వై దిస్‌ కులవెర్రి...

అమెరికాలోనూ కాటేస్తున్న కులం

దళితులపై ఆగని వివక్ష- భౌతిక దాడులు, హేళన, జోకులు
ఆలయ ప్రవేశంలోనూ ఇబ్బందులు
పెళ్లిళ్లకూ అడ్డంకులు.. ప్రత్యేక సర్వే తేల్చిన నిజం

వాషింగ్టన్: రక్తంలో కులం లేదు.. పుట్టుక, చావుల్లో కులం లేదు. జీవికలో కులం లేదు.. మరి జీవితంలో మాత్రం ఎందుకు? .... ఈ ప్రశ్న చాలా ఏళ్లుగా చాలా మంది సంస్కరణవాదుల నుంచి మామూలు వ్యక్తుల దాకా వస్తూనే ఉంది. కానీ మన సమాజంలో కుల జాడ్యం మాత్రం పోవడం లేదు. దారుణమైన విషయమేంటంటే.. అభివృద్ధి చెందిన సమాజాల్లో నివసిస్తున్నా- భారతీయులు కులం కొమ్మల్ని పట్టుకొని వేలాడుతూనే ఉన్నారు. అమెరికాలో ఇది ఇప్పటికీ ప్రబలంగా ఉన్నట్లు -ఈక్వాలిటీ లాబ్స్‌ అనే సంస్థ చేసిన ఓ తాజా సర్వే తేల్చింది. అమెరికాలోని దక్షిణాసియా సంస్థల్లోని ఉద్యోగులు, విద్యార్థులు- ముఖ్యంగా దళితులు వివక్ష ఎదుర్కొంటున్నట్లు ఆ సర్వే చెబుతోంది. 1500 మంది దక్షిణాసియా జాతీయత ఉన్నవారిని ప్రశ్నించినపుడు కులం వారినెంతగా కాటేస్తోందో, కుల వివక్ష వల్ల తామెంత నష్టపోతున్నామో వారు వివరించారు. సర్వేను 2016లో చేసి- నివేదికను గురువారం నాడు విడుదల చేశారు.
 

‘‘అమెరికన్‌ భారతీయుల్లో కుల వివక్ష ఎప్పటి నుంచో ఉంది. దళిత అమెరికన్లుగా పెరిగిన మేం చాలా ఏళ్లుగా ఈ బాధ అనుభవిస్తున్నాం. అయితే సరైన డేటా లేకపోవడం, అనాసక్తి వల్ల సవర్ణ మేధావులెవరూ దీనిపై దృష్టిపెట్టలేదు. అందువల్ల దీనిపై అధ్యయనం జరగలేదు’’ అని ఈక్వాలిటీ ల్యాబ్స్‌ సహవ్యవస్థాపకుడు థెనిమొళి సౌందరరాజన్‌ చెప్పారు. ఈ సర్వే ప్రకారం - 1500 మందిలో 26 శాతం మంది దళితులు హింసను, భౌతిక దాడులను ఎదుర్కొన్నట్లు చెప్పారు. పనిచేస్తున్న ప్రదేశాల్లో వివక్షకు గురైనట్లు, నైపుణ్యం, ప్రావీణ్యం ఉన్నా తమను వెనక్కి నెట్టేసినట్లు మరో 20 శాతం మంది దళితులు వెల్లడించారు. ఇక మత విషయకంగా చూస్తే- 40 శాతం మంది దళితులకు ప్రార్థనాస్థలాల్లో ప్రవేశమే గగనమైనట్లు వివరించారు. కులం వల్ల ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లో తమను చిన్నచూపు చూస్తున్నట్లు 40 శాతం మంది దళితులు చెప్పారు. తమను కుల హేళన చేసినట్లు, తమపై వ్యంగ్యాస్త్రాలు, వ్యాఖ్యలు, జోకులు విసిరినట్లు 60 శాతం మంది తెలిపారు. స్కూళ్లలో ప్రతీ ముగ్గురు దళిత విద్యార్థులలో ఒకరు వివక్షకు గురవుతున్నారు. శూద్ర కులాలకు చెందిన విద్యార్థులంతా ఎక్కడ తమ కులం సంగతి బయటపడుతుందో, ఎక్కడ తమను సామాజికంగా దూరం పెడతారో అన్న భయంతో కాలం గడుపుతున్నారు. ఇక వ్యాపారస్థుల్లోనూ ఈ ధోరణి ఉంది. వివక్ష ఎదుర్కొంటున్నట్లు 20 శాతం మంది దళిత వ్యాపారులు చెప్పారు.

