యూరోపియన్లతో పోలిస్తే భారతీయులకు బాధ్యత ఎక్కువ

బృందాల్లో పనిచేయడానికి ఎక్కువ ఇష్టపడతారు

సంఘ జీవనంపై కింగ్స్‌ కాలేజ్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి

(లండన్‌ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి సి.వి.ఎల్‌.ఎన్‌. ప్రసాద్‌): పర్యావరణం, జన్యుపరమైన అంశాలు వివిధ ప్రాంతాలకు చెందినవారి మెదళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఈ విషయంలో భారతీయులకు, యూరోపియన్లకు మధ్య ఉన్న తేడా ఏమిటి? అనే విషయాన్ని తెలుసుకోవడానికి లండన్‌లోని కింగ్స్‌ కాలేజీకి చెందిన ప్రొఫెసర్‌ గుంటర్‌ షుమెన్‌ బెంగళూరులోని నిమ్‌హాన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలతో కలిసి అధ్యయనం చేస్తున్నారు. ‘కన్సార్షియం ఆన్‌ వల్నరబిలిటీ టు ఎక్స్‌టర్నలైజింగ్‌ డిజార్డర్స్‌ అండ్‌ అడిక్షన్స్‌’ పేరిట దాదాపు 10 వేల మందిపై చేస్తున్న ఈ అధ్యయనం ఈ తరహా అధ్యయనాల్లో పెద్దదని చెప్పవచ్చు.
 
దీనికి భారత్‌కు చెందిన ఐసీఎంఆర్‌-బ్రిటన్‌ ప్రభుత్వాలు సంయుక్తంగా నిధులు అందిస్తున్నాయి. ఈ మొత్తం పరిశోధనకు రూ.10 కోట్లు కేటాయించాయి. కింగ్స్‌ కాలేజీలో ప్రొఫెసర్‌ గుంటర్‌ను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి కలిసినప్పుడు అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
 
‘‘యూర్‌పలోని ప్రజలు తినే ఆహారం.. వారు నివసించే వాతావరణం.. వారు పాటించే విలువలు.. ఇలా రకరకాల అంశాలు భారత ప్రజలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. వీటన్నింటి ప్రభావం మన మెదడుపై ఎలా ఉంటుంది? అది మన ప్రవర్తనను ఎలా నియంత్రిస్తుంది? అనే విషయాలను తెలుసుకోవటానికి- భారత్‌, బ్రిటన్‌లకు చెందిన 10వేల మందిని ఎంపిక చేసి వారిపై అధ్యయనం చేస్తున్నాం’’ అని ప్రొఫెసర్‌ గుంటర్‌ వెల్లడించారు. భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు.. బ్రిటన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఈ పదివేల మందికి సంబంధించిన ఆరోగ్య సమాచారంతో పాటు వారి జీవితానికి సంబంధించిన అన్ని వివరాలనూ సేకరించి.. విశ్లేషించడం మొదలుపెట్టారు.
 
భారతీయులకు బాధ్యత ఎక్కువ
‘యూరప్‌ దేశాల్లో కన్నా భారత్‌లో ఉన్న వ్యక్తులు సమాజం పట్ల ఎక్కువ బాధ్యతగా ఉంటారు. బృందాలలో పనిచేయటానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ రెండు అంశాలూ మా ప్రాథమిక అధ్యయనంలో తేలాయి. మేము ఈ అంశాలను ప్రతిపాదించే ముందు- రెండు సమూహాలకు సంబంధించిన బ్రెయిన్‌ స్కాన్‌ల దగ్గర నుంచి వారి ఆరోగ్య రికార్డుల దాకా అన్నింటినీ పరిశీలించాం. వారికి మానసిక పరీక్షలు నిర్వహించాం. వీటన్నింటి ఆధారంగానే ఈ అభిప్రాయానికి వచ్చాం. ఈ విధంగా అనేక అంశాలపై అధ్యయనాలు చేయాల్సి ఉంది’ అని గుంటర్‌ వివరించారు.
 
వీరి అధ్యయనానికి నిమ్‌హాన్స్‌కు చెందిన ప్రొఫెసర్‌ వివేక్‌ కూడా సహకరిస్తున్నారు. ‘‘భారత్‌లోని మణిపూర్‌లో మత్తుమందులకు బానిసయ్యేవారి సంఖ్య ఎక్కువ. దీనికి సామాజికపరమైన కారణాలు మాత్రమే ఉన్నాయా? వారికి జన్యుపరంగా మత్తుమందులకు ఆకర్షితులయ్యే స్వభావముందా? ఒక వేళ ఆకర్షితులయితే వారి మెదడుల్లో ఎలాంటి మార్పులు వస్తాయి? మొదలైన అంశాలన్నీ మా అధ్యయనంలో తేలతాయి.’’ అని గుంటర్‌ వివరించారు.