Buy-House-in-Dubai

దుబాయ్‌లో మనకో ఇల్లు

రియల్టీ ఇన్వెస్టమెంట్‌ కొత్తపుంతలు

భారీగా కొంటున్న భారతీయులు

అంతర్జాతీయ వాణిజ్య హబ్‌గా రూపుదిద్దుకున్న దుబాయ్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగం అంతర్జాతీయ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. ఇక్కడ రెసిడెన్షియల్‌ ప్రాపర్టీల్లో పెట్టుబడులకు విదేశీ పౌరులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య హబ్‌గా, నెట్‌వర్క్‌ కేంద్రంగా దుబాయ్‌కి ఉన్న ప్రత్యేకతలతోపాటు అక్కడ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, ప్రోత్సాహకాలు, ఇతర ప్రత్యేకతలు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. దుబాయ్‌లో ఇల్లు కొనుక్కునేలా ప్రోత్సహిస్తున్నాయి.

రూ.కోటి ఇల్లు కొంటే రెసిడెన్షియల్‌ వీసా
దుబాయ్‌లో కోటి రూపాయలకన్నా ఎక్కువ ధర కలిగిన ఇంటిని కొనుగోలు చేస్తే ప్రభుత్వం నివాస వీసాను ఇస్తోంది. ఈ నేపథ్యంలోనే సంపన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపార పనులపై తరచూ దుబాయ్‌ సందర్శించేవారు ఈ విషయంలో ముందున్నారు. నివాస గృహాల ధరలు తక్కువగా ఉండటం కూడా దుబాయ్‌ రియల్టీపై ఇతర దేశస్తుల ఆసక్తికి ముఖ్యకారణం. హైదరాబాద్‌లోని మాదాపూర్‌, గచ్చిబౌలీ వంటి ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల ధర కోటి రూపాయలకు పైనే ఉంటుంది. బెంగళూరు, ముంబైవంటి నగరాల్లో రేట్లు హైదరాబాద్‌ కంటే ఇంకా చాలా ఎక్కువ. దుబాయ్‌లో ఒక మోస్తరు అపార్ట్‌మెంట్‌ 50-60 లక్షల రూపాయలకు కూడా లభిస్తుంది. లగ్జరీ అపార్ట్‌మెంట్లు, విల్లాల ధరలు కోట్లలో ఉంటాయి. అది వేరే విషయం. విదేశీ ప్రయాణాలపై ఆసక్తి ఉన్న చాలా మంది ఐటి ఉద్యోగులు, సినీ, క్రీడా రంగాల సెలబ్రిటీలు, వ్యాపారస్తులు, సంపన్నులు దుబాయ్‌లో ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు.
 
మోసాలకు తావులేదు..
దుబాయ్‌లోని టాప్‌ 10 రియల్‌ ఎస్టేట్‌ సంస్థల్లో ఆరు ప్రభుత్వరంగానికి చెందినవే. వీటిలో ప్రభుత్వానిదే మెజార్టీ వాటా. అందుబాటు ధరల్లో గృహాలు ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందువల్ల రియల్‌ వ్యాపారంలో మో సాలకు అస్కారం లేకుండాపోయింది.
 
ప్రభుత్వ చట్టాలు కూడా కఠినంగా ఉం టాయి. దుబాయ్‌ రియల్టీ రంగం పూర్తిగా వ్యవస్థీకృతమైంది. బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ ఆధారితంగా రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు జరుగుతాయి. ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉన్నదీ సులభంగా తెలిసిపోతుంది. కాబట్టి ఇంటి కొనుగోళ్ల విషయంలో ఎలాంటి సంశయం ఉండదు. ప్రాపర్టీ కొనుగోలు చేసిన కొన్ని రోజుల్లోనే కొనుగోలుదారు పేరు మీదకు మారిపోతుంది.
 
