యమ‘కిమ్’కరుడు

అతడి హూంకరింపులకు... అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్‌ అతలాకుతలమైపోతుంది. ప్రతిదాడికి సిద్ధమంటూ శ్వేతసౌధం ఆఘమేఘాల మీద ప్రకటనలు గుప్పిస్తుంది. చిన్నాపెద్దా దేశాలన్నీ ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో అని వణికిపోతాయి. అలా అని, తనేం పులో సింహమో కాదు... కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు. అణ్వాయుధాలతో ఆడుకోవడం, అమెరికాతో తలగోక్కోవడం అతడి అభిరుచులు.

‘నువ్వో కుక్క...’ అంటాడా?
‘వాడో మెంటలోడు...’ అని తేల్చేస్తాడా?
‘నాతో పెట్టుకుంటే పుట్టగతులుండవ్‌’
అంటూ దుమ్మెత్తిపోస్తాడా?
ఎంత ధైర్యమెంతధైర్యం? ఎన్ని గుండెలెన్నిగుండెలు? 
అటుపక్కనున్నవాడు, సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు. అణుబాంబు మీటలున్న బ్రీఫ్‌కేస్‌ను చంకలో పెట్టుకుని తిరిగేంత విధ్వంసప్రియుడు. నా మాటే శాసనమంటూ ఫత్వాలు జారీచేసేంత పరమశాడిస్టు. ఎక్కడ ఏ పంచాయతీ జరుగుతున్నా, ‘నాకేంటి లాభం?’ అని లెక్కలేసుకుని మరీ దూరిపోయే బీభత్స బేహారి. ఆయుధాల్ని అమ్ముకోడానికి యుద్ధాల్ని ప్రోత్సహిస్తాడు, ఆధిపత్యం కోసం ఉగ్రవాదాలకు ఊతమిస్తాడు. విభజించి పాలిస్తాడు, జుట్లు ముడేసి తమాషా చూస్తాడు.
 
కయ్యానికి కాలుదువ్వుతున్నవాడూ, మీసం మెలేసి రోషం ప్రదర్శిస్తున్నవాడూ... అమెరికా అంత బలవంతుడు కాదు. అమెరికాలో కొంత బలవంతుడు కూడా కాదు. ఓ చిన్న దేశానికి పెద్ద నియంత. ఓ పేద రాజ్యానికి సంపన్న సార్వభౌముడు. మూర్ఖుడు రాజుకంటే శక్తిమంతుడని అంటారు. మూర్ఖుడే రాజైతే? అతడి పేరు... కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ఆ దేశం ఉత్తర కొరియా. అతడివన్నీ, ఉత్తుత్తి బెదిరింపులో, ఉత్తరకుమార ప్రతిజ్ఞలో కానేకాదు. కిమ్‌... అమ్ములపొది నిండా అణ్వాయుధాలున్నాయి. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద సైన్యం అతడి ఆదేశాల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఓ చిన్న సంకేతం చాలు - అణుబాంబులు రంకెలేస్తాయి. 
 
ఆరోజే వస్తే...
యముడి మహిషపు లోహ గంటలు గణగణమన్నట్టే. ఇక... విధ్వంసమే, ప్రళయమే, యుద్ధానికి సంకేతమే. ప్రపంచం బాధ అమెరికా బాధేం కాదు. కానీ, అమెరికా బాధ మాత్రం ప్రపంచం బాధ కావాలని ఆ అగ్రరాజ్యం తలపోస్తోంది. తనకు పడిశం చేస్తే, ప్రపంచ దేశాలన్నీ ముక్కు తుడుచుకోవాలన్నది అమెరికా పంతం. ఉత్తర కొరియా విషయానికొచ్చేసరికి, ఆ ఆరాటం మరీ ఎక్కువైంది. ఎందుకంటే, రెండున్నర కోట్లమంది అమెరికా పౌరులు ఉత్తర కొరియా క్షిపణుల పరిధిలో ఉన్నారు. ఉత్తర కొరియా... ఏ భారతదేశమో, పాకిస్థానో కాదు. భారత ఉపఖండం మీది నుంచి ఏ విధ్వంసకాస్ర్తాన్నో ప్రయోగిస్తే... అమెరికాను చేరడానికి అథమపక్షం రెండుగంటలైనా పడుతుంది. అంతలోపు... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ నిప్పుల కుంపటిని నిర్వీర్యం చేయవచ్చు. ఇక్కడలా కాదే, ఉత్తర కొరియా వత్తి ముట్టించే క్షిపణి... అమెరికా గడ్డ మీద వాలిపోడానికైనా, పేలిపోడానికైనా కొన్ని నిమిషాల సమయం చాలు. ఆ భౌగోళిక పరిమితే, అగ్రరాజ్యంతో అరుపులు పెట్టిస్తోంది. మితిమీరిన ఆవేశంతో ట్రంపు ఎగిరెగిరిపడుతున్న కొద్దీ వ్యవహారం కంపుకంపై పోతోంది. 
 
