Mahanati-places-top-13-in-Overseas

అమెరికాలో మహానటి.. టాప్-13వ స్థానంలో..

తెలుగులో వచ్చిన మొట్టమొదటి బయోపిక్ అయిన ‘మహానటి’కి.. సినీ ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. మహానటి సావిత్రి జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపిన దర్శకుడు నాగ్ ఆశ్వీన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సావిత్రి పాత్రలో నటించిన కీర్తిసురేష్.. ‘మహానటి’గా ఒదిగిపోయారంటున్నారు. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, దర్శకుడు క్రిష్, అవసరాల శ్రీనివాస్.. తదితరులు నటించిన ‘మహానటి’ సినిమా విడుదలయి ఘనంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. 

ఈ సినిమాను తీర్చిదిద్దిన విధానంపై సినీ ప్రేక్షకుల నుంచి సినీ పరిశ్రమ దిగ్గజాల వరకు ప్రసంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాకు రికార్డు స్థాయి కలెక్షన్లు కూడా వస్తున్నారు. తెలుగు, తమిళ రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా విడుదలయింది. అమెరికాలో ‘నిర్వాణ సినిమాస్’ మహానటిని డిస్ట్రిబ్యూట్ చేసింది. ప్రవాసులను కూడా ఈ సినిమా ఫిదా చేసింది. స్టార్ హీరోల సినిమాలు ఉన్నా సరే.. అదే స్థాయిలో మహానటికి కూడా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. అమెరికాలో 150 స్క్రీన్లలో విడుదలయిన ఈ సినిమా ఇప్పటికే 1.8 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. 

మరికొద్ది రోజుల్లో 2మిలియన్ డాలర్ల కలెక్షన్లను దాటేస్తుందని డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు. ఈ మేరకు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్‌ను పెట్టారు. 1.8 మిలియన్ డాలర్లతో మహానటి సినిమా.. ఓవర్సీస్‌లో అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాల లిస్ట్‌లో 13వ స్థానంలో నిలిచిందని తెలిపారు. అర్జున్‌రెడ్డి, జనతాగ్యారేజ్, గౌతమిపుత్ర శాతకర్ణి, స్పైడర్, జై లవకుశ సినిమాల కలెక్షన్ల రికార్డులను మహానటి ఇప్పటికే దాటేసింది. అర్జున్‌రెడ్డికి 1.78 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాగా.. జనతాగ్యారేజ్ 1.80 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ రెండు సినిమాల కలెక్షన్లను దాటేసి.. టాప్ -13 స్థానంలో మహానటి నిలిచింది.