Rangasthalam-brakes-Non-Bahubali-records

నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేసిన రంగస్థలం..

రంగస్థలం సినిమాతో.. బాక్సాఫీస్ వద్ద తన సత్తాను మరోసారి చూపిస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. మగధీర తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని సాధించి, అదే రేంజ్‌లో కలెక్షన్లను కూడా కొల్లగొడుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా.. పల్లెటూరి అందాలను చూపిస్తూ.. ఆనాటి కాలానికి తీసుకెళ్లగలిగేలా కథ, కథనాలు ఉండటంతో ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. 

‘క్రియేటివ్ సినిమాస్ న్యూయార్క్’ డిస్ట్రిబ్యూషన్లో అమెరికాలో 185కు పైగా స్క్రీన్లలో రంగస్థలం విడుదలయింది. పక్కా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో విడుదలయిన ఈ సినిమాకు ఎన్నారైలు ఫిదా అవుతున్నారు. విడుదలయిన రెండో వీకెండ్ నాటికి.. ఈ సినిమా అమెరికాలో 3 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసినట్లు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా ప్రకటించారు. నాన్ బాహుబలి సినిమాల రికార్డులన్నింటినీ బ్రేక్ చేసిందని తెలిపారు. ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన బాహుబలి-2, బాహుబలి-1 సినిమాల తర్వాతి స్థానంలో రంగస్థలం నిలిచిందని వెల్లడించారు. ఈ వీకెండ్ నాటికి మరో మిలియన్ డాలర్లను కలెక్ట్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.