ప్రవాసులకు బాసట!

దర్శనాల నుంచి.. న్యాయ సేవల వరకు..
భూకబ్జాలకు విముక్తి.. తల్లిదండ్రులకూ సాయం
ప్రవాసాంధ్రులకు అండగా ఏపీఎన్‌ఆర్‌టీ..
విదేశాల్లోని తెలుగువారందరికీ చేయూత
 
ఆంధ్రజ్యోతి, 24-04-2018:స్వదేశంలో ఉన్న తల్లిదండ్రుల అవసరాలను తీర్చడంలో ప్రవాసులకు ఏపీఎన్‌ఆర్‌టీ సహకరిస్తుంది. వారికి ఏ రూపంలో అవసరమున్నా... తగిన సహకారం అందిస్తుంది. బ్యాంకుల ద్వారా ఎన్నార్టీలకు పెట్టుబడులకు కావాల్సిన అనుమతులు, సలహాలు, కొత్తగా బ్యాంకు ఖాతాల ప్రారంభం, నగదు బదిలీ, విద్యా రుణం తదితర సేవల్లో సహకారం అందిస్తుంది. పన్ను చెల్లింపుల్లో సూచనలు కూడా ఇస్తుంది. విలువైన పత్రాలు పోగొట్టుకుంటే పోలీస్‌, ఆర్టీజీల సేవలను తీసుకుని వాటిని తిరిగి అందించేందుకు సాయం అందిస్తుంది.
 
దేవాలయాల్లో ప్రత్యేక దర్శనం
ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఉండే కొద్దిరోజుల్లో కచ్చితంగా దేవాలయాల సందర్శన ఉంటుంది. ఇలాంటి వారికోసం రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ప్రత్యేక సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమల, శ్రీకాళహస్తి, సింహాచలం, అన్నవరం, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ, ద్వారకా తిరుమల ఆలయాల్లో ప్రవాసులకు ప్రత్యేక దర్శనం కల్పించే బాధ్యతను ఏపీఎన్‌ఆర్‌టీ తీసుకుంది. అలాగే, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రవాసులను ఆదుకోవడం కోసం ప్రవాసాంధ్ర సహాయ నిధి ఏర్పాటుచేశారు. ఆపత్కాలంలో ఉన్న ప్రవాసులకు తగిన భోజన, ఆర్థిక, వసతి సదుపాయాలు అందించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రవాస తెలుగువారికి బీమా పథకం కూడా ప్రవేశపెట్టారు.
 
కంపెనీ ప్రారంభిస్తానంటే న్యాయ సేవలు
స్వరాష్ట్రంలో ఏదైనా కంపెనీ ప్రారంభించాలని ప్రవాసులు అనుకుంటే... వారికి అవసరమైన న్యాయ సహకారం అందిస్తుంది. పెట్టుబడులకు అవసరమైన మార్గనిర్దేశం చేస్తుంది. మరోవైపు ఎన్నార్టీలు కొనుగోలు చేసిన స్థలాలు, భూములు కబ్జాలకు గురైతే... వాటిని పరిరక్షించే విషయంలోనూ సాయం అందిస్తుంది.
 
24 గంటల హెల్ప్‌లైన్‌..
ఏపీఎన్నార్టీలో రిజిస్ర్టేషన్‌ చేసుకునేందుకు ఏపీఎన్‌ఆర్‌టీ.కామ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి జాయిన్‌ యాజ్‌ ఏ మెంబర్‌పై క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేయాలి. అలాగే, ప్రవాస తెలుగువారికి ఏ విషయంలో సాయం కావాల్సినా అందుబాటులో ఉండేందుకు ఒక టోల్‌ఫ్రీ నంబరు కూడా ఏర్పాటు చేశారు.  08632340678కు గానీ, సెల్‌ నెంబరు 08500027678కి కానీ ఫోన్‌ చేసి సమాచారం, సాయం కోరవచ్చు. 24 గంటలూ ఈ హెల్ప్‌లైన్‌ పనిచేస్తుంది.