Power-star-movies-collection-braked-by-Rangasthalam

పవర్‌స్టార్ సినిమాల రికార్డులను.. బ్రేక్ చేసిన మెగాపవర్‌ స్టార్

రంగస్థలం సినిమాతో.. బాక్సాఫీస్ వద్ద తన సత్తాను మరోసారి చూపిస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్. మగధీర తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని సాధించి, అదే రేంజ్‌లో కలెక్షన్లను కూడా కొల్లగొడుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా.. పల్లెటూరి అందాలను చూపిస్తూ.. ఆనాటి కాలానికి తీసుకెళ్లగలిగేలా కథ, కథనాలు ఉండటంతో ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. 
 
‘క్రియేటివ్ సినిమాస్ న్యూయార్క్’ డిస్ట్రిబ్యూషన్లో అమెరికాలో 185కు పైగా స్క్రీన్లలో రంగస్థలం విడుదలయింది. పక్కా పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో విడుదలయిన ఈ సినిమాకు ఎన్నారైలు ఫిదా అవుతున్నారు. విడుదలయిన నాలుగురోజుల్లోనే అమెరికాలో ఈ సినిమాకు 2.4 మిలియన్ డాలర్ల (15కోట్ల 60 లక్షల రూపాయలకు పైగానే) కలెక్షన్లు వచ్చాయంటే ఎన్నారైలను ఏ స్థాయిలో ఈ సినిమా అలరిస్తోందో వేరుగా చెప్పనక్కర్లేదు. అత్యంత వేగంగా రెండు మిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న సినిమాగా రంగస్థలం రికార్డులకెక్కింది. ఈ వీకెండ్ నాటికి 3 మిలియన్ డాలర్ల మార్కును సులభంగా చేరుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 
 
కాగా అమెరికాలో పవర్‌స్టార్ పవన్ సినిమాకు ఉన్న క్రేజే వేరు.. తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకున్న సినిమాలు కూడా అమెరికాలో ఒక మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుంటాయి. ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన పవన్ కల్యాణ్ సినిమా అజ్ఞాతవాసి.. ఈ సినిమాకు అమెరికాలో 2.06 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో ఉన్న అత్తారింటికి దారేది సినిమాకు 1.90 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. 
 
ఈ రెండు సినిమాల రికార్డులను రామ్ చరణ్ సినిమా రంగస్థలం సులభంగా దాటేసింది. పవన్ ‘అజ్ఞాతవాసి’ సినిమా ఓవరాల్ కలెక్షన్లను నాలుగు రోజుల్లోనే రంగస్థలం దాటేసింది. మొత్తంమీద అమెరికాలో పవన్ సినిమాల రికార్డులను రామ్‌చరణ్ బ్రేక్ చేశాడు.