Mahanati-3-day-US-box-office-collection

‘మహానటి’ మూడు రోజుల కలెక్షన్లు ఇవే..

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రాంతంతో సంబంధం లేకుండా ‘మహానటి’కి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్‌తోపాటు నటీనటులందరికీ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ముఖ్యంగా దర్శకుడు నాగ్ అశ్విన్, సావిత్రి పాత్రను పోషించిన కీర్తి సురేష్‌‌కు అందరూ జేజేలు కొడుతున్నారు. మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మండమైన కలెక్షన్లను రాబడుతోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద విశేషమైన కలెక్షన్లను కొల్లగొడుతోంది. ప్రిమియర్ షోల ద్వారా మంగళవారమే విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ మార్క్‌‌కు చేరువైంది. మూడు రోజుల్లోనే 9 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. మరో లక్ష డాలర్లు రాబడితే 1 మిలియన్ డాలర్ క్లబ్ సినిమాల జాబితాలో ‘మహానటి’కి చోటుదక్కుతుంది. ఈ సినిమా కలెక్షన్ల వివరాలను అమెరికాలో మహానటి డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన ‘నిర్వాణ సినిమాస్’ అధికారికంగా వెల్లడించింది. 

కాగా మహానటి సినిమాకు ముందే విడుదలయిన ‘నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’కు అన్ని చోట్లా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఓవర్సీస్‌లో మాస్ సినిమాలకు కలెక్షన్లు తక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకు కూడా ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. విడుదలయిన ఏడు రోజుల్లో ఈ సినిమా 7లక్షల డాలర్లను మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ మహానటి మాత్రం ఈ కలెక్షన్లను మూడు రోజుల్లోనే సులభంగా దాటేసింది. నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా సినిమా కలెక్షన్లను మహానటి కేవలం మూడు రోజుల్లోనే దాటేసిందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదిలావుండగా ఈ ఏడాది అమెరికాలో ప్రిమియర్ల ద్వారా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల జాబితాలో ‘మహానటి’ నాలుగవ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.