సందిగ్ధంలో బ్రెగ్జిట్‌

‘బ్రెగ్జిట్‌’ అన్న ఒక్కమాట రెండేళ్ళుగా యూరోపియన్‌ యూనియన్‌ దేశాలను భయపెడుతున్నది. ఇప్పటికీ కూడా ఈయూనుంచి బ్రిటన్‌ వేరుపడే వ్యవహారం ఎలా ముగియబోతున్నదీ ఇదమిత్థంగా చెప్పలేని స్థితి. బ్రెగ్జిట్‌కు సంబంధించి బ్రిటన్‌ ప్రధాని తెరీసా మే ప్రతిపాదించిన ముసాయిదాను, ఈయూతో కుదిరిన ఒప్పందాన్ని చాలామంది ఎంపీలు వ్యతిరేకిస్తున్నందున డిసెంబరు 11న బ్రిటన్‌ పార్లమెంటులో జరగబోయే ఓటింగ్‌పై చాలా అనుమానాలు ఉన్నాయి. ఈయూనుంచి వేరుపడేందుకు ఇంతకుమించిన అద్భుత విధానం లేనేలేదని తెరీసా మే అంటుంటే, ఆమె బ్రిటన్‌ ప్రయోజనాలను పణంగా పెట్టారని మిగతావారు విమర్శిస్తున్నారు.

 
రెండేళ్ళక్రితం బ్రిటిష్‌ ప్రజలు బ్రెగ్జిట్‌ తీర్పు ఇవ్వగానే ఆ దేశంనుంచి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ పెద్ద ఎత్తున జరిగింది. కానీ, ఈయూనుంచి తప్పుకుంటున్న తమ భవితవ్యం ఎలా ఉంటుందోనన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఇటీవల ఆసియానుంచి బ్రిటన్‌కు విదేశీ పెట్టుబడులు బాగా పెరిగాయి. ముఖ్యంగా భారత్‌నుంచి ఇవి ఏడాదిలో మూడురెట్లు పెరిగాయట. వచ్చే ఏడాది మార్చి 29న ఈయూనుంచి విడిపోబోతున్న తమపై మిగతాదేశాల్లో క్రమంగా నమ్మకం హెచ్చుతున్నందుకు బ్రిటన్‌ సంతోషిస్తున్నది. ముఖ్యంగా ఆసియాదేశాలు బ్రిటన్‌తో ఆర్థికంగానే కాక, ఇతరత్రా కూడా బలమైన సంబంధాలకోసం ఎదురుచూస్తున్నాయని దీని అర్థం. ఈయూనుంచి వైదొలిగేందుకు వీలుగా దానితో బ్రిటన్‌ చేసుకున్న ఒప్పందానికి 27 ఈయూ దేశాల నేతలు ఇప్పటికే ఆమోద ముద్ర వేసినప్పటికీ, దీనికి సరేననేందుకు బ్రిటన్‌పార్లమెంటులో అత్యధికులు సిద్ధంగా లేరు.
 
వేరుపడే ఒప్పందం కుదిరినా లేకున్నా చట్టప్రకారం మార్చి 29వతేది కల్లా బ్రెగ్జిట్‌ పూర్తికావాల్సిందే. వేరుపడాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరాలన్నా, బ్రిటన్‌కు ఏమాత్రం నష్టం లేకుండా ఈ ప్రక్రియ పరిపూర్ణంగా ముగియాలన్నా తన దారికి రావడం వినా మరోమార్గం లేదని తెరీసా మే పార్లమెంటుకు బల్లగుద్ది చెబుతున్నారు. కానీ, ఉపాధి, వలసలు, వాణిజ్యం ఇత్యాది విషయాల్లో తెరీసా మార్గం బ్రిటన్‌కు తీవ్రమైన అన్యాయం చేయబోతున్నదని ఆమె పార్టీ సభ్యులే కొందరు వ్యతిరేకిస్తున్నారు. మంత్రివర్గంలోని కొందరు రాజీనామా చేసిపోతే, సొంతపార్టీ ఎంపీలే ఆమెపై అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 11న ఆమె ఒప్పందం పార్లమెంటులో నెగ్గకపోవచ్చున్న అనుమానాలే అధికంగా ఉన్నాయి.
 
బ్రిటన్‌ పార్లమెంటు తరువాత, ఈయూ పార్లమెంట్‌ కూడా ఈ ఒప్పందాన్ని ఆమోదించవలసి ఉంది. ఇదంతా మార్చిలోగా పూర్తయి వేరుపడే అసలు ప్రక్రియ మొదలవుతుంది. దీనికి 21 నెలలు పడుతుంది. ఒకవేళ ఒప్పందాన్ని బ్రిటన్‌ పార్లమెంటు ఆమోదించకపోతే అసలు ఒప్పందమే లేకుండా బ్రిటన్‌ బయటకు వెళ్ళాల్సిరావచ్చునని తెరీసా మే హెచ్చరిస్తున్నారు. కొత్త ఒప్పందం కోసం మళ్ళీ చర్చలు చేసుకోవచ్చునని మరికొందరు వాదిస్తున్నారు. మార్చి 29లోగా మనసు మార్చుకొనేందుకు కూడా బ్రిటన్‌కు దండిగా అవకాశాలున్నాయి. మిగతా ఈయూ దేశాల ఆమోదంతో సంబంధం లేకుండా ఈ వేర్పాటు ప్రక్రియను బ్రిటన్‌ తనకుతానుగా రద్దుచేసుకోవచ్చునని ఈయూ కోర్టు ఇప్పటికే సూచన ప్రాయంగా చెప్పింది.
 
మరొకమారు ప్రజాభిప్రాయ సేకరణకు పోవడం వంటి చర్యల ద్వారా బ్రిటన్‌ తమతో కలిసే ఉంటుందన్న భరోసా ఏమాత్రం కలిగినా మార్చి 29 గడువును పెంచేందుకు ఈయూ కూడా సిద్ధంగా ఉంది. సత్వరమే ఎన్నికలు తెచ్చి, వాటిలో నెగ్గి, తన సొంత విధానంలో బ్రెగ్జిట్‌ అమలు చేయాలని విపక్ష లేబర్‌ పార్టీ ప్రయత్నిస్తున్నది. ఇది సాధ్యంకాని పక్షంలోనే మరోమారు ప్రజాభిప్రాయ సేకరణ జరపడం ద్వారా ప్రజలకు చివరి అవకాశం ఇవ్వాలని లేబర్‌పార్టీ అనుకుంటున్నది. ఐదురోజుల వేడీవాడీ చర్చ అనంతరం జరిగే ఓటింగ్‌ బ్రిటన్‌ను కీలకమైన మలుపులు తిప్పబోతున్నది. ఓటింగ్‌లో ఓడిపోతే స్వపక్షంలో వ్యతిరేకత ప్రబలి తెరీసా రాజీనామా చేయవచ్చు. వెంటనే ఎన్నికలు రావచ్చు, లేదా ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఒక తాత్కాలిక ప్రభుత్వమూ ఏర్పడవచ్చు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ బ్రెగ్జిట్‌ సమస్య అటకమీద పెట్టాలన్న నిర్ణయం కూడా జరగవచ్చు.