:: Welcome to NRI - Article ::

మూడు రోజుల్లోనే అరుదైన రికార్డును క్రియేట్ చేసిన ‘అర్జున్‌రెడ్డి’

మిలియన్ డాలర్ల మార్కు.. ఓవర్సీస్‌ కలెక్షన్లలో అదొక ట్రేడ్ మార్కు. స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ మార్కును దాటడం కష్టమే. ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల మార్కును ఏదైనా సినిమా దాటేస్తే చాలు.. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు పండగ చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాప్ టాక్ వచ్చినా.. ఓవర్సీస్‌లో మంచి కలెక్షన్లు రావడం వల్లే పలు పెద్ద సినిమాల డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్‌లో పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి మిలియన్ డాలర్ల మార్కును ‘అర్జున్ రెడ్డి’.. కేవలం మూడు రోజుల్లోనే దాటేసి స్టార్ హీరోల సినిమాల సరసన నిలిచింది. 
 
నిర్వాణ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్లో అమెరికాలో అర్జున్ రెడ్డి సినిమా విడుదలయింది. దాదాపు 85 స్క్రీన్లలో అమెరికాలో సందడి చేస్తోంది. తక్కువ సంఖ్యలో స్క్రీన్లలో ఈ సినిమా విడుదలయినా ప్రతి షో ఫుల్ పబ్లిక్‌తో నిండిపోతోంది. అందుకే కలెక్షన్లు కూడా విపరీతంగా వస్తున్నాయి. గురువారం ప్రీమియర్ షోలకే.. లక్షా 94వేల 51 డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత శుక్రవారం 2 లక్షల 52వేల 296 డాలర్లు వచ్చాయి. శనివారం 3 లక్షల 21వేల డాలర్లను కొల్లగొట్టింది. ఆదివారం లక్షా 61వేల డాలర్లు కలెక్ట్ అయినట్లు రిపోర్ట్ వచ్చిందనీ, ఇంకా పూర్తి కలెక్షన్ రిపోర్టులు రావాల్సి ఉందనీ ఏదిఏమైనా మిలియన్ డాలర్ల మార్కును దాటేయడం ఖాయమని తేల్చిచెబుతోంది ‘నిర్వాణ సినిమాస్’. మొత్తానికి విడుదలయిన మొదటి వీకెండ్‌లోనే రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకెళ్తుండటంతో అర్జున్ రెడ్డి డిస్ట్రిబ్యూటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.