911-Law-in-America

అమెరికాలో 911తో జరభద్రం!

కుటుంబసభ్యులతోనైనా క్రూరంగా ప్రవర్తించడం నేరం

బాధితులు ఆవేశంలో ఆ నంబర్‌కు ఫోన్‌ చేస్తే సమస్యే

కోపంలో పిల్లలను కొట్టినా వారిని వేరు చేసే ప్రమాదం

అమెరికాలో తెలుగువారి సంఖ్య 10 లక్షలకు చేరుకుందని అంచనా. అక్కడే స్థిరపడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు యూఎస్‌లో  గుజరాతీలు, పంజాబీలు ఎక్కువగా ఉండేవారు. కాని ఇప్పుడు తెలుగు జనాభా వారిని మించిపోయింది. ఐటీ రంగంలో తెలుగువాళ్లు కీలకంగా ఉండటం, ఉపాధి అవకాశాల్లో వారే ఎక్కువగా చేజిక్కించుకుంటుండడమే ఇందుకు కారణం. ఒక అధ్యయనం ప్రకారం.. 30-40 సంవత్సరాల వయసు మధ్య ఉన్న తెలుగువాళ్ల సంఖ్య ఇప్పుడు అమెరికాలో ఎక్కువగా ఉంది. అంటే చిన్నపిల్లలు ఉండే వయసు. అయితే, అమెరికాలో కుటుంబ నిర్వహణ ఇండియాతో పోల్చుకుంటే కొంచెం కష్టమే. ఖరీదైన జీవితం కావాలనుకుని భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసేవారైతే మరీ కష్టం. స్థానిక చట్టాలపై అవగాహన పెంచుకుని ఆమేరకు నడుచుకుంటే పర్వాలేదుగానీ.. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే.. అమెరికాలో ఎవర్నయినా సరే, కుటుంబ సభ్యులైనా సరే హింసించడం చట్టవ్యతిరేక చర్యగానే భావిస్తారు. ఎదుటివారి అనుమతి, ఇష్టం లేకుండా ముట్టుకోవడం కూడా నిర్బంధ హింసగానే పరిగణిస్తారు. గృహ హింసని ఇక్కడి న్యాయవ్యవస్థ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది.
 
అభిప్రాయభేదాలతో కోపంతో మనం చేసే చిన్న తప్పిదమైనా మన కెరియర్‌నే కాక జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. భార్యను లేదా భాగస్వామిని లేదా బంధుమిత్రులతోపాటు ఇతర కుటుంబ సభ్యులను కోపంతో గట్టిగా కొట్టకూడదు. వారికి చిన్నదెబ్బ తగిలినా అది పెద్ద కేసుగానే ఇక్కడి చట్టం చూస్తుంది. అలాగే మన పిల్లలే అని వారితో క్రూరంగా ప్రవర్తించడం కొట్టడం లాంటి చర్యలు ఇక్కడ నేరం. పిల్లలు అల్లరి చేసినపుడు దండించడం భారతీయ సమాజంలో తప్పుగా అనిపించదు. కానీ, అమెరికాలో అది తప్పే. ఆ తప్పునకు శిక్షగా.. మీ పిల్లలనే మీ నుంచి వేరు చేస్తారు అధికారులు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారిని తిడుతున్నారని, కొడుతున్నారని తెలిస్తే అక్కడి ప్రభుత్వ ఏజెన్సీలు, ఆ పిల్లలను వేరేవాళ్ల సంరక్షణలో ఉంచుతాయి.
 
చెన్నూరి వెంకట సుబ్బారావు, అమెరికాలో వెలువడే తెలుగు టైమ్స్ సంపాదకులు 
 
అనుకోని ఇబ్బందులు...
పౌరుల జీవితానికి భద్రతను, భరోసాను ఇచ్చే ఈ నంబర్‌ను కొంతమంది తెలిసీతెలియక ఉపయోగించడంతో కొన్ని కష్టాలను వారు ఎదుర్కోవలసి వస్తుంది. దీనికి సంబంధించి రెండు ఉదాహరణలు.. డాల్‌సకు చెందిన వెంకట్‌ గుత్తాకు ఒక పాప, ఒక బాబు. పిల్లలిద్దరూ ఆడుకుంటూ కొంచెం గొడవపడ్డారు. 7-8 ఏళ్ల వయస్సు ఉన్న అక్క తన తమ్ముడిని భయపెట్టేందుకు 911కు ఫోన్‌ చేస్తానని బెదిరించింది. 5 ఏళ్ల తమ్ముడు.. ‘చేసుకో నాకేమి భయం లేద’ని చెప్పడంతో ఆ పాప 911కు ఫోన్‌ చేసింది. 10 నిముషాల్లో ఓ పోలీస్‌ ఆఫీసర్‌ వారి ఇంటికి వచ్చారు.విషయం తెలియని తల్లితండ్రులు పోలీసులకు సర్దిచెప్పడానికి ప్రయత్నించినప్పటికీ వారు వినలేదు. తమకు ఫోన్‌ చేసిన పాపతో 15 నిముషాలు విడిగా కూర్చుని మాట్లాడి, నిజంగా ఏమీ గొడవ జరగలేదని నిర్దారించుకున్నాకే వెళ్లాడో అధికారి. అలాగే, కాలిఫోర్నియాలో జరిగిన మరో సంఘటన.
 
