:: Welcome to NRI - Article ::

ఖైదీ నెంబర్ 150.. ప్రీమియర్స్ చూసిన వారి స్పందన

ఖైదీ నెంబర్ 150.. మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటించగా.. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కోసం మెగా అభిమానులే కాదు తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించగా.. దేవీశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్‌ను అందించాడు.  అశేష అభిమానులను అలరించడం ఖాయం అని ధీమాగా చెప్పిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేలకు పైగా థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తమిళంలో హిట్ కొట్టిన సబ్జెక్ట్‌ను తీసుకున్న ‘ఖైదీ నెంబర్ 150’ బృందం.. సక్సెస్‌ కోసం తీవ్రంగానే శ్రమించింది. కథా పరంగా భారీగా కసరత్తులు చేయనవసరం లేకపోవడంతో కామెడీ పార్ట్‌ను మాత్రం జోడించి చిన్న చిన్న మార్పులు చేశామని దర్శక నిర్మాతలు చెప్పారు. మరి ప్రీమియర్ షోల ద్వారా అమెరికాలో ఈ సినిమాను చూసిన సినీ ప్రియులు ఏమనుకుంటున్నారో ఓ లుక్కేద్దాం. 
 
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వస్తున్న మెగా హీరోకు గతంలోనే హిట్ కొట్టిన సబ్జెక్ట్ తీసుకోవడం ప్లస్ అయిందని ఓ అభిమాని అభిప్రాయపడ్డాడు. చిరు డాన్స్, ఫైట్స్, డైలాగ్ డెలివరీ, నటన సూపర్బ్ అని కామెంట్ ఇచ్చాడు. సినిమాలో బలమైన విలన్ లేకపోవడం కొంత  మైనస్‌ పాయింట్ అని మరో అభిమాని చెప్పాడు. కథ, పాటలు, స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉన్నాయనీ, డాన్సుల్లో ఇరగదీశాడనీ, నేటి తరం హీరోలు ఎవరూ అన్నయ్య ముందు సాటిరారని మరో అభిమాని కామెంట్ పెట్టాడు. కథలో జోడించిన బ్రహ్మానందం కామెడీ ట్రాక్ అంతగా వర్కవుట్ కాలేదనీ, పోసాని, అలీ, చిరు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు మరింత మెరుగ్గా ఉంటే బాగుండేదని చెబుతున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ విత్ సెన్సేషనల్ హిట్ అంటూ మరో అభిమాని స్పందించాడు. మొత్తానికి ఈ సినిమా కొత్త యేడాదిలో సంక్రాంతి హిట్ కొట్టిన మొదటి సినిమాగా చెప్పుకోవచ్చు.