oveseas-record-of-mahanati

మరో రికార్డును సొంతం చేసుకున్న ‘మహానటి’

తెలుగులో వచ్చిన మొట్టమొదటి బయోపిక్ ‘మహానటి’ ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌, సావిత్రి పాత్ర పోషించిన కీర్తిసురేష్‌తోపాటు ఇతర తారాగణానికి, నిర్మాతలకు ప్రశంసలు దక్కుతున్నాయి. విమర్శకులు సైతం సినిమాను అభినందిస్తున్నారు. దీంతో కలెక్షన్ల పరంగా ‘మహానటి’ దూసుకెళ్తోంది. అమెరికాలో దాదాపు 150కిపైగా లోకేషన్లలో విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోల రూపంలో మంచి కలెక్షన్లను రాబట్టడమే కాకుండా లాంగ్‌రన్‌లో మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో స్థానం దక్కించుకుంది. అంతేకాకుండా 120కి పైగా లోకేషన్లలో మంచి కలెక్షన్లతో విజయవంతంగా దూసుకెళ్తోంది. ‘మహానటి’ని అమెరికలోని డిస్ట్రిబ్యూట్ చేసిన ‘నిర్వాణ సినిమాస్’ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దర్శకుడు నాగ్ అశ్విన్, నటి కీర్తి సురేష్‌తో ఇతర నటీనటులు, నిర్మాతలు గొప్పతనమే చిత్ర విజయానికి కారణమని, ధన్యవాదాలు తెలుపుతున్నామని ‘నిర్వాణ సినిమాస్’ పేర్కొంది. సినిమాకు సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను విడుదల చేసి సంతోషం వ్యక్తం చేసింది.