చలో.. దుబాయి షాపింగ్ ఫెస్టివల్

నార్సింగ్‌, హైదరాబాద్, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): జనవరి మొదటి వారం వచ్చిందంటే.. నగరంలో మొదలయ్యే నుమాయిష్‌ సందడి అందరికీ తెలిసిందే. ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి కూడా సందర్శకులు వస్తుంటారు. కొంత మంది మాత్రం నగరం నుంచి దుబాయ్‌ వెళ్తుంటారు.. ఎందుకో తెలుసా.. కేవలం షాపింగ్‌ కోసమే.. ఆశ్చర్యంగా ఉందా..? అయితే ఇది చదవాల్సిందే.

దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌కు వెళ్తున్న నగరవాసులు పెరుగుతున్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు వెళ్లి వచ్చినంత సునాయసంగా దుబాయ్‌ షాపింగ్‌ మాల్‌కు వెళ్తున్నారు. ఎగువ  మధ్య తరగతి నుంచి ఉన్నత తరగతి వారు చలో దుబాయ్‌ అంటున్నారు.  డిసెంబర్‌ 28 నుంచి జనవరి 28 వరకు దుబాయ్‌లో షాఫింగ్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది. ఈ ఫెస్టివల్‌కు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వెళ్తారు. మన నగరం నుంచి 2005 నుంచి అధికంగా వెళ్తున్నారని ట్రావెల్‌ ఏజెంట్లు చెబుతున్నారు. అంతకు ముందు లిమిటెడ్‌ ఎడిషన్‌లో వెళ్లే వారు కానీ ప్రస్తుతం ఆ సంఖ్య పెరుగుతోందన్నారు. 2005 నుంచి 2012 వరకు దుబాయ్‌ వెళ్లిన వారిలో ఎక్కువగా నగరవాసులే అధికమట. ఎందుకంటే అప్పట్లో ఉన్న రియల్‌ భూమ్‌ వారిని దుబాయ్‌ పంపింది. ఒకప్పుడు దుబాయ్‌ అంటే ఏదో ఉద్యోగం కోసం వెళ్లేవారు. చాలా సినిమాల్లోనూ అదే చూపించారు. ఇప్పుడు పర్యటన కోసం వెళ్తున్నారు. జనవరి మాసంలో అయితే అక్కడ జరిగే షాపింగ్‌ ఫెస్టివల్‌కు వెళ్తున్నారు. వారిలో నగరవాసుల సంఖ్య ఎక్కువ ఉంటుండడం గమనార్హం. 
షాపింగ్‌లో ఏమేం ఉంటాయంటే... 
నెల రోజుల పాటు దుబాయ్‌ మొత్తం షాపింగ్‌ ఫెస్టివలే.. ప్రపంచ పర్యాటకులు అధికంగా వెళ్తారు. అందులో యూరోపియన్‌ల వారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న ఎలక్ర్టానిక్‌ వస్తువుల దగ్గరి నుంచి బంగారం, దుస్తులు, లెదర్‌ గూడ్స్‌ పెర్‌ఫ్యూమ్స్‌, మద్యం... ఇలా ఒక్కటేమిటి ప్రతీది ఇక్కడ లభిస్తాయి. నాణ్యమైన బంగారానికి దుబాయ్‌ పెట్టింది పేరు. ప్రపంచ బంగారానికి హబ్‌ లాంటింది. అయితే ఇటీవల తనిఖీలు ముమ్మరం చేయడంతో  బంగారం కంటే మనోళ్లు దుస్తులు, లెదర్‌ గూడ్స్‌, గడియారాలు వంటివే అధికంగా కొనుగోలు చేస్తున్నారు. 
 
సూపర్‌ ప్యాకేజీలు 
దుబాయ్‌ వెళ్లడానికి టూరిజం సంస్థలు నగరం నుంచి మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయి. ప్రతి రోజూ నగరం నుంచి పది విమానాలు దుబాయ్‌ వెళుతుంటాయని ట్రావెలింగ్‌ ఏజెంట్లు చెబుతున్నారు. నాలుగు రాత్రులు, ఐదు పగలు ఒక ప్యాకేజీ, ఆరు రోజులు, ఐదు రాత్రులు మరో ప్యాకేజీ కింద అందిస్తున్నారు. ఇందుకు గాను ఒకరికి  48 వేల నుంచి 62 వేల వరకు తీసుకుంటున్నారు. విమానం రాను, పోను టికెట్‌ చార్జీలతో పాటు త్రీ స్టార్‌ హోటల్స్‌ సౌకర్యం బ్రేక్‌ఫాస్ట్‌/ డిన్నర్‌ ఉంటాయి. ప్యాకేజీల కింద కాకుండా నేరుగా కూడా వెళ్లొచ్చు. అక్కడ హోటల్‌ రూం ధరలు మూడు వేల రూపాయల నుంచి అందుబాటులో ఉంటున్నాయి. 
 