అమెరికాది...
అభిజాత్య ధోరణితో కూడిన అహంకారం.
ఉత్తర కొరియాది...
దుందుడుకుతనం కలగలిసిన అజ్ఞానం. 
ట్రంప్‌ మొండి. కిమ్‌ జగమొండి.
ఇద్దరూ అహంభావులే. ఇద్దరివీ పెద్దనోళ్లే. ‘అణు’ గొడవను అడ్డంపెట్టుకుని, జనాల్లో ఉద్వేగాలు రెచ్చగొట్టి, పీఠాల్ని పదిలం చేసుకోవాలన్న తహతహ ఇద్దర్లోనూ ఉంది. ట్రంప్‌... రాజకీయ నాయకుడిగా మారిన వ్యాపారవేత్త. రాజకీయం కొత్తే కానీ, వ్యాపార రాజకీయం కొత్త కాదు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తనకు బాగా తెలుసు. కిమ్‌కు అంత వ్యవహారజ్ఞానం లేదు. వ్యూహ రచనలోనూ అక్షరమాల దశలోనే ఉన్నాడు. ఆ ఇద్దరి మధ్యా పోరు... ప్రపంచానికి కొత్త సంక్షోభాన్ని తెచ్చిపెడుతోంది.
 
తరాల వైరం...
అమెరికాతో ఉత్తర కొరియా శత్రుత్వం ఇప్పటిది కాదు. ప్రపంచయుద్ధాల ముందు నాటిది. కొన్ని దశాబ్దాల పాటు జపాన్‌ అధీనంలో ఉండేది కొరియా. ఆ సమయంలో... సాంస్కృతికంగా, ఆర్థికంగా, మతపరంగా అనేక హింసలు అనుభవించారు కొరియా ప్రజలు. ఇక్కడి నుంచి అపురూప సంపదల్ని జపాన్‌కు తరలించుకు వెళ్లారు. కొరియన్‌ సంస్కృతిని ప్రతిబింబించే పేర్లనూ మార్చుకోమంటూ తీవ్ర ఒత్తిడి చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఓటమి తర్వాత...ఉత్తర కొరియా రష్యా ఛత్రం కిందికి, దక్షిణ కొరియా అమెరికా నీడలోకి వెళ్లిపోయాయి. అదే అదనుగా అమెరికా అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. పోరాటయోధుడు కిమ్‌ ఇల్‌ సంగ్‌ నాయకత్వంలో ఉత్తర కొరియా... దాయాది మీద యుద్ధం ప్రకటించింది.
 
