Mahanati-weekend-Collections

వీకెండ్‌లో మహానటికి పోటెత్తిన కలెక్షన్లు

తన నటనతో, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకుల మదిని దోచిన సావిత్రి జీవిత చరిత్ర ‘మహానటి’ రూపంలో రానే వచ్చింది. నాటకరంగం నుంచి సీని రంగంలోకి.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన తీరును నేటి తరానికి తెలియజెప్పబోతోంది. మహానటి సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ నటించగా, దుల్కర్ సల్మాన్, మోహన్‌బాబు, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దర్శకుడు క్రిష్, అవసరాల శ్రీనివాస్, భానుప్రియ.. వంటి భారీ తారాగణంతో నాగ్ ఆశ్వీన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లోనూ ‘మహానటి’ సినిమా భారీ అంచనాల మధ్య బుధవారం విడుదలయింది. అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఒదిగిపోయారని, అచ్చం సావిత్రిని చూస్తున్నట్లే అనిపించిందని అంతా అనుకుంటున్నారు. 

 
ఓవర్సీస్‌లో మంగళవారం ప్రీమియర్ల ద్వారా విడుదలయిన మహానటికి.. మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మహానటిని చూసేందుకు ఎన్నారైలు థియేటర్ల వద్దకు క్యూ కడుతున్నారు. స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో ఇంకా సందడి చేస్తున్నా.. వాటికి ధీటుగా కలెక్షన్లను రాబడుతూ మహానటి సత్తా చాటుతోంది. మొదటి వీకెండ్ నాటికి ఓవర్సీస్‌లో మహానటి 1.5 మిలియన్ డాలర్ల (దాదాపు 10 కోట్ల 9లక్షల రూపాయలు) కలెక్షన్లను కొల్లగొట్టినట్టు అమెరికా డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్వాణ సినిమాస్ అధికారికంగా ప్రకటిచింది. అటు కెనడాలో కూడా ఈ సినిమా కలెక్షన్లను కొల్లగొడుతోంది. శనివారం నాటికి ఈ సినిమా 19వేల 250 డాలర్లను (12.98 లక్షలు) కలెక్ట్ చేసింది.