రాబందులు.. ఆ ఊరి బంధువులు

డచ్‌ హార్బర్‌.. అలస్కా స్టేట్‌లో సంపన్నమైన నగరాల్లో ఒకటి. మత్స్యసంపద ఎగుమతులతో హార్బర్‌ ఎప్పుడూ కోలాహలంగా ఉంటుంది. కానీ, ఎప్పుడొస్తాయో తెలియదు.. ఎక్కడ్నుంచి వస్తాయో తెలియదు.. ఇలా వచ్చి అలా చేపలను నోట కరుచుకుని ఎగిరిపోతాయి. ఇటు చూసి అటు చూసేంతలో.. సెల్‌ఫోన్‌ వంటి విలువైన వస్తువులను గద్దలా తన్నుకుపోతాయి. గద్దలా తన్నుకుపోవడమేంటి? అవి నిజంగా గద్దలే. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా డచ్‌ హార్బర్‌ నుంచి కీలకమైన దాడులు చేసింది. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు రాబందుల స్వైర విహారంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
 
ఈ ప్రాంతంలో ఐదు వేల కుటుంబాలు ఉంటే.. దాదాపు వెయ్యికి పైగా గద్దలు డచ్‌ హార్బర్‌పై చక్కర్లు కొడుతున్నాయి. హార్బర్‌ చుట్టుపక్కల జనావాసాలే ఆవాసాలుగా సెటిలయ్యాయి. ఎగుమతికి సిద్ధం చేసిన చేపలను ఇవి తన్నుకుపోతాయి. ఎవరైనా గద్దిస్తే.. వారిపై దాడికి దిగుతాయి. అయినా, స్థానికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు తప్ప.. గద్దల జోలికి వెళ్లరు. ఈ గద్దలు మాత్రం ఎత్తయిన భవనాల మీద వాలి.. పోర్టుకు ఏ పడవ వస్తుందో చూసుకుని మరీ చేపల వేటకు బయల్దేరుతాయి.