Three-days-collections-of-Goodachari

గూఢచారికి రికార్డు స్థాయిలో కలెక్షన్లు

క్షణంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అడివిశేష్.. గూఢచారితో మరోసారి మెప్పించాడు. స్పై థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన గూఢచారి.. సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుని కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. అడివిశేష్, శోభిత ధూళిపాళ, జగపతిబాబు, సుప్రియ, వెన్నెల కిషోర్, ప్రకాశ్‌రాజ్ వంటి తారగణంతో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిస్తోంది. అతి తక్కువ బడ్జెట్‌లో జేమ్స్‌బాండ్ వంటి సినిమాను చూసినట్లు ఉందంటూ ప్రేక్షకులు కితాబిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా విడుదలయిన ఈ సినిమా కలెక్షన్లలో దూసుకెళ్తోంది..
 
అమెరికాలో 112 లొకేషన్లలో విడుదలయిన ‘గూఢచారి’ కలెక్షన్ల వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ‘కథా బలం ఉన్న సినిమా పవర్ ఇది’.. అంటూ కామెంట్ చేశారు. అమెరికాలో ఈ సినిమా గురువారం ప్రీమియర్ల ద్వారా విడుదలయింది. ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమాకు 52,394 డాలర్ల కలెక్షన్లను ఈ సినిమా కొల్లగొట్టింది. అయితే సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా కలెక్షన్లు ఏకంగా 51.47శాతం పెరిగాయి. శుక్రవారం ఈ సినిమా 1,02,994 డాలర్లను కలెక్ట్ చేయగా.. శనివారం లక్షా 56వేల 9డాలర్లను సంపాదించింది. మొత్తం మీద మొదటి మూడు రోజుల్లో అమెరికాలో గూఢచారికి 3లక్షల 11వేల 397డాలర్ల (2.14 కోట్ల రూపాయలు) కలెక్షన్లు వచ్చాయి. కేవలం 112 లొకేషన్లలోనే ఈ సినిమా ఇంత మొత్తంలో కలెక్షన్లను కొల్లగొట్టడానికి కథాబలమే కారణమని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.