ఆ దాడికి చైనా, రష్యాలు మద్దతు పలికాయి. అటువైపు నుంచీ, దక్షిణ కొరియా మిత్రదేశంగా అమెరికా రంగంలోకి దిగింది. ఆ పోరాటంలో పదిలక్షలమంది ప్రాణాలు కోల్పోయారు. అపార విధ్వంసం జరిగింది. ఆ యుద్ధాన్ని సామ్రాజ్యవాదంపై పోరాటంగా అభివర్ణించుకుంటారు జనం. అమెరికా పట్ల వ్యతిరేకత అప్పటి నుంచీ ఉందక్కడ. ఆ తర్వాత, సంగ్‌ తనయుడు కిమ్‌ జోంగ్‌ ఇల్‌ అధికారంలోకి వచ్చాడు. ఆయన కూడా అమెరికా సామ్రాజ్యవాదానికి బద్ధ వ్యతిరేకే. పోతూపోతూ ‘అగ్రరాజ్యం మనతో మానసిక యుద్ధం చేస్తోంది. ఆ పోరాటంలో ఉత్తర కొరియా గెలవాలి. మన గడ్డ మీద వాషింగ్టన్‌ ప్రభావం తుడిచిపెట్టుకుపోవాలి’... అని మరణశయ్య మీది నుంచీ తన వారసుడికి కర్తవ్యబోధ చేశాడు. తండ్రి తర్వాత అధికారంలోకి వచ్చిన కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆ ఆదేశాన్ని తూచాతప్పక పాటించాడు. పాలన చేపట్టే నాటికి కిమ్‌ వయసు ముప్పై పైచిలుకు. తాతపోలికలు రావడంతో... ఆ మహానాయకుడి అంశగా భావించారు జనం. ఆ పోలికల కోసం కిమ్‌ ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకున్నాడని ప్రచారం. కిమ్‌ పుట్టిన సంవత్సరం విషయంలో స్పష్టతలేదు. తాతగారి అంశ అని జనాన్ని నమ్మించడానికి... ఆయన చనిపోయిన సరిగ్గా నలభై ఏళ్లకి బుల్లికిమ్‌ జన్మించినట్టు ఓ కట్టుకథను ప్రచారంలోకి తీసుకొచ్చింది ఉత్తరకొరియా సర్కారు. అమాయక ప్రజలు ఆ అబద్ధాన్నే అబ్బురంగా చెప్పుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలోనే రెండు క్షిపణి ప్రయోగాలూ, ఒక అణ్వస్త్ర ప్రయోగం చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు కిమ్‌. యువనేత మహా చపలచిత్తుడు. ఒకట్రెండుసార్లు అమెరికా సలహాలకు తల ఒగ్గినట్టు కనిపించాడు కానీ, అంతలోనే తోక జాడించాడు. మళ్లీ అణ్వస్త్ర తయారీ మొదలుపెట్టాడు. అంతర్జాతీయ ప్రపంచంలో విశ్వసనీయత కోల్పోడానికి కారణం ఆ నిలకడలేనితనమే.
 
అంతా అరాచకమే...
కమ్యూనిజంలోంచి పుట్టిన నియంతృత్వమూ, నియంతృత్వంలోంచి పుట్టిన వారసత్వమూ... ఉత్తర కొరియాను కొరివిదెయ్యాల్లా పీడిస్తున్నాయి. అక్కడ శాంతికి భద్రత లేదు. ఏకపార్టీ వ్యవస్థ కావడంతో నిరసన గళాలకు ఆస్కారమే లేదు. ఎవరైనా తెగించి మాట్లాడితే, తల తెగిపోవడం ఖాయం. సైన్యం చెప్పిందే శాసనం. రాజు చేసిందే పాలన. ఆడపిల్లలకు రక్షణే లేదు. ఏ అమ్మాయి అయినా, కంటికి కాస్త నదురుగా కనబడితే చాలు... ఎత్తుకొచ్చి సెక్స్‌ బానిసలుగా మార్చేస్తారు. తప్పించుకునే ప్రయత్నం చేస్తే... నిర్దాక్షిణ్యంగా కాల్చిపడేస్తారు. ఏలినవాడు రక్తమాంసాలు భుజిస్తున్నప్పుడు, అనుచరులు మాత్రం పాలూపండ్లతో కడుపునింపుకుంటారా? కిమ్‌ రక్తపిపాసి. అడ్డొచ్చినవారినీ, అడ్డొస్తారని అనుమానించినవారినీ... అడ్డంగా నరికేసిన సందర్భాలు అనేకం. శత్రువులకు చావు ఏ రూపంలో అయినా ఎదురుపడవచ్చు. హఠాత్తుగా బుల్లెట్ల వర్షం కురవవచ్చు. రెప్పపాటులో మంటలు చుట్టేయవచ్చు. అనూహ్యంగా, జాతి జాగిలాలు దాడికి దిగవచ్చు. ఆ బలిపశువు - మిలిటరీ అధికారి కావచ్చు, రాచకుటుంబీకుడు కావచ్చు, శత్రుదేశాల గూఢచారీ కావచ్చు. 
 
