:: Welcome to NRI - Article ::

ఓం నమో వేంకటేశాయ... అద్భుతమట

అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి వంటి భక్తిరస చిత్రాల తర్వాత.. నాగార్జున, రాఘవేంద్రరావు కలయికలో వస్తున్న మరో సినిమా ‘ఓం నమోవేంకటేశాయ’. వెంకటేశ్వరుడి పరమ భక్తుడు హధీరామ్ బాబా జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగార్జున, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ నటులతో పాటు.. బుల్లి తెరపై కృష్ణుడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన సౌరబ్.. కలియుగ దైవం వెంకటేశ్వరుడి పాత్రను పోషిస్తున్నారు. మొత్తం భారీ అంచనాల మధ్య శుక్రవారం తెలుగు రాష్ట్రాల థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా.. గురువారమే ప్రిమియర్ షోల ద్వారా ఓవర్సీస్‌లో రిలీజయింది. 
 
ఈ సినిమా చూసిన ఎన్నారైలు చెబుతున్న ఒకే ఒక్క మాట.. ‘సూపర్బ్ మూవీ’ అని. భక్తుడి పాత్రలో నాగార్జున, కలియుగ దైవం పాత్రలో సౌరభ్ ఒదిగిపోయారట. అన్నమయ్య తర్వాత వెంకటేశ్వరుడి ఇతివృత్తాన్ని తీసుకున్న రాఘవేంద్రరావు, నాగార్జున.. అదే రేంజ్‌లో హిట్ కొట్టారని ఎన్నారై ప్రేక్షకులు చెబుతున్నారు. కథ, కథనం, భక్తి భావాన్ని రేకెత్తించే పాటలు, మాటలు, వీటితోపాటు విజువల్స్ అన్నీ ఓ దృశ్యకావ్యాన్ని సృష్టించాయంటున్నారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా చెబుతున్నారు. మొత్తంగా రాఘవేంద్రరావు తన మార్కు భక్తి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు, వెంకటేశ్వరుడి భక్తులకు అందించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ భక్తి రస చిత్రం ఎలా ఉండాలో.. అదే రేంజ్‌లో ఉందని చెబుతున్నారు. ‘అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకా..’ పాట ప్రేక్షకుల మదిని దోస్తుందంటున్నారు.