Sankranthi-New-Release-Movies-Verdict

అమెరికాలో రంగస్థలాన్ని దాటని ‘వినయ విధేయ రామ’

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయిన ‘వినయ విధేయ రామ’ సినిమా.. ఓవర్సీస్‌లో అంతగా అలరించలేకపోయింది. ప్రవాసులను ఆకట్టుకోలేకపోయింది. రామ్ చరణ్ గత సినిమా అయిన రంగస్థలం.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఓవర్సీస్‌లో కూడా ఘన విజయం సాధించింది. అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాల్లో చోటు సంపాదించుకుంది.  రంగస్థలం తర్వాత విడుదలవుతున్న సినిమా అవడంతో ‘వినయ విధేయ రామ’ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే అమెరికాలో విడుదలకు డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లే చేశారు. పెద్ద సంఖ్యలో థియేటర్లలో విడుదలకు సిద్ధం చేసినప్పటికీ ‘వినయ విధేయ రామ’ ప్రీమియర్లకు ఆశించిన రీతిలో బుకింగ్స్ రాలేదు. రంగస్థలం కలెక్షన్లను ఈ సినిమా దాటేస్తుందని డిస్ట్రిబ్యూటర్లు వేసుకున్న అంచనా పూర్తిగా తలకిందులయింది. మొత్తం 139 స్క్రీన్లలో 1,81,118 డాలర్ల మొత్తాన్ని ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా కలెక్ట్ చేసిందని సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ మొత్తం రంగస్థలం ప్రీమియర్ కలెక్షన్ల కంటే చాలా తక్కువ. 
 
ఈ సంక్రాంతి సీజన్‌లోనే ఈ సినిమా కంటే ముందుగా విడుదలయిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు ప్రీమియర్ షోల ద్వారా కలెక్షన్లు బాగానే వచ్చాయి. యూఎస్ తెలుగు మూవీస్ డిస్ట్రిబ్యూషన్‌లో దాదాపు 200 స్క్రీన్లలో అమెరికాలో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల అయింది. మంగళవారం అమెరికాలో 600కు పైగా ప్రీమియర్ షోలు నడిచాయి. మొత్తం మీద ప్రీమియర్ షోల ద్వారానే ఈ సినిమా 5,18,126 డాలర్ల (దాదాపు మూడున్నర కోట్ల రూపాయలకు పైగానే) కలెక్షన్లను కొల్లగొట్టినట్లు సమాచారం. ఇది బాలయ్య కెరీర్లోనే అమెరికాలో హయ్యస్ట్ ఓపినింగ్స్. అమెరికాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. కాగా ఈ రెండు సినిమాల తర్వాత విడుదలయిన ‘ఎఫ్-2’కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సంక్రాంతి సీజన్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా నిలిచే అవకాశాలున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. కామెడీ కూడా బాగా పండటం, మల్లీశ్వరీ, నువ్వునాకు నచ్చావ్.. తరహాలో వెంకటేష్ పాత్ర ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా అమెరికాలో దాదాపు 90 స్క్రీన్లలో విడుదలయింది. ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 1,88,424 డాలర్లు కలెక్ట్ చేసినట్లు సమాచారం.