భారత యాత్రీకుల ఖర్చు భేష్‌!

గత ఏడాది 68 లక్షల డాలర్లు..

ఇకపై నేరుగా విమానసర్వీసులు
డెస్టినేషన్‌ డీసీ సీఈఓ ఫెర్గ్యుసన్‌

వాషింగ్టన్‌ డీసీ అనగానే వైట్‌హౌస్‌.. అమెరికా సెనేట్‌ భవనాలు గుర్తుకొస్తాయి. అమెరికా రాజకీయాలకు మూల బిందువు అయిన వాషింగ్టన్‌ డీసీ ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి  చేయటానికి అక్కడి వ్యాపారవేత్తలు కొందరు డిస్టినేషన్‌ డీసీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఇటీవల ఎయిర్‌ఇండియా ఢిల్లీ నుంచి వాషింగ్టన్‌ డీసీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించిన నేపథ్యంలో ఆ సంస్థ సీఈఓ ఎలియట్‌ ఎల్‌ ఫెర్గ్యుసన్‌ హైదరాబాద్‌ వచ్చారు. ఆయనను ఆంధ్రజ్యోతి పలకరించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలను వివరించారు. 

ప్రశ్న: వాషింగ్టన్‌ అనగానే అమెరికా రాజకీయాలు గుర్తుకొస్తాయి. ఈ ముద్రను చెరిపివేయటం సాధ్యమా?

జవాబు: సాధ్యం కాదు. కానీ ప్రయత్నించాలి.  వాషింగ్టన్‌ డీసీ  జనాభా దాదాపు ఏడు  లక్షలు. అమెరికాలో చిన్న రాష్ట్రాల్లో ఇది ఒకటి. అమెరికాకు వచ్చిన పర్యాటకులు తప్పనిసరిగా వచ్చే ప్రదేశాల్లో డీసీ  కూడా ఒకటి. ముఖ్యంగా భారతీయులు డీసీ  వస్తూ ఉంటారు. ఇక్కడ వైట్‌ హౌస్‌తో పాటుగా చూడటానికి అనేక ప్రదేశాలున్నాయి. మ్యూజియంలు.. ఎమ్యూజిమెంట్‌ పార్క్‌లు.. గార్డెన్లు.. ఇలా అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. అయితే ఇవి ఎక్కువ మందికి తెలియవు. అందరూ డీసీ  అనగానే వైట్‌హౌస్‌ అనుకుంటారు. ఈ అభిప్రాయాన్ని మార్చటానికి మేము ప్రయత్నిస్తున్నాం. 

ప్రశ్న: ప్రతి ఏడాది ఎంత మంది భారతీయ పర్యాటకులు వస్తారు? వారెంత ఖర్చు పెడతారు?

జవాబు: 2016లో డీసీని  దాదాపు లక్ష మంది భారతీయులు సందర్శించారు. వీరు 68 లక్షల డాలర్ల వరకూ ఖర్చు పెట్టినట్లు మా అంచనా. మాకు సంబంధించినంత వరకూ భారత్‌ చాలా పెద్ద మార్కెట్‌. భారత్‌ నుంచి వచ్చే పర్యాటకులు బాగా ఖర్చు పెడతారు కూడా. అందుకే భారత్‌పై ప్రత్యేకంగా దృష్టి  సారిస్తున్నాం. 

ప్రశ్న: చాలా మందిలో అమెరికా వీసాలు లభించటం చాలా కష్టమనే భావన ఉంది కదా.. అటువంటప్పుడు పర్యాటకులు ఎలా పెరుగుతారు?

జవాబు: ఇలాంటి అభిప్రాయం ఉందని మాకు తెలుసు. కానీ మిగిలిన దేశాలతో పోల్చుకుంటే అమెరికా వీసా పొందటం సులభమే! ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. నేను కానీ మీరు కానీ ఏదైనా దేశం వెళ్లారనుకుందాం. అక్కడ అన్ని ప్రదేశాలు చూసి.. క్షేమంగా తిరిగి రావాలనుకుంటారు. ఎక్కువ మంది పర్యాటకులు వచ్చే ప్రదేశాలలో భద్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. అమెరికాకు వెళ్లే ప్రతి పర్యాటకుడికి తగిన భద్రత కల్పించటం మా కర్తవ్యం. అందువల్ల ఎక్కువ పత్రాలు అడుగుతూ ఉండవచ్చు. కానీ ఈ చెక్‌లన్నీ ప్రయాణీకుల భద్రత కోసమే! వారిని భయభ్రాంతులు చేయటానికి కాదు..

ప్రశ్న: భారత్‌ నుంచి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించటానికి మీరు ఎలాంటి వ్యూహాన్ని అవలంభించాలనుకుంటున్నారు? 
జవాబు: మొదటగా ఎయిర్‌ఇండియాతో మాట్లాడుతున్నాం. ఢీల్లీ నుంచి డీసీకి నేరుగా విమాన సర్వీసులను ప్రారంభమయ్యాయి. అందువల్ల ప్రయాణీకులు ఇకపై నేరుగా డీసీకే రావచ్చు. చాలా మందికి తెలియని విషయమేమిటంటే- డీసీకి న్యూయార్క్‌ నుంచి నేరుగా ట్రైన్‌ సర్వీలున్నాయి. వీటిని ఎక్కితే రెండున్నర గంటల్లో డీసీకి చేరిపోవచ్చు. దీనితో పాటుగా నేరుగా వచ్చే పర్యాటకుల బడ్జెట్‌కు తగిన వసతి సౌకర్యాలు కూడా ఇక్కడ లభిస్తాయి. ఈ విషయాలన్నీ విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నాం. భారతీయ పర్యాటకులు- కేవలం ఆసియాలో దేశాలకు మాత్రమే పరిమితం కాకుండా మా దగ్గరకు కూడా రావాలనేది మా కోరిక. దీనికి అనుగుణంగా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం.