record-breaking-collections-

ఆ రెండు సినిమాల రికార్డులు బ్రేక్..

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ భారీ క్రేజ్ ఉంటుంది. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలకు కూడా ఓవర్సీస్‌లో మంచి ఆదరణ ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో రూపొందిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా గురువారం విడుదలైంది. హరిక-హసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. విడువలైన మొదటిరోజే తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ కలెక్షన్ల  పరంగా 'అరవింద సమేత' దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజే ఓవర్సీస్‌లో ఎన్టీఆర్ గత సినిమాల కలెక్షన్ల రికార్డులు బద్ధలుకొట్టింది. మొదటిరోజే 'అరవింద సమేత' ఓవర్సీస్‌లో 7,97,366 డాలర్లు(రూ.5కోట్ల90లక్షల60వేల664) రాబట్టింది.

జూనియర్ ఎన్టీఆర్ గత చిత్రాలు రెండు ఓవర్సీస్ మార్కెట్‌లో రాబట్టలేని కలెక్షన్లను 'అరవింద సమేత' సాధించిందని విశ్లేషకులు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గత చిత్రం 'జైలవకుశ' ఓవర్సీస్‌లో మొదటిరోజు 5,89,219డాలర్లు(రూ.4కోట్ల36లక్షల58వేల181) రాబట్టింది. అలాగే మరో హిట్ సినిమా 'జనతాగ్యారేజ్' 5,84,000 డాలర్లు(రూ.4కోట్ల31లక్షల80వేల960)రాబట్టింది. 'అరవింద సమేత' ఈ రెండు సినిమాల కలెక్షన్లను బద్ధలుకొట్టింది. ఈ సినిమా కలెక్షన్లు ఇలాగే కొనసాగితే ఇంకా ఎన్ని సినిమాల రికార్డులు బద్ధలు కొడుతుందోనని సినీ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.