తానా మాజీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి దగ్గరకు ఓ సాఫ్ట్‌వేర్‌ కుర్రవాడు సహాయం కావాలని వచ్చాడు. తన భార్యకు, తన తల్లికి పెద్దగా పడట్లేదని, కోడలు అత్తగారిని ఏదో వంకతో తిడుతుండేదని.. ఏదైనా సమస్య వస్తే 911కు ఫోన్‌ చేయాలని వచ్చిన కొత్తల్లో తన తల్లికి చెప్పగా ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్న ఆమె ఆ నంబర్‌కు ఫోన్‌ చేసిందని వివరించాడు. వెంటనే ఒక పోలీస్‌ ఆపీసర్‌ వచ్చి ఎంక్వయిరీ చేసి తన భార్యపై కేసు పెట్టి ఆమెను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లిపోయాడని.. కోడలి అరెస్టుతో భయపడిపోయిన తన తల్లి కూడా ఏడవడం మొదలు పెట్టిందని చెప్పాడు. సహాయం చేయాలని కోమటి జయరాంను కోరాడు. ఆయన మరికొంతమంది పెద్దలతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి ఎలాగో వారిని ఒప్పించి కోడలిని జైలు నుంచి విడిపించారు. ఇలా ఆవేశపడి 911కు ఫోన్‌ చేస్తే వచ్చే దుష్ఫలితాలకు ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి చాలా సంఘటనలు వెలుగు చూస్తుంటాయి.కాబట్టి, అమెరికాలో పసిపిల్లల పెంపకం గురించి 911 నెంబర్‌ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందుగా అవగాహనను పెంపొందించుకుంటేనే జీవితం హాయిగా గడిచిపోతుంది. లేదంటే ఇబ్బందులే.
 
అమెరికాలో నివసించేవారికి 911 నంబర్‌ ఆక్సిజన్‌ లాంటిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా వెంటనే ఆదుకునే నంబర్‌ ఇది. ఈ ఫోన్‌ నంబర్‌ను ఎలాంటి సందర్భాలలో ఉపయోగించాలో 3 సంవత్సరాల పిల్లల నుంచి అందరికీ తెలియజేస్తారు. చిన్నారులను బడిలో చేర్పించినప్పుడు మొదట పోలీస్‌ వ్యవస్థ గురించి చెబుతారు. ఏదన్నా సమస్య వస్తే 911కు ఫోన్‌ చేయాలని సూచిస్తారు. ఈ నంబర్‌కు ఫోన్‌ చేస్తే కాప్స్‌ (పోలీసులు) 2 నిముషాల నుంచి 7 నిముషాలలో ఫోన్‌ కాల్‌ వచ్చిన ప్రాంతానికి వస్తారు. 911 అంటే భద్రత. అందుకే బిన్‌ లాడెన్‌ మిదకు అమెరికా పోరాటానికి కూడా 2011 సెప్టెంబర్‌ 9వ తేదీని ఎంచుకుంది. 9-11 డాడిగా దానిని ఇప్పటికీ పేర్కొంటారు.
 
చట్టమంటే చట్టమే..
అమెరికాలో మనవాళ్లు నివసించాలనుకుంటే ముందుగా ఇక్కడి చట్టాలపై, పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలి. లేకుంటే ఇబ్బందుల్లో పడుతారు. ఇక్కడి చట్టాలు కఠినంగా ఉంటాయి. మా అబ్బాయే కదా అని ఇష్టం వచ్చినట్లు కొట్టడానికి వీలు లేదు. సున్నితంగానే చెప్పాలి. అత్తా కోడళ్లు, భార్యాభర్తలు కూడా చేయి చేసుకోవడానికి, తిట్టుకోవడానికి చట్టాలు అనుమతించవు.
-జయరామ్‌ కోమటి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి