:: Welcome to NRI - Article ::

మహేశ్ వర్సెస్ ఎన్టీఆర్.. ఓవర్సీస్‌లో గెలుపెవరిది..?

మహేశ్‌బాబు.. ఓవర్సీస్ బాక్సాఫీస్‌కు యువరాజు.. జూనియర్ ఎన్టీఆర్.. సినిమాలో దమ్ము ఉంటే కలెక్షన్ల దుమ్ము దులపగలిగే స్టార్ హీరో.. ఇద్దరూ ఈ దసరాకు వారం గ్యాప్‌లో పోటీ పడబోతున్నారు. ఒకరు స్పైడర్ రూపంలో వస్తుంటే.. మరొకరు జై లవకుశ అంటూ ప్రేక్షకులను అలరించబోతున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో విభిన్న పాత్రలో మహేశ్ నటిస్తోంటే.. బాబీ దర్శకత్వంలో ఏకంగా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వచ్చిన ఈ రెండు సినిమాల టీజర్లు యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. సెప్టెంబర్ 21న జై లవకుశ విడుదలైన వారం రోజులకు సెప్టెంబర్ 27న స్పైడర్ తెరపై సందడి చేయనుంది. ఈ రెండు సినిమాలకు కూడా ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉంది. 
 
స్పైడర్ సినిమాను ఓవర్సీస్‌లో తెలుగు తమిళ హక్కులను 23.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. తెలుగు వెర్షన్‌ను రూ.15.5 కోట్లకు, తమిళ వెర్షన్ హక్కులకు మరో 8 కోట్లు.. మొత్తం 23.5 కోట్లను వెచ్చించి స్పైడర్ ఓవర్సీస్ హక్కులను ఓ బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసిందట. జై లవకుశ  సినిమాను కూడా ఓవర్సీస్‌లో భారీ మొత్తానికే కొనుగోలు చేసినట్లు టాక్. 10.5 కోట్ల రూపాయలతో ఓవర్సీస్ హక్కులు అమ్ముడుపోయినట్లు చిత్ర వర్గాల సమాచారం.
 
ఓవర్సీస్‌లో కనీసం 2.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొడితేనే జై లవకుశ డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలో పడతారు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా ఓవర్సీస్‌లో 1.80 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేయగా.. నాన్నకు ప్రేమతో సినిమా 2.02 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌లో నటిస్తున్న ఎన్టీఆర్ సినిమాపై ఎన్నారైలు బాగానే ఆసక్తి కనపరుస్తున్నారు. సినిమా కనుకు హిట్ టాక్ తెచ్చుకుంటే.. 2.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయడం జై లవకుశకు పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకుల అంచనా. 
 
ఇక మహేష్ స్పైడర్ విషయానికి వస్తే.. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ తమిళ, తెలుగు వెర్షన్స్ రెండూ కలిపి 23.5 కోట్ల రూపాయలు. అంటే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలో పడాలంటే కనీసం 4.5 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మహేష్‌కు ఓవర్సీస్‌లో టాప్ కలెక్షన్ సినిమా అయిన శ్రీమంతుడు.. 2.89 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. సినిమాలో ఎన్నారై కంటెంట్ ఉండటం, కథాబలం ఉండటంతో 2.89 మిలియన్ డాలర్లను శ్రీమంతుడు కలెక్ట్ చేసింది. మురుగదాస్ సినిమాలంటే ఓవర్సీస్‌లో మంచి అభిప్రాయం ఉంది. మొత్తానికి మురుగదాస్ మార్క్ కథ.. మహేశ్ మార్క్ యాక్షన్ కలగలిసిన స్పైడర్‌కు 4.5 మిలియన్ డాలర్ల కలెక్షన్లు తప్పకుండా వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ రెండు సినిమాలకు మామూలు హిట్ టాక్ వస్తే చాలు కలెక్షన్లు కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్లను లాభాలబాటలో పడేస్తాయి. అదే కథలో ఏమాత్రం తేడా వచ్చినా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తుందో.. ఎవరు దసరా హీరోగా నిలుస్తారో.. ఎన్ని రికార్డులు తిరగరాస్తారో త్వరలోనే తేలనుంది. 

 

Loading...