toliprema-collect-one-million-dollar-

'తొలిప్రేమ'కి రెండు వారాల్లోనే రికార్డు కలెక్షన్లు

మెగా హీరో వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా బీవీఎన్‌ఎన్ ప్రసాద్ నిర్మాతగా, వెంకీ అట్లూరీ దర్శకత్వంలో వచ్చిన తొలిప్రేమ సినిమా ఎన్నారై సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలయింది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ఈ సినిమాకు ఎన్నారై ప్రేక్షకులు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. ఫిబ్రవరి 10న విడుదలయిన ఈ సినిమా వరుణ్‌తేజ్ కెరీర్లో మరపురాని హిట్‌గా నిలిచింది. ఫిదా తర్వాత ఒక మిలియన్ డాలర్ మార్కును చేరిన సినిమాగా తొలిప్రేమ రికార్డు సృష్టించింది. 

అమెరికాలో విడుదలైన రెండు వారాల్లోనే ఈ సినిమా మిలియన్ డాలర్ల(6కోట్ల 47లక్షల 10వేల 500 రూపాయలు) మార్క్‌ను క్రాస్ చేసిందని ఓవర్సీస్ డిస్టిబ్యూటర్లు వెల్లడించారు. యూత్‌ను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా.. పవన్ సినిమా టైటిల్‌కు న్యాయం చేకూర్చిందని విశ్లేషకులు తేల్చిచెప్పారు. కాగా గతేడాది వరుణ్‌తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమా కూడా ఓవర్సీస్‌లో కలెక్షన్ల వర్షం కురిపించింది. గతేడాది విడుదలయిన సినిమాల్లో ఓ బ్లాక్‌బస్టర్‌ సినిమాగా నిలిచింది. ఓవర్సీస్‌లో మొత్తం 2.07 మిలియన్ డాలర్లను(రూ.12కోట్ల 94లక్షల 21వేలు) కలెక్ట్ చేసి అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల పరంగా 6వ స్థానంలో నిలిచింది.