Crown-prince-Mohammad-bin-Salman-creates-new-history-in-Saudi-Arabia

చరిత్రాత్మక మార్పుల దిశగా సౌదీ.. యువరాజు సల్మాన్ సంచలన నిర్ణయాలు

‘విధ్వంసకరమైన ఆలోచనలతో మరో ముప్పై ఏళ్లు జీవితాల్ని వృథా చేసుకోవద్దు. వాటిని ఈరోజే తునాతునకలు చేసేద్దాం. మార్పు వైపుగా ప్రయాణిద్దాం’... ఇదీ సౌదీ యువరాజు  మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ప్రకటన.. నాలుగు వేల మంది ముందు, అదీ సౌదీ నడిబొడ్డున ఇలాంటి ప్రకటన చేయడానికి ఎన్ని గుండెలు కావాలి? ఎంత ధైర్యం ఉండాలి? క్షణాల్లో ఈ వార్త పాకిపోయింది. అప్పుడే, ప్రపంచమంతా అతడి గురించి తెలుసుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు సౌదీలో మహిళలు... కార్లు నడుపుతున్నారు, స్టేడియంలో కూర్చుని ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు వీక్షిస్తున్నారు, సినిమాలకు వెళ్తున్నారు, సెల్ఫీలు దిగుతున్నారు. ఇవన్నీ మనకు సాధారణమే కావచ్చు. సౌదీ అరేబియాలో మాత్రం, నిన్నటిదాకా ఊహకు కూడా అందని విషయాలు. ఈ మార్పులకు కారణం... సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌.

మిస్టర్‌ ఎవ్రీథింగ్‌
ఎంబీఎస్‌గా ప్రసిద్ధుడైన మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ సౌదీ అరేబియా ఉప ప్రధాని, రక్షణమంత్రి, దేశంలోని అతిపెద్ద చమురు కంపెనీకి అధినేత, యువరాజు, పట్టాభిషేకానికి ఆమడదూరంలో ఉన్నవాడు. కాబట్టే, బిన్‌ సల్మాన్‌కు ‘మిస్టర్‌ ఎవ్రీథింగ్‌’ అని నామకరణం చేశారు విదేశీ పాత్రికేయులు. 1985 ఆగస్టు 31న బిన్‌ సల్మాన్‌ పుట్టాడు. రాజు మహమ్మద్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌ మూడో భార్యకి తను పెద్ద కొడుకు. 2015లో తండ్రి రాజయ్యేంత వరకూ సౌదీ వెలుపల బిన్‌ సల్మాన్‌ పేరు ఎవరికీ తెలియదు. కానీ ఈ మూడేళ్లలో... అంతా తానే అయ్యాడు. 
 
చక్కటి రూపంతో ఇట్టే ఆకర్షించే బిన్‌ సల్మాన్‌ బాలమేధావి. చదువుల్లో ఎప్పుడూ ముందుండేవాడు. రాజధాని రియాద్‌లో న్యాయశాస్త్రంలో పట్టాపొందాడు. యూనివర్సిటీలో ఉన్నన్ని రోజులూ అనేక శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. లోకజ్ఞానం సంపాదించుకున్నాడు. 

అమ్మానాన్నలు...
యువరాజు మేధోవికాసానికి కారణం అతడి అమ్మానాన్నలే. నాన్నగారు... ప్రతి వారమూ పిల్లల చేతికి ఓ పుస్తకమిచ్చి... చదవమనేవారు. ఆతర్వాత, ఆయా పుస్తకాలకు సంబంధించి ప్రశ్నలు అడిగేవారు. అమ్మ అయితే, వారంలో ఓరోజు వివిధ రంగాల మేధావులను ఇంటికి పిలిపించి, పిల్లలతో ఇష్టాగోష్టి ఏర్పాటు చేసేది. దీంతో బిన్‌ సల్మాన్‌ వ్యక్తిత్వ నిర్మాణానికి బాల్యంలోనే బలమైన పునాదులు పడ్డాయి.
 
