దుబాయి యువరాజు ‘అల్లాఉద్దీన్‌’

తీవ్రవాదం, గల్ఫ్‌ యుద్ధం ప్రభావంతో ప్రశ్నార్థకంలో పడిపోయిన దుబాయి ఉనికిని సరికొత్త కోణంలో ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నాడో కుర్రాడు. మాదక ద్రవ్యాలు, మగువలతో విలాసాల్లో మునిగితేలే దుబాయి రాచరిక జీవన చిత్రాన్ని విభిన్న రంగుల్లో ఆవిష్కరిస్తున్న ఆ నవ యువ రాకుమారుడు...‘హమ్‌దాన్‌’. అరేబియా దేశాల కొత్త తరం యువతకు ప్రతీకగా నిలుస్తూ, ప్రిన్స్‌ విలియమ్స్‌, కేట్‌లను మించి మూడున్నర మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్రైబర్లను సొంతం చేసుకున్న ఈ 33 ఏళ్ల ‘క్రౌన్‌ ప్రిన్స్‌’ ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ‘హాటెస్ట్‌ యంగ్‌ రాయల్స్‌’ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు. అతని లైఫ్‌ స్టయిల్‌, అభిరుచులు, దైనందిన కార్యకలాపాలు...అన్నీ ఉత్సుకతను రేకెత్తించేలా ఉంటాయి. 

‘హమ్‌దాన్‌ బిన్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌’...ఇంత పొడవాటి పేరు పలకటానికి ఇబ్బంది పడకూడదనేమో తన కలం పేరు ‘ఫజా’నే పాపులర్‌ చేసుకున్నాడు హమ్‌దాన్‌. తీరిక వేళల్లో కవితలు రాసే ఈ రాకుమారుడికి ప్రకృతన్నా, జంతువులన్నా, బంధువులన్నా మహా ప్రీతి. ప్రయాణాలు, సాహసక్రీడల్ని ఇష్టపడే హమ్‌దాన్‌ సాహసాలు, శక్తిసామరర్ధ్యాలతో కూడుకున్న 160 కిలో మీటర్ల ‘ఎండ్యురెన్స్‌ రైడ్‌’లో 41 దేశాలతో పోటిపడి మొదటి స్థానంలో నిలిచాడు. ఇతని గురించి తెలుసుకోవటానికి ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి... 

క్రౌన్‌ ప్రిన్స్‌ ఆఫ్‌ దుబాయ్‌ 
దుబాయ్‌ రూలర్‌ ‘షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌, షేక్‌ హింద్‌ బింత మక్తూమ్‌ బిన్‌ జుమా అల్‌ మక్తూమ్‌ దంపతుల 13 మంది పిల్లల్లో హమ్‌దాన్‌ ఒకడు. రాజుగారి మొత్తం 23 మంది సంతానంలో హమ్‌దాన్‌ మూడోవాడు. ఇతని అన్న షేక్‌ రషీద్‌ బిన్‌ మొహమ్మద్‌ 2015, సెప్టెంబరులో గుండెపోటుతో చనిపోవటం, పెద్దన్న రషీద్‌కు పాలనాపరమైన అర్హతలు కొరవడటంతో హమ్‌దాన్‌ దుబాయి రాజ సింహాసనాన్ని అదిష్టించబోయే రాకుమారుడయ్యాడు. 

బ్రిటిష్‌ రాజ కుటుంబీకులు చదివిన కాలేజిలోనే... 

దుబాయి ప్రభుత్వ మగపిల్లల పాఠశాలలో ప్రాధమిక విద్యనభ్యసించిన ఫజా తన తండ్రిలాగే ఇంగ్లండ్‌లోని శాండ్‌హర్స్ట్‌ మిలిటరీ అకాడమీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశాడు. తర్వాత లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఎకానమీలో స్పెషలైజ్‌డ్‌ ట్రైనింగ్‌ కోర్సులు పూర్తి చేశాడు. ఉన్నత చదువులు పూర్తి చేసిన హమ్‌దాన్‌ చదువు అవసరం, విలువ గురించి చెబుతూ...‘జీవితానికి విద్య ఎంతో అవసరం...జీవితంలోని ప్రతి అంశంతో విద్య ముడిపడి ఉంటుంది. దుబాయిలో తర్వాత ఇంగ్లండ్‌లో సాగిన నా విద్య ప్రపంచం పట్ల నా దృక్ఫథాన్ని విస్తృతం చేసింది’ అన్నాడు. 

