రష్యాలో కార్నర్‌ సీట్లో కూర్చోవద్దు

సామ్యవాదానికి పుట్టినిల్లు.. పరిమాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశం రష్యా! ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఆ దేశం వెళ్లినప్పుడు పర్యాటకులు గమనించాల్సిన విషయాలేమిటో చూద్దాం..
 
మర్యాదలు ముఖ్యం
రష్యన్లు సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. పర్యాటకులు సహా అందరూ వాటిని పాటించాలని కోరుకుంటారు. ఉదాహరణకు రష్యా చలి దేశం. అయినా, ఇతరులకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చే సమయంలో గ్లోవ్స్‌ తీస్తారు. గ్లోవ్స్‌ తీయకపోతే అవమానంగా భావిస్తారు. ఇదే విధంగా ఎవరినైనా బయటకు తీసుకువెళ్తే ఆహ్వానించినవారే హోటల్‌ బిల్లును కట్టాలి. లేకపోతే తమ మర్యాదకు భంగం కలిగినట్లు భావిస్తారు. వీటన్నింటితో పాటుగా రష్యన్లు ఇతరులతో ఎక్కువ మాట్లాడరు.
 
ఎక్కువ నవ్వరు. పర్యాటకులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. బస్సుల క్యూలలోను.. ఇతర ప్రాంతాలలోను వృద్ధులకు ప్రాధాన్యమివ్వాలి. వారికి సాయం చేయాలి. చాలా మంది రష్యన్లు తమ ఇళ్లను మంచి మంచి కార్పెట్లతో అలంకరించుకుంటారు. అందువల్ల ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు మనం ధరించిన బూట్లను వదిలి లోపలికి వెళ్లాలి. పార్టీలకు వెళ్లినప్పుడు కొందరు తాము ఇళ్లలో వేసుకొనే చెప్పులను పట్టుకువెళ్లి.. పార్టీ ఇస్తున్న వారి ఇంట్లో వేసుకుంటారు. అతిథుల కోసం చాలా మంది ప్రత్యేకంగా చెప్పులను ఉంచుతారు. ఇది కొన్ని శతాబ్దాల నుంచి వస్తున్న ఆచారం.
 
హోటల్‌కు వెళ్తే..
రష్యాలో రెస్టారెంట్‌లలో ఎవరూ కార్నర్‌ సీట్లలో కూర్చో రు. చిన్న రెస్టారెంట్‌ అయినా.. పెద్ద రెస్టారెంట్‌ అయినా కార్నర్‌ సీట్లు ఖాళీగానే కనిపిస్తాయి. కార్నర్‌ సీట్లలో కూర్చుంటే ప్రేమించినవారు దూరమవుతారని రష్యన్లు నమ్ముతారు. అందుకే కార్నర్‌ సీట్లలో కూర్చోవటానికి ఇష్టపడరు.
 
- స్పెషల్‌ డెస్క్‌