పన్నుల బెడద లేదు
ఇంటిని కొనుగోలు చేసే సమయంలో మన దగ్గర జిఎ్‌సటి (12 శాతం), రిజిస్ర్టేషన్‌ చార్జీలు (ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఉంటుంది) చెల్లించాల్సి ఉంటుంది. కానీ దుబాయ్‌లో కేవలం 4 శాతం రిజిస్ర్టేషన్‌ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ కొనుగోలు చేసిన ఇంటిని అద్దెకు ఇస్తే 8-9 శాతం రాబడి వస్తుంది. దీనిపై ఎలాంటి పన్ను ఉండదు. ఇంటిని స్వల్పకాలం లేదా దీర్ఘకాలం అద్దెకు ఇవ్వవచ్చు. ఇంటిని కొనుగోలు చేసిన వారికి ఉచితంగానే పార్కింగ్‌ ఏరియాను ఇస్తారు. ఇంటి విస్తీర్ణాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.
 
ఏడాదిలో రూ.30,000 కోట్ల పెట్టుబడులు
దుబాయ్‌ పశ్చిమాసియా దేశాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఆసియా, పశ్చిమదేశాల మధ్య కీలకమైన కూడలిగా ఉంది. అనేక దేశాలకు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించడం సులభం. హైదరాబాద్‌ వంటి నగరాల నుంచి మూడునాలుగు గంటల్లో దుబాయ్‌ చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ర్టాల నుంచి కూడా పలువురు ప్రముఖులు దుబాయ్‌లో ఇళ్లను కొనుగోలు చేసినట్టు ప్రాపర్టీ కన్సల్టింగ్‌ సంస్థ రెయిన్‌ అండ్‌ హార్న్‌ వెల్లడించింది. గత ఏడాదిలో భారత సంతతికి చెందిన వారు 7,000 గృహాలను కొనుగోలు చేశారు. వీటి విలువ సుమారు 30,000 కోట్ల రూపాయలు. అంతకు ముందు ఏడాదిలో 22,000 కోట్ల రూపాయల విలువైన గృహాల కొనుగోళ్లు జరిగాయి.
 
రాబడీ ఉంటుంది..

నివాసం కోసం కొందరు, పెట్టుబడి దృక్పథంతో మరికొందరు దుబాయ్‌లో ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా రూపుదిద్దుకుంటున్న దుబాయ్‌లో గృహాలను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్యనే అధికంగా ఉంది. దుబాయ్‌లో ఇల్లు కొనుక్కుంటే మరి దాని నిర్వహణ ఎలా అనే బెంగ అక్కరలేదు. ఆన్‌లైన్‌లోనే ఇంటిని హాయిగా అద్దెకు ఇవ్వొచ్చు. డెవలపర్‌ లేదా మొత్తం ప్రాజెక్ట్‌ను కొనుగోలు చేసిన ఇన్వె్‌స్టమెంట్‌ సంస్థలు మన తరఫునే అపార్ట్‌మెంట్‌, ఇల్లును లీజుకు ఇస్తుంది. నెలనెలా రాబడి మన ఖాతాలో జమచేస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్‌ కోసమే ఇల్లు కొనుగోలు చేసినవారు ధరలు పెరిగినప్పుడు అమ్ముకొని లాభాలు కూడా చేసుకోవచ్చు

వాణిజ్యానికి కీలక కేంద్రం
ఒకవైపు సముద్రం.. మరోవైపు ఎడారి తప్ప మరే ప్రత్యేకతలు లేని ఈ చిన్న గల్ఫ్‌ రాజ్యం గత కొన్నేళ్లలో అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక కేంద్రంగా ఎదిగింది. టూరిజం, ఫైనాన్స్‌, ఇంటర్నెట్‌, హెల్త్‌కేర్‌, రిటైల్‌ షాపింగ్‌కు కేరా్‌ఫగా మారింది. బహుళ అంతస్తుల భారీ సౌధం బూర్జ్‌ ఖలీఫా, అబ్బురపరిచే పామ్‌ జుమేరా, సముద్రంలో విస్తరించి ఉన్న అనేక చిన్న చిన్న దీవులు....దుబాయ్‌ ప్రత్యేక ఆకర్షణ. భారతీయులతో సహా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన వారు ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం తరలివస్తుండటంతో దుబాయ్‌ అత్యాధునిక అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకొంది. ప్రస్తుతం దుబాయ్‌ జనాభా 28 లక్షలు. 2030నాటికి దీని జనాభా 50 లక్షలకు చేరుకుంటుదన్న అంచనాతో ఇక్కడ భారీ ఎత్తున గృహ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు చేపడుతున్నారు.