తండ్రి హఠాన్మరణం తర్వాత... కిమ్‌ పీఠమెక్కిన తీరు మరీ నాటకీయం. పాలన మీద అవగాహన లేదు. పార్టీ మీద పట్టు అంతంతమాత్రమే. సైన్యం గుట్టుమట్లూ తెలియవు. అయినా సరే, సవతి సోదరుడిని పక్కనపెట్టి తానే పీఠం ఎక్కాడు. పార్టీ అధినేతగా, దేశ అధ్యక్షుడిగా, సర్వసైన్యాఽధిపతిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ పిల్లకాకిని చూసి సైనికాధికారులు తోకజాడించడం మొదలుపెట్టారు. పార్టీలో అసమ్మతి పెరిగింది. పాలన అస్తవ్యస్తమైపోయింది. ఆ సంక్షోభ సమయంలో ఓ బలమైన ఆసరా అవసరమైంది కిమ్‌కు. తండ్రి హయాంలో ముఖ్యపాత్ర పోషించిన మేనత్త మొగుడి సాయం తీసుకున్నాడు. రానురానూ ఆ రాచబంధువు బలపడిపోయాడు. కిమ్‌ కిమ్మనకుండా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్నాళ్లపాటు బంధుగణమే రాజ్యం ఏలింది. అసలే కిమ్‌కు అధికార కాంక్ష. ఆ రబ్బరుస్టాంపు పాత్రలో ఇమడలేకపోయాడు. ఉన్నపళంగా పగ్గాలు లాగేసుకున్నాడు. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రలూ కుతంత్రాలూ చేస్తున్నాడంటూ... మామ మీద కేసులు బనాయించాడు. కొద్దిరోజులకే ఆ కుటుంబం ‘కనిపించకుండా’ పోయింది. కిమ్‌ సవతి సోదరుడు నామ్‌ కూడా కౌలాలంపూర్‌లో దిక్కులేని చావు చచ్చాడు. ఏదో ఒకరోజు నామ్‌ తనకు పోటీవస్తాడన్న భయం కిమ్‌ను వెంటాడేది. ‘విష ప్రయోగం’ కారణంగా నామ్‌ ప్రాణాలు కోల్పోయినట్టు పోస్టుమార్టమ్‌ రిపోర్టు చెబుతోంది. 
 
ఆ విషపు ఆలోచన ఎవరిదన్నది బహిరంగ రహస్యం. అధినేత ధోరణిని నిరసించిన పాపానికి ఏ జలాశయంలోనో శవాలై తేలిన సైనికాధికారులైతే... వందలమంది. కొన్నిసార్లు ఆ మృత్యుక్రీడ బహిరంగంగానే జరుగుతుంది. వేలమంది సమక్షంలో... పరిగెత్తించి పరిగెత్తించి చంపే పరమకిరాతక దృశ్యాన్ని పరవశంగా తిలకిస్తాడు కిమ్‌. అతడి భార్య రిసోల్‌జూ చాలాకాలం అంతఃపురం దాటి రాలేదు. ఆమెను కూడా చంపేసే ఉంటాడని జనం చెవులు కొరుక్కున్నారు. అదృష్టవశాత్తు, అలాంటిదేం జరగలేదు. ఆమె నిక్షేపంగా ఉన్నారు. మూడోబిడ్డకు జన్మనిచ్చినట్టూ సమాచారం. కిమ్‌ దృష్టిలో ఉత్తర కొరియా ఓ చదరంగం బల్ల. సైన్యం నుంచి సామాన్యుల దాకా అందరూ పావులే. 
 