సామాజిక స్పృహ 
2009లో దుబాయి ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌కు ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు హమ్‌దాన్‌. ఇతను దుబాయి స్పోర్ట్స్‌ కౌన్సిల్‌లో మెంబర్‌ కూడా! యువ వ్యాపారవేత్తల షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు, దుబాయి ఆటిజం సెంటర్‌కు ఇతనే హెడ్‌. తన బాధ్యతల్లో భాగంగా స్మార్ట్‌ గవర్నమెంట్‌ ప్రోగ్రామ్‌ అనే కొత్త ఇనిషియేటివ్‌కు శ్రీకారం చుట్టాడు. ఈ ప్రోగ్రామ్‌ ఫలితంగా యుఏఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య దూరం మరింత తగ్గింది. ఇది హమ్‌దాన్‌ సాధించిన రాజకీయ విజయాల్లో చెప్పుకోదగినది. 

అద్భుతమైన ఫొటోగ్రాఫర్‌ 
ఫజాకు ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. 2011లో తన పేరుతోనే స్వయంగా ‘హమ్‌దాన్‌ ఇంటర్నేషనల్‌ ఫొటోగ్రఫీ అవార్డు’ అనే పోటీ కూడా మొదలుపెట్టాడు. ఈ పోటీ ప్రైజ్‌ మనీ ‘లక్షా ఇరవై వేల డాలర్లు’. ఈ పోటీ ఐదు వేర్వేరు కేటగిరీల్లో జరుగుతుంది. దీన్లో తనూ పాల్గొంటూ ఉంటాడు. ఫజా ఫొటో పవర్‌ తెలియాలంటే ఒకసారి అతని ఇన్‌స్టాగ్రామ్‌లోకి తొంగి చూడాలి. 

ఆశ్చర్యపరిచే క్రీడాకారుడు 
41 దేశాలు, 227 మంది రైడర్లు, 160 కిలో మీటర్ల ప్రయాణం...దారి పొడవునా సాహసాలతో నిండిన ఎండ్యురెన్స్‌ రైడ్‌లో పాల్గొని గోల్డ్‌ మెడల్‌ సొంతం చేసుకున్నాడు హమ్‌దాన్‌. బురదలో పాకటం, గోడలు దూకటం, టైర్లు మోయటం, ఎడారి ఇసుకలో పరిగెత్తటం...ఇలా ఒకటేమిటి? రకరకాల కష్టతరమైన హర్డిల్స్‌ దాటుకుని మొదటి స్థానంలో నిలిచి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు హమ్‌దాన్‌. నీటి అడుగున ఊపిరి బిగబట్టి ఉంచగలిగే సామర్ధ్యం ఉన్నవాళ్లే ఎంచుకునే క్రీడ ఫ్రీడైవింగ్‌లో ఇతను సిద్ధహస్తుడు కూడా! స్విమ్మింగ్‌, సైక్లింగ్‌, స్నోబోర్డింగ్‌, రన్నింగ్‌, టెన్నిస్‌...ఇలా చెప్పుకుంటూపోతే హమ్‌దాన్‌ ఆడని ఆటలకు అంతే లేదు. 

చారిత్రక క్రీడ ‘ఫాల్కనీ’కి పూర్వ వైభవం 
ఎమిరేట్స్‌ సంప్రదాయ క్రీడ ‘ఫాల్కనీ’. అంటే...గద్దల్ని పెంచి కుందేళ్లు, ఇతర పక్షుల్ని వేటాడేలా శిక్షణ ఇవ్వటం దుబాయి సంస్కృతిలో కీలక భాగం. అయితే పట్టణీకరణ, ఎడారి నేల తగ్గిపోతుండటంతో ఈ క్రీడ మరుగున పడిపోతుంది. ఇలాగే కొనసాగితే ఈ క్రీడ పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉందని గ్రహించిన హమ్‌దాన్‌ ఫాల్కనీకి పూర్వ వైభవం తెప్పించేందుకు కృషి చేస్తున్నాడు. ఇందుకోసం ప్రతి ఏటా డిసెంబరు నుంచి మే నెల మధ్య కాలంలో యువ ఎమిరేట్స్‌ స్వయంగా పెంచి శిక్షణ ఇచ్చిన గద్దల మధ్య పోటీలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. 

