NTR-Kathanayakudu-Premiere-show-Review

ఎన్టీఆర్- కథానాయకుడుపై ప్రవాసుల ప్రశంసలు

సినీ అభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రానే వచ్చింది. తెలుగు ప్రజల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు సినీ జీవితాన్ని ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ పేరుతో, రాజకీయ జీవితాన్ని ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ పేరుతో దర్శకుడు క్రిష్ తెరకెక్కించారు. మొదటగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు.. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ, బసవతారకంగా విద్యాబాలన్ నటించారు. నందమూరి కల్యాణ్‌రామ్, రానా, ప్రకాశ్ రాజ్, నరేష్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్.. వంటి భారీ తారాగణం కలిగిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. అమెరికాలో కూడా పెద్ద సంఖ్యలో స్క్రీన్లలో విడుదలయింది. తెలుగు రాష్ట్రాల కంటే ముందుగానే జనవరి 8న అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా విడుదలయింది. 

 
అమెరికాలో ఈ సినిమాను యూఎస్ తెలుగు మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అమెరికాలో మొత్తం 190కి పైగా స్క్రీన్లలో ఎన్టీఆర్ కథానాయకుడు  సందడి చేస్తోంది. అగ్రరాజ్యంలోని తెలుగు ప్రవాసులు ఈ సినిమా పట్ల విపరీతంగా ఆసక్తి కనపరిచారు. ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా చూసిన ఎన్నారైలు.. చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేన్సర్‌తో బాధపడుతున్న బసవతారకం కోణంలో ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఉంటుందని చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చక్కగా తెరకెక్కించారంటున్నారు. మాయాబజార్ సినిమా సందర్భంగా అత్యంత నాటకీయంగా ఎన్టీఆర్ కృష్ణుడి వేషాన్ని ధరించినప్పుడు వచ్చే సీన్లు ప్రేక్షకులకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయంటున్నారు. రావణబ్రహ్మ, వెంకటేశ్వర స్వామి, దుర్యోధన పాత్రల్లోనూ బాలయ్య అదరగొట్టారంటున్నారు. ఓవైపు కన్న కొడుకు ప్రాణాలతో పోరాడుతున్నా.. నిర్మాతకు నష్టం రాకూడదన్న భావనతో ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌కు వెళ్లడం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుందంటున్నారు. అక్కినేని, ఎన్టీఆర్‌ల మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో ఈ సినిమా చూస్తే తెలుస్తుందంటున్నారు. సందర్భోచితంగా వచ్చే పాటలు, కీరవాణి సంగీతం మెప్పిస్తాయంటున్నారు. రచయిత బుర్రా సాయిమాధవ్ రాసిన మాటలు శభాష్ అనిపిస్తాయని ఎన్నారైలు చెబుతున్నారు. సినిమా నిడివి కొంచెం ఎక్కువగా ఉండటం మాత్రం సినిమాకు మైనస్ అనీ, అయినప్పటికీ ప్రేక్షకులు ఏమాత్రం బోర్ ఫీలవరని ఎన్నారైలు తేల్చిచెబుతున్నారు. ఎన్టీఆర్‌గా బాలయ్య ఒదిగిపోయారనీ, ఈ సినిమాకు క్రిష్ నూటికి నూరుపాళ్లు న్యాయం చేశారని ప్రశంసిస్తున్నారు.