Rangula-Raatnam-overseas-review

రంగుల రాట్నం.. సినిమా ఎలా ఉందంటే..

సంక్రాంతి రేసులో స్టార్ హీరోల సినిమాలతో పాటు వస్తున్న చిన్న సినిమాలు హిట్ అవుతుండటం ఈ మధ్య తరచుగా జరుగుతూ వస్తోంది. గతేడాది ఖైదీ నెం.150, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి ప్రతిష్టాత్మక సినిమాలున్నా.. శతమానం భవతి కూడా వచ్చి హిట్ కొట్టింది. ఈ ఏడాది కూడా అదే విధంగా రంగులరాట్నం సంక్రాంతి రేసులోకి వచ్చింది. ముందుగా వచ్చిన అజ్ఞాతవాసి సినిమా అనుకున్నంత రేంజ్‌లో లేకపోవడం, ఆ తర్వాత వచ్చిన జై సింహా.. మాస్ ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అవడంతో అందరి దృష్టి రంగుల రాట్నంపైనే పడింది. దర్శకురాలు శ్రీ రంజని మొట్టమొదటి సినిమా అవడం, దీనికి అక్కినేని నాగార్జున నిర్మాత అవడంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం విడుదలయిన ఈ సినిమా.. ఓవర్సీస్‌లో ఓ రోజు ముందుగానే.. అంటే శనివారమే ప్రీమియర్ల ద్వారా విడుదలయింది. ప్రీమియర్ల ద్వారా ఈ సినిమాను చూసిన ప్రవాసులు సినిమాకు మంచి మార్కులే వేస్తున్నారు..
 
విష్ణు(రాజ్‌ తరుణ్) అనే యువకుడు తన స్నేహితుడయిన (ప్రియదర్శి పులికొండ)తో కలిసి గ్రీటింగ్ కార్డుల కంపెనీని ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో కీర్తి(చిత్ర)ను ప్రేమిస్తాడు. అయితే అనుకోని కారణాల వల్ల ఆమె ప్రవర్తన నచ్చక వారిద్దరికీ బ్రేకప్ అవుతుంది. తల్లి(సితార) చెప్పే కొన్ని కారణాల వల్ల మళ్లీ కీర్తి ప్రేమను గెలుచుకునేందుకు విష్ణు ప్రయత్నాలు మొదలు పెడతాడు.. అసలు ఇద్దరికీ ఏ కారణాల వల్ల బ్రేకప్ అవుతుంది..? ఆమె ప్రేమను గెలుచుకోమని తల్లి ఎందుకు చెబుతుంది..? చివరకు ఇద్దరూ కలిశారా..? అనేది చిత్ర కథాశం.. 
 
రొటీన్ కథ అయినా స్క్రీన్‌ప్లేతో సినిమా ఆకట్టుకుంటుందని, ప్రియదర్శి పులికొండ కామెడీ బాగుందని ఓ ఎన్నారై తెలిపాడు. మొదటి హాఫ్‌లో సెంటిమెంట్ ఎక్కువయినట్లు అనిపిస్తుందనీ, సెకండ్ హాఫ్‌లో వచ్చే ప్రియదర్శి కామెడీతో సరదాగా సాగిపోతుందని మరో ఎన్నారై చెప్పాడు. ప్రియదర్శి కామెడీ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అనీ, పాటలు సోసోగా ఉన్నాయని చెబుతున్నారు.  సంక్రాంతి రేసులో స్టార్ హీరోలతో పోటీకి దిగిన రాజ్ తరుణ్.. మొత్తానికి రంగుల రాట్నంతో ఫరవాలేదనిపించాడంటున్నారు.