లు పనిచేసినా కొడుకు చదువు కోసం ఆ పనిని వాయిదా వేసింది. ఈనాటికి కూడా ఆమె దగ్గర జమ చేసిన డబ్బులు ఏమీ లేవు. తన స్వస్థలమయిన ఫిలిప్పీన్‌లోని కేమరైన్స్ సర్‌లో సొంతిల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో కోరిక. కానీ భర్త మరణం, కుమారుడి ఆలనాపాలనా, కుటుంబ సభ్యులకు ఉన్న కష్టాలు తీర్చడంతోనే ఆమెకు సరిపోతోంది. దీన్ని గమనించిన యజమానురాలు ఓ నిర్ణయానికి వచ్చింది. ఆమెకు సొంతిల్లు కట్టివ్వాలని, అందుకు అయే మొత్తం ఖర్చును తానే భరించాలని భావించింది. 
కెలోకు ఇల్లు కట్టించి ఇచ్చే పనిని పెద్ద కుమారుడైన 26ఏళ్ల సయీద్ అల్ బుహైరీకి అప్పజెప్పింది.  కెలో సొంతూరిలో నిర్మిస్తున్న ఆ ఇల్లు ప్రస్తుతం ముగింపుదశకు వచ్చింది. జనవరి 18న దుబాయిని శాశ్వతంగా వదిలేసి సొంతూరికి వెళ్లిపోతున్న కెరో వెంట.. సయీద్ కూడా వెళ్లనున్నాడు. ఆమెను అక్కడ క్షేమంగా చేర్చి.. ఇల్లు నిర్మాణ పనులను పర్యవేక్షించి, అందుకు అయే డబ్బును ఇచ్చి తిరిగి రానున్నాడు. ఇల్లు నిర్మాణానికి 23వేల దిర్హమ్‌లు (దాదాపు 4 లక్షల రూపాయలు) ఖర్చయిందని కెలో తెలిపింది. 
 
‘కెలోను నేను పనిమనిషిగా ఎప్పుడూ చూడలేదు. ఇంటి సభ్యురాలిగా భావించా. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు ఆమె చేసిన సాయాన్ని నేనెప్పుడూ మర్చిపోలేను. నా వద్ద పనిచేయడం కుదరకపోయినా మమ్మల్ని మర్చిపోలేదు. వేరే చోట పని చేసిన వెంటనే నేరుగా మా ఇంటికి వచ్చేది. పిల్లలను చూసుకునేది. నా దగ్గర చాలా మంది పనిమనుషులుగా చేశారు. కానీ వారికీ, కెలోకు నిజాయితీలో తేడా ఉంది. నా డెబిట్ కార్డులను కూడా ఆమెకు ఇచ్చేంత నమ్మకం ఉంది. పిల్లలు ఆమెను ఏనాడూ పేరు పెట్టి పిలవలేదు. ఆంటీ అని పిలుస్తుంటారు..’ అని యజమానురాలైన మెక్ పైక్ తెలిపింది.
 
కాగా యజమానురాలు తన కోసం నిర్మిస్తున్న ఇంటిని.. తన 21 ఏళ్ల కుమారుడు రియాన్ పేరిట కెలో రిజిస్టర్ చేసింది. జనవరి 18న తాను సొంతూరికి వెళ్లిపోతున్నాననీ, ఇల్లు కట్టడం పూర్తయిన వెంటనే యజమానురాలిని, ఆమె ఇద్దరు కుమారులను అతిథులుగా పిలుస్తానని చెబుతోంది. కొద్ది రోజులు తన వద్దే ఉండాలని కోరాననీ, తన ఆతిథ్యం స్వీకరించాలని పిలిచానని చెబుతోంది. తనకు ఇల్లు నిర్మిస్తామని చెప్పగానే ఆశ్చర్యపోయాననీ, నమ్మలేకపోయాననీ, వద్దు అని చెప్పినా బలవంతపెట్టారని ఆనందంతో చెబుతోంది. ప్రవాసులపై దారుణాలకు ఒడిగట్టే గల్ఫ్ యజమానులు ఉన్నట్టే.. పనోళ్లను సొంత మనుషుల్లా చూసుకునే వాళ్లు కూడా ఉన్నారని చెప్పేందుకు ఈమె కథ ఓ ఉదాహరణ..