 
ఎక్కడ చూసినా ఇండియన్స్‌
షాపింగ్‌ ఫెస్టివల్‌లో 54 శాతం ఇండియన్స్‌, ఎన్నారైలు వస్తారని ట్రావెల్స్‌ ఏజెంట్ల అంచనా. ఇక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతుండడంతో దుబాయ్‌లో చాలా మంది మనోళ్లు పెట్టుబడులు పెడుతుంటారు. అంతే కాకుండా అక్కడ ఫ్లాట్స్‌ కొని నివాసముంటున్న వారిలో చాలా మంది ఇండియన్స్‌ ఉన్నారు. ఎక్కువగా దుబాయ్‌ వెళ్లే వారు అక్కడ ఫ్లాట్‌ కొనుక్కుని పెట్టుకుంటున్నారు. ఏ హోటల్‌లో చూసినా హైదరాబాద్‌ బిర్యానీ సిద్ధంగా ఉంటుంది. 

ఫెస్టివల్‌కు వెళితే...
దుబాయ్‌ షాపింగ్‌ ఫెస్టివల్‌కు వెళ్తే ఎన్నో వింతలు, విశేషాలు చూడొచ్చు. షాపింగ్‌ చేసుకోవడంతో పాటు డిసెర్ట్‌ సఫారి, బెల్లీ డాన్స్‌, బార్బిక్యూ రెస్టారెంట్‌ డిన్నర్‌లు, డ్యూన్‌ డాషింగ్‌, అత్యంత ఎతైన టవర్‌ అయిన బుర్డ్‌ ఖలీఫాలో 124 అంతస్థుల నుంచి  దుబాయ్‌ సందర్శన, అక్కడే డిన్నర్‌,  గ్లోబల్‌ విలేజ్‌ సందర్శన చేయవచ్చు. 
 
 
జాగ్రత వహించాలి
మేం చాలా సార్లు దుబాయ్‌ వెళ్లాం. అంతకుముందు వెళ్లిన వారి అనుభవాలు తెలుసుకుని వెళ్లేవారం. అక్కడ చట్టాలు చాలా కఠినం. వాటిపై అవగాహన ఉంటే మంచిది. క్రైంకు దూరంగా ఉండాలి. స్వేచ్ఛగా ఉండొచ్చు కానీ.. ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు. పాద చారులకు అక్కడ అధిక ప్రాధాన్యం ఇస్తారు. దుబాయిలో డిసెర్ట్‌ సఫారీ, గ్లోబల్‌ విలేజ్‌ చూడదగ్గవి. వ్యక్తిగత షాపింగ్‌ చేసే వారు అధికం. తెలుగు రెస్టారెంట్లు చాలా ఉంటాయి. ఇడ్లీ నుంచి బిర్యానీ వరకూ అన్నీ లభిస్తాయి. ఎక్కడ చూసినా తెలుగోళ్లు కనిపిస్తారు. గ్రూపులుగా వెళ్తే షాపింగ్‌ ఫెస్టివల్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు. ఏడాది మొత్తంలో దుబాయ్‌ ఎప్పుడైనా వెళ్లి షాపింగ్‌ చేయవచ్చు కానీ.. జనవరిలో ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది.    
- కృపాకర్‌రెడ్డి, దుబాయ్‌ వెళ్లొచ్చిన నగరవాసి
 
లక్కీ కూపన్‌ చాలా విలువైనది
దుబాయ్‌ షాపింగ్‌కు వెళ్లే వారికి చాలా వస్తువులపై డిస్కౌంట్‌ ఇస్తారు. అంతే కాకుండా ప్రతీ షాపింగ్‌కూ లక్కీ డ్రా కూపన్‌ ఇస్తారు. ఎన్ని షాపింగ్‌లు చేస్తే అన్ని కూపన్లు ఇస్తారు. లక్కీ డ్రా అక్కడి ప్రభుత్వమే నిర్వహిస్తుంది. షాపింగ్‌  ఫెస్టివల్‌ ముగిసిన వెంటనే ఈ డ్రా తీస్తారు. చాలా విభాగాలలో బహుమతులు అందజేస్తారు. మనం కూపన్‌లో అడ్రస్‌ ఇస్తే గెలిచిన వారికి దుబాయ్‌ ప్రభుత్వం ఇంటికే బహుమతుల్ని పంపుతుంది. క్యాష్‌ బహుమతులతో పాటు పది కిలో బంగారం కూడా లక్కీ డ్రాలో ఉంటుంది. షాపింగ్‌ ఫెస్టివల్‌కు ఈ నెల మొత్తంలో నగరం నుంచి వేల సంఖ్యలో వెళ్తారు. తాము ఇటీవలే 60 మందిని పంపించాం. 
- దేవర శ్రీనివాస్‌, ఎండీ, లోటస్‌ హ్యాపీ హాలిడేస్‌