:: Welcome to NRI - Article ::

రాజుగారి గది-2 ఓవర్సీస్ రివ్యూ

నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత.. అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న సినిమా ‘రాజుగారి గది-2’. మామయ్య నాగార్జునతో కలిసి మనంలో సందడి చేసిన సమంత.. ఈ సినిమాలోనూ తెరను పంచుకుంది. మామా కోడలు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదలవుతున్న  ఈ సినిమా ఓవర్సీస్‌లో మాత్రం ఒక రోజు ముందుగానే విడుదల అయింది. గురువారమే ఓవర్సీస్‌లో ప్రీమియర్ల ద్వారా విడుదలయిన ఈ సినిమా ఎన్నారైల నుంచి పాజిటివ్ టాక్‌‌ను తెచ్చుకుంటోంది. హర్రర్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాలో రుద్రగా నాగార్జున, అమృత పాత్రలో సమంత నటించారు. ఓంకార్ దర్శకత్వంలో సీరత్ కపూర్, ఆశ్విన్ బాబు, వెన్నెల కిషోర్, శకలక శంకర్.. నటించిన ఈసినిమా గురించి ఎన్నారైలు ఏమంటున్నారో ఓ లుక్కేయండి. 

ఆశ్విన్ బాబు, వెన్నెల కిషోర్, శకలక శంకర్‌కు చెందిన ఓ రిసార్ట్‌లో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఓ చర్చి ఫాదర్ సలహా మేరకు మెంటలిస్ట్ రుద్ర(నాగార్జున)ను వాళ్లు కలుస్తారు. మెంటలిస్ట్‌గా వచ్చిన నాగార్జున వాళ్ల సమస్యను ఎలా పరిష్కరించాడు. అసలు ఆ రిసార్ట్‌లో దెయ్యం ఉందా..? సమంత ఎవరు..? సమంతకు ఈ రిసార్ట్‌కు సంబంధం ఏమిటి..? అనేవి తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మొదటి హాఫ్ అంతా కామెడీ, హర్రర్‌తో సరదాగా సాగిపోతుందని, సినిమాలో కామెడీ బాగా వర్కవుట్ అయిందని ఎన్నారైలు చెబుతున్నారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు బాగుంటాయిని, సమంతకు సంబంధించి వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో ఎమోషనల్ సీన్స్ కన్నీళ్లు పెట్టిస్తాయని, మొత్తానికి ఈ సినిమా చైతు సమంత పెళ్లి తర్వాత ఓ గిప్ట్ అని చెప్పుకోవచ్చునంటున్నారు. 

రాజుగారి గది సినిమాకు సీక్వెల్ అని మొదటి నుంచి చెబుతున్నా.. ఈ కథకు, పాత కథకు అస్సలు సంబంధం ఉండదనీ, స్టోరీ కొత్తగా ఉంటుందట. తమ కెరీర్లోనే ఇంతకు ముందెన్నడూ చేయని పాత్రలను నాగార్జున, సమంత చేశారని ఓ ఎన్నారై అభిప్రాయపడ్డాడు. వెన్నెల కిషోర్, శకలక శంకర్ కామెడీ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందట. సమంత పాత్ర మహిళలకు బాగా నచ్చుతుందట. మొత్తానికి ఈ సినిమాతో మామా కోడళ్లు సూపర్ హిట్ కొట్టారని ఎన్నారైలు ఏకగ్రీవంగా చెప్పేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఏమంటారో చూడాలి మరి.