:: Welcome to NRI - Article ::

రెండో వీకెండ్‌లోనూ అదరగొట్టిన బాహుబలి-2

విజువల్ వండర్‌గా తెరకెక్కిన బాహుబలి-2... ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను అలరిస్తోంది. టాలీవుడ్‌ నుంచి మొదలుపెట్టి, బాలీవుడ్‌లోనూ రికార్డులను కొల్లగొట్టి.. ఇప్పుడు ఓవర్సీస్‌లోనూ చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటికే వెయ్యికోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన మొట్టమొదటి భారతీయ సినిమాగా అరుదైన రికార్డును నమోదు చేసింది. సినిమా విడుదలై రెండో వారం ప్రారంభమయినా కలెక్షన్ల జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదంటే ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి-2 మానియా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 
ఓవర్సీస్ సినీ ప్రియులు బాహుబలికి అడిక్ట్ అయిపోయారనే చెప్పుకోవచ్చు. అమెరికాలో గతంలో ఏ సినిమాకు రాని విధంగా కలెక్షన్ల కుంభవర్షం కురిపిస్తోంది బాహుబలి-2. రెండో వీకెండ్.. అంటే 8వ తారీఖు ఆదివారం వరకూ అమెరికాలో బాహుబలి-2.. ఏకంగా ఒక కోటి 60 లక్షల 12వేల 766 డాలర్లు కలెక్ట్ చేసింది. కెనడాలోనూ ఈ సినిమా రికార్డు కలెక్షన్లను సాధిస్తోంది. ఆదివారం వరకూ కెనడాలో 5 లక్షల 82వేల 866 డాలర్లను సంపాదించింది. మొత్తం మీద ఈ రెండు దేశాల్లోనే 16.59 మిలియన్ డాలర్లను (107.34 కోట్ల రూపాయలు) కొల్లగొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో బాహుబలి-2 నిలిచింది. లాంగ్‌రన్‌లో ఈ సినిమా 25 మిలియన్ డాలర్లు కొల్లగొట్టడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు సినిమాల్లో బాహుబలి-1, బాహుబలి-2 సినిమాలు తప్ప ఓవర్సీస్‌లో ఇంతవరకూ 3 మిలియన్ డాలర్ల మార్కును దాటిన చిత్రాలు లేవు. అలాంటిది బాహుబలి-2 సినిమా కనుక... 25 మిలియన్ డాలర్ల మార్కును చేరుకోగలిగితే.. ఈ రికార్డును దాటేయడం అంత సులవు కాదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  25 మిలియన్ డాలర్లనేది పెద్ద సవాల్ వంటిదనీ, దీన్ని దాటుతుందో లేదో సర్కార్-3 ఫలితమే తేల్చుతుందంటున్నారు. 

 

Loading...