Umair-Sandhu-tewwt-about-Jai-LavaKusa

జై లవకుశ.. ఎలా ఉందో చెప్పేసిన సెన్సార్ బోర్డ్ సభ్యుడు

టీజర్‌తో ఆకట్టుకుని.. సాంగ్స్‌తో ప్రేక్షకుల మదిని గెలుచుకుని.. ట్రైలర్‌తో అంచనాలను పెంచేసింది.. జై లవకుశ. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 21న విడుదలవబోతున్న ఈ సినిమాకు అంచనాలు భారీగానే ఉన్నాయి. బుధవారం ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ తెలిపింది. అయితే సినిమా టాక్ ఏంటో, ఎలా ఉందో ఓ సెన్సార్ బోర్డ్ సభ్యుడు తేల్చిచెప్పారు. ఎన్టీఆర్ మొట్టమొదటిసారి మూడు పాత్రల్లో నటిస్తున్న జై లవకుశ.. రివ్యూను సెన్సార్ బోర్డ్ సభ్యుడు ముందే చెప్పేశారు. 

దుబాయిలో ఉండే ఫిల్మ్ క్రిటిక్, సెన్సార్‌బోర్డ్ సభ్యుడు అయిన ఉమైర్ సంధు.. జై లవకుశ సెన్సార్ టాక్ ఎలా ఉందో వెల్లడించారు. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పిన సమాచారం మేరకు.. జై లవకుశ మాస్ ఎంటర్‌టైనర్‌గా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందనీ, మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఇరగదీశారని ఆయన ట్వీట్ చేశారు. ఫస్ట్ కాపీని సెన్సార్ బోర్డు ఇప్పుడే చూసిందనీ, సినిమా బాగా వచ్చిందని, ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ ఖాయమన్నారు. మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. 10వ తారీఖున విడుదలయిన ఈ సినిమా ట్రైలర్‌ను ఇప్పటికే కోటి మందికి పైగా చూశారు. తమన్నా ప్రత్యేక గీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని చెబుతున్నారు.