కళాకారుడే...
కిమ్‌లో మరో మనిషి ఉన్నాడు. అతడు ‘ముత్యాలముగ్గు’లో రావుగోపాల్రావు టైపు. ‘ఎప్పుడూ అణుబాంబులూ, ఖండాంతర క్షిపణులేనా? మడిసన్నాక కూసింత కళాపోషణుండాలి’ అనుకునేరకం. కిమ్‌ పళ్లెంలో ముప్పొద్దులా షడ్రసోపేతమైన విందు ఉండాల్సిందే. ఆ జిహ్వ చాపల్యం వల్లే... విపరీతంగా బరువు పెరిగిపోయాడు. కొవ్వు తగ్గించుకోకపోతే నువ్వు బతకవని డాక్టర్లు హెచ్చరించారు కూడా. సంగీతమంటే చెవి కోసుకుంటాడు. ఖాళీ దొరికినప్పుడల్లా ఏ ఫిడేలో వాయిస్తుంటాడు. మైఖేల్‌జాక్సన్‌ అంటే ప్రాణమిస్తాడు. రిసోల్‌జూతో పెళ్లి వెనుకా సంగీతమే ఉంది. ఆ అమ్మాయి మంచి గాయని. ఆమె పాటనచ్చి, తనదాన్ని చేసుకున్నాడట. కిమ్‌కు బాస్కెట్‌బాల్‌ అన్నా పిచ్చే. మైఖేల్‌జోర్డాన్‌కు వీరాభిమాని. రోజూ ఓ గంటైనా బాస్కెట్‌బాల్‌ ఆడతాడు. మహామహా ఆటగాళ్లకైనా ఏదో ఓ సమయంలో ఓటమి తప్పదు. నిజమైన క్రీడాకారుడు ఆ వైఫల్యాన్ని హుందాగా స్వీకరిస్తాడు కూడా. క్రీడాస్ఫూర్తి అంటే అదే! కిమ్‌కు మాత్రం ఓటమి అంటే పరమ అసహ్యం. తమ దేశం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఆటగాళ్లను ఎయిర్‌పోర్టులోనే, ‘ఖాళీ చేతులతో తిరిగొస్తే మాత్రం ఖేల్‌ ఖతమ్‌...’ అని హెచ్చరించాడు. అంత ఒత్తిడిలో ఆటేం ఆడతారూ, పతకాలేం తెస్తారూ? బెదిరించినట్టుగానే, ఓడివచ్చిన వారిని బొగ్గుబావిలో వెట్టి కార్మికుల్ని చేశాడు. 
 
 అంతరాంతరాల్లో మహాపిరికివాడు కిమ్‌. నిద్రలోనూ ప్రాణభయమే! తనను గద్దె దించడానికి, అమెరికా నేతృత్వంలో కుట్రలూ కుతంత్రాలూ జరుగుతున్నాయని అనుమానిస్తుంటాడు. నాలుగేళ్ల క్రితం నిజంగానే హత్యాయత్నం జరిగింది. అప్పటి నుంచీ మృత్యుభీతి మరింత ముదిరింది. హఠాత్తుగా పళ్లెం ముందు నుంచీ లేచిపోతాడు, శత్రువులు ఆహారంలో విషం కలిపారేమో అన్న అనుమానం. ఉలిక్కిపడినట్టు నిద్రలోంచి మేల్కొంటాడు, ఎవరో తన వెనుక నిలబడినట్టు చిత్తభ్రాంతి. సైన్యంలోని ప్రధాన అధికారుల మీదా ఓ కన్నేసి ఉంచుతాడు. ఆరేళ్ల పాలనలో... ఆరేడుగురు రక్షణ మంత్రుల్ని మార్చేశాడు. అధికారం చేపట్టి ఇంతకాలం గడిచినా, ఉత్తర కొరియా సరిహద్దులు దాటలేదు కిమ్‌. కారణం... పీఠాన్ని సైన్యం లాగేసుకుంటుందేమో అన్న భయం. 
 
పాపం సామాన్యుడు...
యుద్ధోన్మాదంలో పడిపోయి, అణు పరీక్షల్లో మునిగిపోయి... పాలనను గాలికొదిలేశాడు కిమ్‌. ఫలితంగా సామాన్యుడి బతుకు దుర్భరమైపోయింది. దేశంలో నిరుపేదలే ఎక్కువ. పరిశ్రమలు వస్తేనే ఉపాధి. ప్రస్తుత పరిస్థితుల్లో... ఉత్తర కొరియాలో పరిశ్రమలు పెట్టడానికి ఏ బహుళజాతి సంస్థ మాత్రం సిద్ధపడుతుంది. దీంతో, సైన్యంలో తప్పించి పెద్దగా ఉద్యోగ అవకాశాలు లేకుండాపోయాయి. గనులు కొంతమేర ఆదుకుంటున్నాయి. ఆహార సమస్య చాలా తీవ్రంగా ఉందిక్కడ. నియంత జీవనశైలి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. రాజభోగాలు అనుభవిస్తాడు. వందదాకా ఖరీదైన కార్లు ఉన్నాయని ప్రచారం. స్వర్గాన్ని తలపించే ఓ నౌక కూడా ఉందంటారు. అణుబాంబులంటే అధినేతకు మహా ఇష్టం. వాటి తయారీలో పాల్గొంటున్న శాస్త్రవేత్తలకు కోట్లకు కోట్లు నజరానాగా ప్రకటిస్తుంటాడు. దొరగారికి మదపిచ్చీ ఉంది. ఆయన కోసమే ప్రత్యేకంగా ఓ ‘ప్లెజర్‌ స్క్వాడ్‌’ సిద్ధంగా ఉంటుంది. అందులో అంతా అందమైన అమ్మాయిలే.
 
ఇప్పటికీ ఆ దేశంలో ఇంటర్నెట్‌ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో లేదు. ప్రభుత్వ అధికారులకు, సైనిక వర్గాలకు మాత్రమే పరిమితం. ఇంటర్నెట్‌ అంటేనే సమాచార విప్లవం. ఇక రహస్యాల్ని గుప్పిట్లో బంధించే ఆస్కారం ఉండదు. అదే జరిగితే, సైనిక నియంతృత్వం కుప్పకూలినట్టే. ఆ భయంతోనే కిమ్‌... ప్రసార మాధ్యమాల్ని నిర్దయగా అణిచేస్తున్నాడు. ఏ సమాచారమైనా సర్కారీ పత్రికద్వారా తెలియాల్సిందే. ఆ పత్రికలో చెత్తవార్తలూ, చెక్కభజనలూ తప్ప ఏమీ ఉండవు. ప్రతి పేజీలో కిమ్‌ ఫొటో తప్పనిసరి. ఎవరైనా తెలిసో తెలియకో పత్రికను తగలబెడితే... రాజద్రోహం కిందే లెక్క. శిక్ష ఎంత తీవ్రంగా అయినా ఉండవచ్చు. కారణం... ఆ పత్రికలో దేశాధ్యక్షుడి ఫొటో ఉండటమే, పత్రికను కాల్చడమంటే కిమ్‌ సార్వభౌమత్వాన్ని ధిక్కరించడమే. దేశంలో ఏ మూలన చూసినా కిమ్‌ల విగ్రహాలే. ఏలినవారి పుట్టినరోజులు జాతీయ సెలవుదినాలు. 
 
అయినా, ఆ అరాచకస్వామ్యాన్ని... కాస్తంత అజ్ఞానంతో, బోల్డంత అమాయకత్వంతో ఉత్తర కొరియా ప్రజలు భరిస్తూనే ఉన్నారు. వాళ్ల దృష్టిలో కిమ్‌... దేవుడిచ్చిన నాయకుడు! తమ తలరాత మార్చడానికి తాత పోలికలతో వచ్చిన దేవదూత! ఉత్తర కొరియా జెండాను అమెరికా గుండెల మీద ఎగరేయబోతున్న వీరాధివీరుడు. మూడుతరాలుగా జనం ఉద్వేగాలతో మూడుముక్కలాట ఆడుకుంటోంది కిమ్‌ కుటుంబం. పెరుగుతున్న నిరుద్యోగం గురించీ, బతుకుల్ని బలితీసుకుంటున్న పేదరికం గురించీ ప్రజలు ఆలోచించకూడదంటే... ఇలాంటి టక్కుటమార విద్యలు ప్రదర్శించాల్సిందే. 
 
ఒకనాటి వలసరాజ్యమైన జపాన్‌ పట్ల ఇప్పటికీ ప్రజల్లో అయిష్టత ఉంది. ఆ ద్వేషాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నాడు కిమ్‌. తమ ప్రామాణిక సమయం కూడా జపాన్‌ తప్పుడు లెక్కల ఫలితమేనంటూ.... గడియారాల్ని ఓ అరగంట వెనక్కి తిప్పాలని ఫత్వా జారీ చేశాడు. జపనీయులు ఉత్తర కొరియా కాలాన్ని ఓ ముప్పై నిమిషాలు మాత్రమే వెనక్కి తీసుకెళ్లి ఉండవచ్చు. కిమ్‌ మాత్రం... తన అహంకారంతో, అణు దాహంతో... ఉత్తర కొరియా ప్రజల్ని తరాలకొద్దీ తిరోగమనం వైపు లాక్కెళ్తున్నాడు. 
అణ్వాయుధాలూ, హైడ్రోజన్‌ బాంబులూ, క్షిపణులూ... కిమ్‌ది నిఖార్సయిన రక్తభాష. అన్నం, ఉపాధి, టెక్నాలజీ, ఆనంద సూచి, పొరుగుదేశానికి స్నేహహస్తం... వగైరా వగైరా పాజిటివ్‌ పదాలకు ఆయన నిఘంటువులో స్థానం లేదు.
 
మన దాకా వస్తే...
కిమ్‌కు అమెరికా పేరు చెబితేనే పూనకం వచ్చేస్తుంది. అదే స్థాయిలో అమెరికాను వ్యతిరేకించే... ఇస్లామిక్‌ ఉగ్రవాదులతో చేతులు కలిపితే మాత్రం భారత్‌కు ముప్పే.  ఆర్థిక సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉత్తర కొరియా... ఇప్పటికే, ఆయుధాల వ్యాపారం ద్వారా ఖజానా నింపుకుంటున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు. ఈమధ్యే సూడాన్‌కు గైడెడ్‌  ఏరియల్‌ మిస్సైల్స్‌ భారీగా విక్రయించింది. ఉత్తర కొరియాకు అణ్వస్త్ర ఫార్ములాను ఇచ్చింది తామేనని పాక్‌ అణుశాస్త్రవేత్త ఎ.క్యూ.ఖాన్‌ బహిరంగంగానే అంగీకరించారు.
 
‘ప్రపంచానికంతా 2017వ సంవత్సరం నడుస్తోంటే... ఉత్తర కొరియాకు మాత్రం ఇది 104వ సంవత్సరం! కిమ్‌ ఇల్‌ సంగ్‌ జయంతితో వీరికి కొత్తశకం మొదలైంది’
‘జనం ఎలా జుత్తు కత్తిరించుకోవాలన్నదీ అధినేతే శాసిస్తాడు. ఎంపిక చేసిన ఓ డజను స్టైల్స్‌లో ఏదో ఒకదానితో సర్దుకుపోవాలి. ఆడవాళ్లయితే కిమ్‌ శ్రీమతి కట్టూబొట్టును అనుకరించాలి . లేదంటే శిక్షలు తప్పవు’ 
 
తొలి నుంచీ సంక్షోభాలే...
పేరు: ఉత్తర కొరియా
(డెమొక్రటిక్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా)
రాజధాని: ప్యాంగ్‌యాంగ్‌
సైన్యం: ది కొరియన్‌ పీపుల్స్‌ ఆర్మీ
(చైనా, అమెరికా, భారత్‌ల తర్వాత అతిపెద్దది)
పాలన విధానం: ఏకపార్టీ వ్యవస్థ 
అధికార పార్టీ: కొరియా వర్కర్స్‌ పార్టీ
విధానం: మిలిటరీ ఫస్ట్‌... సైన్యానికే అగ్రస్థానం.
జనాభా: రెండున్నర కోట్ల పైచిలుకు
కరెన్సీ: నార్త్‌కొరియన్‌ వన్‌
సరిహద్దులు: దక్షిణ కొరియా, చైనా, రష్యా. 
జాతీయ జెండా: నీలం, ఎరుపు, నీలం రంగుల మధ్యలోని వృత్తంలో నక్షత్రం. 
 
సిద్ధాంతం : జూచె ... స్వయం ఆర్థిక స్వావలంబన. దేశానికి అవసరమైనవన్నీ దేశంలోనే తయారు చేసుకోవడం. దీనివల్ల ప్రత్యేకీకరణ లేకుండా పోయింది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడానికి ఇదో కారణం. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం తర్వాత... వెన్నెముక విరిగినంత పనైంది. ఆ స్థానాన్ని చైనా భర్తీ చేస్తుందని భావించింది. కానీ, పెద్దన్న పెద్దగా పట్టించుకోలేదు.
ప్రధాన వ్యాపార భాగస్వామి: చైనా (గత ఏడాది ఉత్తర కొరియా ఎగుమతుల్లో ఎనభై ఎనిమిది శాతం చైనాకే).
ముఖ్య పరిణామాలు: జపాన్‌ ఆక్రమణ (1905), ఉత్తర-దక్షిణ కొరియాల విభజన (1945), ప్రత్యేక ప్రభుత్వాల ఏర్పాటు (1947), దక్షిణభాగం మీద ఉత్తర కొరియాదాడి; కొరియా యుద్ధం (1950-53), తీవ్ర కరువుకాటకాలు (1994-98), ఐరాసలో సభ్యత్వం (1991), అణ్వాయుధ ఒప్పంద ఉల్లంఘన (2003), తొలి అణుప్రయోగం విజయవంతం (2006), హిరోిషిమా బాంబు కంటే పదిహేడు రెట్లు శక్తిమంతమైన అణుపరీక్ష (2017).
 
