mahaanati-mania-in-USA

కొనసాగుతున్న ‘మహానటి’ మేనియా !

బే ఏరియా, కాలిఫోర్నియా: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని ప్రపంచ వ్యాప్తంగా బుధవారం విడుదలైన సినిమా ‘మహానటి’ సినీ ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి మన్ననలు పొందుతోంది. సావిత్రి పాత్రలో కీర్తిసురేష్ జీవించగా, దుల్కర్ సల్మాన్, మోహన్‌బాబు, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దర్శకుడు క్రిష్, అవసరాల శ్రీనివాస్, భానుప్రియ.. వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. పాతతరం నుంచి నేటితరం వరకూ అన్నీ వర్గాల ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఓవర్సిస్‌లో విడుదల చేసిన ‘నిర్వాణ సినిమాస్’ లెజెండరీ నటి సావిత్రికి నివాళులు అర్పించేందుకు కాలిఫోర్నియాలోని బేరియాలో మహిళల కోసం ‘మహానటి’ ప్రత్యేక షోను ప్రదర్శించనుంది. అంతేకాకుండా వారికి డ్రస్‌కోడ్‌ను కూడా పెట్టింది. లంగావోణీ, చీర మాత్రమే ధరించి సినిమాకు రావాలని కోరింది. కేవలం మహిళలు మాత్రమే వీక్షించనున్న ఈ సినిమాకు సావిత్రిలా వస్త్రధారణ చేసుకుని వస్తే మరింత అభినందనీయమని వివరించింది.. మే 13, ఆదివారం సాయంత్రం 4: 00 గంటలకు ప్రదర్శించనున్న ఈ షోకి కాలిఫోర్నియాలోని శాన్ జోస్, 1433 ది అలామెడా, టౌనే 3 సినిమా వేదిక కానుంది. సినిమా ప్రారంభమవ్వడానికి ముందు వేడుకలు ఉంటాయని, టికెట్ ధర 12 డాలర్లని నిర్వాణ సినిమాస్ ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇదిలావుండగా ‘మహానటి’ ఓవర్సిస్‌లో మంచి కలెక్షన్లు రాబడుతోన్న సంగతి తెలిసిందే.