పట్టా చేతికి రాగానే, మిగతా సంపన్న కుటుంబీకుల పిల్లల్లా విదేశాలకు వెళ్లిపోదామని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే తండ్రి పాలన బాధ్యతలు చేపట్టాడు. తనకు తోడుగా ఉండమన్నాడు. బిన్‌ సల్మాన్‌ ఎదుగుదల 2013 నుంచీ మొదలైంది. నాన్న ‘యువరాజు’ కాగానే, ఆయన కొలువులో మంత్రిగా చేరాడు. ఆ అనుభవం బాగా పనికొచ్చింది. కొడుకు మీద తండ్రికి నమ్మకాన్నీ పెంచింది. తాను రాజు కాగానే, సల్మాన్‌ను రక్షణమంత్రిగా, దివంగతుడైన రాజు తనయుడు మహమ్మద్‌ బిన్‌ నయెఫ్‌ను డిప్యూటీ క్రౌన్‌ప్రిన్స్‌గా ప్రకటించాడు. ఆతర్వాత, కొద్ది నెలలకే నయెఫ్‌ను యువరాజుగా నియమించాడు. బిన్‌ సల్మాన్‌ను డిప్యూటీ యువరాజుగా, డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్‌గా, కౌన్సిల్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎఫైర్స్‌కు అధ్యక్షుడిగా నియమించాడు. బిన్‌ సల్మాన్‌ను అందలం ఎక్కించడానికి రంగం సిద్ధమైనట్టు అప్పటికే అందరికీ అర్థమైపోయింది. 2017జూన్‌లో బిన్‌ సల్మాన్‌ని యువరాజుగా ప్రకటించి, నయెఫ్‌ను పదవిలోంచి తొలగించాడు. గృహనిర్బంధంలో ఉంచాడు. ఓవైపు వారసత్వానికి సంబంధించి... చాపకింద నీరులా చకచకా మార్పులు జరిగిపోతుంటే, మరోవైపు సౌదీ ఆర్థికరంగాన్నీ సామాజిక వ్యవస్థనూ ప్రక్షాళన చేసే కార్యక్రమం మొదలుపెట్టాడు బిన్‌ సల్మాన్‌.
 
కుటుంబ బాధ్యత ఆమెదే!
అధికారిక హోదాలో అమెరికాలో  పర్యటించాడు బిన్‌ సల్మాన్‌. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు  గూగుల్‌, ఆపిల్‌ లాంటి పెద్దపెద్ద కంపెనీల సీయీవోలనూ కలిశాడు. హాలీవుడ్‌ ప్రముఖులతోనూ సమావేశాలు జరిపాడు. ఈమధ్యే పారిశ్రామిక దిగ్గజం ‘సీమన్స్‌’ కంపెనీ మాజీ సీఈఓ క్లీన్‌ఫెల్డ్‌ను సలహాదారుగా నియమించుకున్నాడు. 
అనుకున్నది సాధించే దిశగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. 2008లో రాకుమారి సారా బింట్‌ మషూర్‌ను పెళ్లిచేసుకున్నాడు బిన్‌ సల్మాన్‌. వీరికి నలుగురు పిల్లలు. ‘ఇల్లు, పిల్లల బాధ్యత శ్రీమతిదే, పిల్లల ఆలనా పాలనా చూసేందుకు సమయం దొరకడం లేదని చెబుతూ... తన జీవితంలో బహుభార్యత్వానికి ఆస్కారం లేదని’ ఓ ఇంటర్య్వూలో తేల్చిచెప్పారు. బిన్‌ సల్మాన్‌లో సేవాదృక్పథమూ ఎక్కువే. ఎంఐఎస్‌కె ఫౌండేషన్‌ను స్థాపించి యువతలో నైపుణ్యాల్నీ, నాయకత్వ లక్షణాలనూ పెంపొందించే ప్రయత్నం చేస్తున్నాడు. స్టార్టప్‌ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాడు. 
 
తాత పోలికే!
మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ శక్తిసామర్థ్యాల్ని చూస్తుంటే... అతడి తాత, నేటి సౌదీ అరేబియా నిర్మాత  గుర్తుకువస్తారు. 1902లో అంతర్యుద్ధం మొదలయ్యేనాటికి సీనియర్‌ అల్‌ సౌద్‌ వయసు ఇరవై ఏడేళ్లే. మూడు దశాబ్దాలకు పైగా సాగిన ఆ యుద్ధంలో విజయం సాధించి, అనేక తెగలను సంఘటిత పరిచాడు. 1932లో సౌదీ రాజ్యాన్ని స్థాపించాడు. అంతకు ముందు, రెండు చిన్న సామ్రాజ్యాలను పరిపాలించిన అనుభవం ఆయనకు ఉంది. కానీ, అవి ఎక్కువ కాలం మనలేదు. అయితేనేం, ఆ అనుభవం ఊరికే పోలేదు. 
 
1953లో అల్‌ సౌద్‌ మరణించిన తర్వాత.. ఆయన కొడుకులు ఆరుమందీ సౌదీ అరేబియాను  పరిపాలిస్తూ వస్తున్నారు. ప్రస్తుత పాలకుడి వయసు 81 ఏళ్లు. ఆయన తరవాత రాజయ్యే అవకాశం బిన్‌ సల్మాన్‌కే ఉంది. అదే  కనుక నిజమైతే, ఓ అర్దశతాబ్ది పాటు ఏకధాటిగా  పరిపాలించే అవకాశం లభిస్తుంది. 
 
చమురును వదిలేద్దాం...

బిన్‌ సల్మాన్‌ ‘విజన్‌ 2030’ పేరిట సమగ్ర ప్రణాళికను ప్రకటించాడు. సౌదీ అంటే చమురు, చమురు అంటే సౌదీ అన్న ముద్రపడిపోయింది. దేశానికి తొంభైశాతం రాబడి చమురు నుంచే వస్తోంది. ముడి చమురు ఆదాయమనే ఆలోచన నుంచి దేశాన్నీ ప్రజల్నీ పక్కకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించాడు బిన్‌ సల్మాన్‌. మూడు ట్రిలియన్‌ డాలర్లతో ‘అత్యధిక సావరీన్‌ వెల్త్‌ ఫండ్‌’ను నెలకొల్పే పనిలో నిమగ్నమయ్యాడు.

పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకురావడం, మహిళలు ఉద్యోగాల్లో చేరేలా ప్రోత్సహించడం, ఐటీ, వినోద రంగాలలో పెట్టుబడులు... యువరాజు ప్రణాళికలో ముఖ్యాంశాలు. సౌదీ అరేబియా ఆధునికీకరణకూ పెద్దపీట వేశాడు. 500 బిలియన్‌ డాలర్లతో... కొత్త నగరాన్ని నిర్మించడం, ప్రత్యేక బిజినెస్‌ జోన్‌ ఏర్పాటు చేయడం... బిన్‌ సల్మాన్‌ ప్రధాన లక్ష్యాలు. అదే సమయంలో అవినీతి నిర్మూలనకు ప్రాధాన్యం ఇచ్చాడు. ‘యాంటీ కరప్షన్‌ డ్రైవ్‌’లో భాగంగా పదకొండు మంది రాకుమారుల్ని, నలుగురు మంత్రుల్ని, డజన్ల కొద్దీ వ్యాపారవేత్తల్ని అరెస్టు చేయించాడు. వీరిలో బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ స్నేహితుడు కూడా ఉండడం విశేషం. మహామహా కుబేరులూ ఉన్నారు. అవినీతి వ్యతిరేకత ముసుగులో... తనకు అడ్డు చెప్పే అవకాశం ఉన్నవారినంతా... ఊచల వెనక్కి తోసేస్తున్నాడన్న విమర్శా ఉంది.

ఒకవైపు మానవ హక్కుల్ని కాలరాస్తూనే... మరోవైపు స్త్రీ స్వేచ్ఛా, ఉద్యోగాలూ అని చిలకపలుకులు వల్లిస్తున్నాడని దుమ్మెత్తిపోస్తున్నవారూ లేకపోలేదు. ఆ మాటలు సత్యాలో అర్ధసత్యాలో కావచ్చు. కానీ, ఒకటి మాత్రం వాస్తవం... సౌదీ మహిళలు గతంతో పోలిస్తే ఎంతోకొంత స్వేచ్ఛగానే ఉన్నారు. సమాజంలో సగమైన మహిళల ప్రోత్సాహం లేనిదే... దేశం ఆర్థికంగా ముందడుగు వేయలేదని ఆ యువకుడికి తెలుసు. దీనికి తగ్గట్టుగానే అతడి నిర్ణయాలూ ఉంటున్నాయి. సౌదీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఛైర్‌పర్సన్‌గా ఓ మహిళను నియమించారు. ఓ ప్రధాన బ్యాంకు పగ్గాలనూ మగువకే అందించారు. కొత్తగా ఏర్పాటు చేసిన జనరల్‌ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ అఽథారిటీ నాయకత్వమూ నారీమణిదే.
మొన్న రంజాన్‌ మాసం తర్వాత... అంటే, జూన్‌ 24 అర్ధరాత్రి సమయంలో మహిళలకు అపూర్వమైన బహుమతిని అందించింది సౌదీ ప్రభుత్వం. కల్లో కూడా ఊహించని వరమది. సొంత కార్లను స్వయంగా నడిపే అవకాశమది. 
 
స్టీరింగ్‌ తిప్పుతూ... ‘థాంక్‌ గాడ్‌. సౌదీ ఇరవై ఒకటో శతాబ్దంలోకి ఎంటరైంది’ అంటూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్న సౌదీ మహిళల వీడియోలు ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి. మొట్టమొదటిసారిగా మహిళలు స్టేడియంలో కూర్చుని.. మ్యాచ్‌ను వీక్షించేందుకూ థియేటర్లలో కూర్చుని సినిమాలు చూసేందుకూ, బహిరంగంగా సంగీత కచేరీలను అస్వాదించేందుకూ అనుమతి ఇచ్చారు. మిలిటరీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేలా నియమావళిని సవరించారు. ఛాందసవాదులు ఆ మార్పును జీర్ణించుకోలేక పోతున్నారు. రాచ కుటుంబంలోనూ కొన్ని వర్గాలు పళ్లు నూరుతున్నాయి. గత ఏప్రిల్‌లో బిన్‌ సల్మాన్‌ హత్యకు గురైనట్టుగా వార్తలొచ్చాయి. దానికి తగినట్టు ఓ నెలరోజులు కన్పించకుండా పోయాడు కూడా. తండ్రి ఉన్నంత వరకూ ఆ యువరాజుకు ఎలాంటి ఢోకా లేదు. మరి, ఆ తర్వాత? కాలమే నిర్ణయించాలి. ఆ కాలాన్నీ ఎదిరించే శక్తిని సొంతం చేసుకుంటే, బిన్‌ సల్మాన్‌కు కొన్ని దశాబ్దాల పాటు ఎదురే ఉండదు.