చదువులకు పెద్దపీట...

ఏమాటకామాటే చెప్పుకోవాలి. కిమ్‌ విద్యకూ వైద్యానికీ చాలా ప్రాధాన్యం ఇస్తాడు.  ఇక్కడ వైద్యం పూర్తిగా ఉచితం. సర్కారీ దవాఖానాలు కార్పొరేట్‌ ఆసుపత్రుల్ని తలపించేలా ఉంటాయి. అదే సమయంలో సంప్రదాయ కొరియన్‌ వైద్యాన్ని కూడా ప్రోత్సహిస్తోందా దేశం. పేద దేశమైనా ఉత్తర కొరియా జీవన ప్రమాణం... డెబ్బయ్యేళ్ల పైచిలుకుగా ఉంది. ‘వర్దమాన దేశాలకు ఉత్తరకొరియా వైద్య విధానం ఓ పాఠం’ అంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థే కితాబు ఇచ్చింది. విద్యకూ అంతే విలువ ఇస్తాడు కిమ్‌. పాఠ్యపుస్తకాల్లో అక్కడక్కడా పాలకుల స్తోత్రపాఠాలు ఉన్నా... మానవ సంబంధాలు, జీవన నైపుణ్యం, విలువలు మొదలైన విషయాలకు స్థానం ఇచ్చారు.  ప్రతి బడికీ ఆటమైదానం తప్పనిసరి.   ఆర్థిక సంక్షోభంలోనూ బడ్జెట్‌ కేటాయింపుల్లో రాజీ ఉండదు.

 

యోధుడి పేరు...
శిలా ఫలకాల మీద ఉంటుంది.
సమర్థ పాలకుడి పేరు...
ప్రజల గుండెల్లో ఉంటుంది.
‘ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. అయినా, మించిపోయింది లేదు. నిర్ణయించుకో కిమ్‌... నీ పేరు ఎక్కడ ఉండాలో’
 
అమెరికా విషయంలో...
కిమ్‌ ఆగ్రహంలో తప్పులేదు.
ఆ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి...
ఎంచుకున్న మార్గమే తప్పు! 
ఆ ఫలితం ఎలా ఉన్నా అతడు అనుభవించాల్సిందే. 
మనం ఆందోళన చెందాల్సింది కిమ్‌ జయాపజయాల గురించి కాదు... తరాలుగా ఓడిపోతూనే బతుకుతున్న ఉత్తర కొరియా ప్రజల గురించీ, ఇద్దరు మూర్ఖుల అహంకారం వల్ల ప్రపంచానికి ఏర్పడబోయే పెనుముప్పు గురించీ!

 

 

ఈ కథనంలో ప్రతినాయకుడు కిమ్మే, సందేహం లేదు. కానీ.. కిమ్‌ అనేవాడే విలన్‌ అయితే.... కిమ్‌లాంటి అనేకానేకమంది విలన్లను సృష్టించినవాడు ఇంకెంతపెద్ద విలనై ఉండాలి. ఆ కనిపించని ప్రతినాయకుడే అమెరికా! కిమ్‌లోని నిరంకుశత్వాన్ని ఖండించాల్సిందే. ప్రజల బాగోగులు పట్టించుకోనందుకు నిలదీయాల్సిందే. అమెరికా విషయంలోనూ.... కిమ్‌ది దుందుడుకు చర్యే. అయితే, ఆ తెగువ కండబలంతోనో, కరెన్సీబలంతోనో వచ్చింది కాదు. చేతిలో అణ్వాయుధం లేకపోతే... అమెరికా తమను మింగేయడం ఖాయమన్న అభద్రతలోంచీ, ఆత్మగౌరవంలోంచీ పుట్టింది. ఉత్తర కొరియాను అమెరికా ఎంత వేపుకుతిందీ, ఎన్ని పరిమితులు విధించిందీ. ధూర్తదేశమంటూ, దుష్ట రాజ్యమంటూ ఎన్నిశాపాలు పెట్టిందీ. అంతగా వేధిస్తే ఎంత చిన్న దేశమైనా... చావోరేవో తేల్చేసుకోవాలనే అనుకుంటుంది. ఆ తెంపరితనంలోంచి పుట్టుకొచ్చిన విపరిణామాలే ఇవన్నీ.