overseas-collections-for-awe-movie

‘అ..!’ సినిమాకు ప్రీమియర్ కలెక్షన్లు ఎంతంటే..

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్ ప్రధాన తారాగణంగా రూపుదిద్దుకున్న ‘అ..!’ సినిమా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాని నిర్మాతగా వ్యహరించిన ఈ మొదటి సినిమా శుక్రవారం విడుదలైంది. సినిమాకు రెండు తెలుగురాష్ట్రాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ప్రతిచోటా మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమాను తెరకెక్కించిన విధానం అద్భుతంగా ఉందని, పాత్రలను దర్శకుడు కొత్తగా తెరకెక్కించాడని సినీ ప్రేక్షకులు చెపుతున్నారు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చిన నానిని మెచ్చుకోవాలని అంటున్నారు. ప్రేక్షకుల స్పందనకు తగ్గట్టే సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందాయి. 
 
కాగా.. ఈ సినిమా ఓవర్సీస్‌లో ఓ రోజు ముందుగానే విడుదలయింది. అ..! సినిమాను నిర్వాణ సినిమాస్ అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసింది. మొత్తం 112 స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేశారు. ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబట్టింది. రూ.76 లక్షలకు( 118,773 డాలర్లు)పైగా కొల్లగొట్టింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మరిన్ని స్ర్కీన్లను పెంచాలని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. వీకెండ్ కావడం, ఇతర సినిమా నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో గణనీయ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెపుతున్నారు.