అడ్రినలిన్‌ స్పోర్ట్స్‌ 
సాహస క్రీడల మీద మనసుపడే హమ్‌దాన్‌ వింగ్‌ వాకింగ్‌, ఫ్లై బోర్డింగ్‌, జిప్‌లైనింగ్‌, బుర్జ్‌ ఖలీఫా పైకెక్కి సెల్ఫీ తీసుకోవటం, ఏనుగులతో నీళ్ల అడుగున డైవింగ్‌, గ్లేసియర్ల మీద ట్రెక్కింగ్‌...ఇలా రోమాలు నిక్కబొడుచుకునే క్రీడల్లో పాల్గొనటంతోపాటు, ఒళ్లు గగుర్పొడిచే ఫీట్లు కూడా చేస్తుంటాడు. 

‘ఫజా’ కలం పేరుతో కవితలు 
అరబిక్‌ ప్రాంతీయ భాష ‘నబాటీ’లో ఫజా అనే పేరుతో హమ్‌దాన్‌ కవితలు రాస్తాడు. ఫజా అనేది ఓ అరబ్‌ యోధుడి పేరు. కవితలు రాయటానికి కారణాన్ని ఓ సందర్భంలో హమ్‌దాన్‌ కవితాత్మకంగా ఇలా చెప్పాడు...‘కవితలతో ప్రజల హృదయాలను కొద్ది సేపటివరకైనా సంతోషపెట్టాలని, వాళ్ల బాధలు స్వల్ప కాలంపాటైనా మర్చిపోయేలా చేయాలనేదే నా ప్రయత్నం. నా ప్రజల ఆశలు, ఆశయాలు నా కవితల్లో ప్రతిబింబింపజేస్తాను’. హమ్‌దాన్‌ తన తలిదండ్రులు, అన్నల కోసం కూడా కవితలు రాశాడు. 

ప్రయాణాలంటే పిచ్చి 
ఐరోపా నుంచి అమెరికా, న్యూజిలాండ్‌...హమ్‌దాన్‌ అడుగు పెట్టని దేశం లేదు. ఎక్కడికెళ్లినా ఫొటోలు, స్నాప్‌షాట్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్లకు అప్‌డేట్స్‌ అందిస్తూనే ఉంటాడు. ఈ అప్‌డేట్లకు రెస్పాండ్‌ అయ్యేవారిలో అమ్మాయిలే ఎక్కువ. అరబిక్‌, టర్కిష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, ఇంగ్లీష్‌ భాషల్లో ప్రత్యక్షమయ్యే కామెంట్లను బట్టి హమ్‌దాన్‌కు ఎన్ని దేశాల నుంచి ఎంత ఫిమేల్‌ ఫాలోయింగ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హమ్‌దాన్‌ సెల్యూట్‌ చేసే స్టయిల్‌ కూడా డిఫెరెంట్‌. ఇతనిది త్రీ ఫింగర్‌ సెల్యూట్‌. ఓ సందర్భంలో సెల్యూట్‌ల అర్థాలను వివరిస్తూ పాశ్చాత్య దేశాల్లో వాడే వి షేప్‌లో వేళ్లుంచే విక్టరీ సైన్‌కంటే బొటన వేలు, చూపుడు వేలు, మధ్యవేలుతో సెల్యూట్‌ చేయటం బెటర్‌ అని చెప్పాడు. ఈ మూడు వేళ్లు...విజయం, ఘనత, ప్రేమకు చిహ్నాలని చెప్పుకొచ్చాడు. ‘మన అరబ్బులకు ఓ ఘన చరిత్ర ఉన్నప్పుడు ఇంకొకర్ని అనుసరించాల్సిన అవసరం ఏముంది?’ అని తన సెల్యూట్‌ స్టయిల్‌ గురించి వివరణ కూడా ఇచ్చాడు హమ్‌దాన్‌. 

హమ్‌దాన్‌ పెట్‌ లవర్‌ కూడా! పిల్లి నుంచి పులిదాకా ఇతని దగ్గర ఎన్నో జంతువులున్నాయి. అవేంటంటే... 
- తెల్ల పులి...‘ఎల్సా’. 
- ఏనుగు...‘రాజన్‌’ 
- గుర్రం...‘అవ్‌జాన్‌’. 
- తెల్ల సింహాలు...‘ఘోస్ట్‌, ఫ్లేమ్‌’. 


దుబాయి అనగానే బంగారం, ఖరీదైన కార్లు, ఆకాశాన్నంటే సౌధాలు గుర్తొస్తాయి. ఇవే కాదు. ఇంతకుమించిన వింతలెన్నో ఉన్నాయి ఆ దేశంలో. సాంకేతికంగా ప్రపంచ దేశాలకంటే రెండడుగులు ముందుండటం కోసం ఆ దేశం చేయని ప్రయత్నం లేదు. తమది ధనిక దేశమని ప్రపంచానికి చాటి చెప్పుకోవటానికి వీలున్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోని దుబాయి గురించి ఇంకొన్ని విశేషాలు... 


- దుబాయిలో బంగారం కడ్డీలను ఏటిఎమ్‌ల నుంచి వితడ్రా చేసుకోవచ్చు. 

- దుబాయిలో నేరాలకు చోటు చాలా తక్కువ. అయినా దుబాయి పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూనే ఉంటుంది. నేరస్తుల్ని వెంటాడి పట్టుకోవటం కోసం ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే కార్లను ఉపయోగిస్తోంది. గంటకు 253 మైళ్ల వేగంతో నడిచే ‘బుగాటి వేరాన్‌’ కార్లను అక్కడి పోలీసులు వాడతారు. ఈ కారు 2.5 సెకండ్లలో 0 నుంచి 60 మైళ్ల వేగాన్ని అందుకోగలదు. అత్యంత వేగంగా నడిచే పోలీస్‌ కారుగా ఇది గిన్నిస్‌ బుక్‌లోకి కూడా ఎక్కేసింది. 

- భవంతులు, ఇళ్లు, ఆఫీసులు, షాపింగ్‌ మాల్స్‌...ఇలా ఒకటేమిటి? దుబాయి అంతటా ఏసీనే! ఆఖరుకు ప్రజల సౌకర్యార్ధం బస్‌లతోపాటు, బస్‌ స్టాప్‌లను కూడా ఏసీ చేసేశారక్కడ. 
- దుబాయి బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి. 2013 ఒక్క సంవత్సరంలోనే ప్రపంచం మొత్తం బంగారంలో 40ు దుబాయిలోనే ట్రేడ్‌ అయింది. ఈ బంగారం మొత్తం 354 ఏనుగులకు మించిన బరువుంది. 
- బుర్జ్‌ ఖలీఫా ఎంత ఎత్తు ఉంటుందంటే దాన్లో ఉండే కొన్ని కుటుంబాలు నమాజ్‌ ఉపవాసాన్ని విరమించటం కోసం మిగతా ఫ్లోర్లలో వాళ్లకంటే ఇంకొంత ఎక్కువ సమయం ఆగాల్సి ఉంటుందట. ఎందుకంటే 80 నుంచి ఆ పై అంతస్తుల్లో ఉండే వాళ్లకు ఆలస్యంగా పొద్దు కుంగుతుంది. 
- దుబాయిలో ఒంటెల పరుగు పందేలు జరుగుతూ ఉంటాయి. ఈ మల్టీ మిలియన్‌ డాలర్‌ ఒంటెల పోటీల్లో ఒంటెల్ని పరిగెత్తించేది మనుషులు కాదు....‘రోబో’లు. 
- దాబాయి ఎకానమీలో ఇంధనం వాటా కేవలం 6 శాతమే! ప్రాంతీయంగా ఎకానమీ మొత్తం రియల్‌ ఎస్టేట్‌, టూరిజం నుంచే సమకూరుతుంది. 
- దుబాయి షాపింగ్‌ మాల్‌ ప్రపంచం మొత్తంలోనే అతి పెద్ద షాపింగ్‌ సెంటర్‌. దీన్లో మొత్తం 1200 షాపులున్నాయి. 
- దుబాయి షేక్‌లకు అడవి జంతువులే పెంపుడు జంతువులు. చిరుతలు, తెల్ల పులులు, సింహాలను ఇక్కడ పెంచుకుంటూ ఉంటారు. 
- 2009లో దుబాయిలో ఓ అతి పెద్ద మెట్రో స్టేషన్‌ను ప్రారంభించారు. 42 స్టేషన్లుండే ఈ మెట్రో స్టేషన్‌ను కేవలం 18 నెలల్లో కట్టేశారు. 
గోగుమళ్ల కవిత