‘‘ఏకమొత్తంగా చూస్తే ఆచార వ్యవహారాల్లోనూ, కుల హోదాలోనూ అసమానతలు తారస్థాయిలో ఉన్నాయి. దళితులను ఓ రకంగా సామాజికంగా వెలి వేస్తున్నారు. అన్ని దక్షిణాసియా సంస్థల్లోనూ ఇదే తీరు’’ అని సర్వే వివరించింది. ఎనిమిది నెలల పాటు వివిధ దళిత కుల సంఘాలతో కలిసి పనిచేసి, వివరాలు రూపొందించినట్లు సౌందర్‌రాజన్‌తో పాటు నివేదిక రూపకర్త మారీ జ్విక్‌ మైత్రేయి తెలిపారు. ఇరవయేయళ్ల కిందట హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్‌ రచనలపై బోధించిన డాక్టర్‌ కార్నెల్‌ వెస్ట్‌ ఈ నివేదికను విడుదల చేశారు. ‘దేవాలయంలో కుల వివక్ష మరీ ఎక్కువగా కనిపిస్తోంది. మేం శెట్టి అంటే శూద్రుల్లో ఒక కులానికి చెందినవాళ్లం. అయ్యంగార్లు (అంటే బ్రాహ్మణులు), వారి పిల్లలు మమ్మల్ని చాలా చిన్నచూపు చూస్తుంటారు. అసలు మేం హిందువులమే కామంటారు. దీని వల్ల మా పెళ్లిళ్లకు కూడా ఆటంకం కలుగుతోంది. అందుకే పెద్దవాళ్లమయ్యాక మా తలిదండ్రులు మా పేరు చివరన కులాన్ని సూచించే నామాన్ని తీసేశారు. అయినా ఈ బాధ తప్పడం లేదు’’ అని కేఎన్‌ పేరున్న ఓ వ్యక్తి తెలిపాడు. కులం పేరు చెబితో ఎక్కడ చిన్నచూపు చూస్తారో, ఎక్కడ స్కూల్లో తమను వేరుపెడతారో అన్న భయాలు వెన్నాడుతున్నవారెందరో ఉన్నారు.. వీరు తమ కులాన్ని దాచిపెడుతున్న సందర్భాలు అనేకం అని సర్వే తెలిపింది. ‘‘మేం బౌద్ధాన్ని  విశ్వసిస్తామని తెలిసిన ఓ అగ్రవర్ణ హిందూ విద్యార్థి తల్లి- ఆ విషయాన్ని అందరికీ చెప్పింది. వారంతా నా బిడ్డకు దూరంగా జరిగిపోయారు. ఇది నాకు కోపాన్ని, బాధని కలిగించింది. 21 వ శతాబ్దిలో అదీ అమెరికాలో కులం ఇంత ప్రబలంగా కాటేస్తోందా ... అని ఆశ్చర్యం కలిగిస్తోంది’’ అని టీఆర్‌ అనే మరో విద్యార్థిని తండ్రి తెలిపారు. ‘ఆదాయ రీత్యా కూడా దళితుల పరిస్థితి తక్కువే. మూడొంతుల మంది దళితులు, శూద్రుల్లో నాలుగోవంతు మంది, వైశ్యుల వార్షిక ఆదాయం 25000 డాలర్లు (16 లక్షలు) మించడం లేదు. బ్రాహ్మణుల్లో 13 శాతం మాత్రమే ఈ పరిస్థితిలో ఉన్నారు. చాలా సంపన్న స్థితిలో ఉన్న దళితుల సంఖ్య 2శాతం మించదు. ఈ ఆదాయ అసమానతలు కూడా సామాజిక వివక్షకు కొంత కారణమవుతున్నట్లు’ సర్వే అభిప్రాయపడింది. అయితే ఒక ఆశాజనకమైన విషయమేంటంటే- 49శాతం దళితులు, 40శాతం శూద్రులు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. బ్రాహ్మణుల్లో 26శాతం, క్షత్రియుల్లో 35శాతం, వైశ్యుల్లో 30శాతం మాత్రమే పీజీ పూర్తి చేయగలిగారు.