తైవాన్‌లో కరచాలనం వద్దు!

చైనాకు తూర్పు దిక్కులో ఉన్న ఒక చిన్న ద్వీపం తైవాన్‌. ఇటీవల కాలంలో ఆసియాలో ఎక్కువ మంది యాత్రికులు పర్యటిస్తున్న దేశం. తనదైన విభిన్న సంస్కృతి, సంప్రదాయాలతో పర్యాటకులను అలరించే ఈ ద్వీపానికి వెళ్లినప్పుడు పాటించాల్సిన పద్ధతులేమిటో తెలుసుకుందాం..

తైవాన్‌లో ఎవరి ఇంటికి వెళ్లినా ముందు అడిగే మాట ‘భోజనం చేశారా?’ అని. మన సమాధానం ఏదైనాగానీ.. తినడానికి వారు తప్పనిసరిగా ఏదో ఒకటి పెడతారు. తినకపోతే బాధపడతారు. అందువల్ల తైవాన్‌లో ఎవరైనా ఇంటికి వెళ్లే ముందు తినకుండా ఉంటే మంచిది. తినేటప్పుడు చాప్‌స్టిక్స్‌ను అన్నంలో కానీ నూడిల్స్‌లో కాని గుచ్చకూడదు. వాటిని బౌల్‌పైనే పెట్టాలి. తినేటప్పుడు మెతుకులు కింద (టేబుల్‌పై) పడేస్తే అమర్యాదగా భావిస్తారు. 

ఇదో రకం పలకరింపు..
కొన్ని దేశాల్లో కౌగలించుకోవటాన్ని పలకరింపుగా భావిస్తారు. కొన్ని దేశాల్లో షేక్‌హ్యాండ్‌ను పలకరింపుగా భావిస్తారు. తైవాన్‌లో మాత్రం తలను పంకించటాన్ని పలకరింపుగా భావిస్తారు. తెలియని వారికి షేక్‌హ్యాండ్‌ ఇవ్వటాన్ని అమర్యాదగా భావిస్తారు. అందువల్ల తైవాన్‌లో షేక్‌హ్యాండ్‌లను ఇవ్వకుండా ఉంటే మంచిది.

క్యూలుంటాయి.. 

తైవాన్‌లో ప్రజలు చాలా క్రమశిక్షణగా ఉంటారు. మార్కెట్లలో, సూపర్‌బజార్లలో, మాల్స్‌లో.. ఇలా ఎక్కడ చూసినా క్యూలు కనిపిస్తూ ఉంటాయి. క్యూని దాటుకొని ముందుకు వెళ్లటాన్ని వారు అమర్యాదగా భావిస్తారు. సాధారణంగా తైవాన్‌ ప్రజలు పర్యాటకులకు చాలా మర్యాద ఇస్తారు. అందునా చైనా భాష మాట్లాడే వారంటే మరింత గౌరవంగా చూస్తారు. అందువల్ల తైవాన్‌కు వెళ్లే ముందు నాలుగైదు చైనా పదాలను నేర్చుకొని వెళ్తే మంచిది.